ఖమ్మంలో 182 పబ్లిక్‌ టాయ్‌లెట్లు

ABN , First Publish Date - 2020-08-14T10:11:02+05:30 IST

పట్టణ ప్రగతిలో భాగంగా నగరంలో పబ్లిక్‌ టాయ్‌లెట్ల నిర్మాణాలు వేగంగా సాగుతున్నాయి.

ఖమ్మంలో 182 పబ్లిక్‌ టాయ్‌లెట్లు

41 ప్రాంతాల్లో నిర్మాణం

15న  ప్రారంభించేందుకు ఏర్పాట్లు

 

ఖమ్మం కార్పొరేషన్‌, ఆగస్టు13: పట్టణ ప్రగతిలో భాగంగా నగరంలో పబ్లిక్‌ టాయ్‌లెట్ల నిర్మాణాలు వేగంగా సాగుతున్నాయి. నగరంలో ప్రతీ 1000 మందికి ఒక పబ్లిక్‌ టాయ్‌లెట్‌ నిర్మించాలని పురపాలక శాఖమంత్రి కే.తారక రామారావు ఆదేశాలు జారీ చేశారు. ఇటీవల నిర్వహించిన ఖమ్మం, కొత్తగూడెం జిల్లాల సమావేశంలో పలు సూచనలు చేశారు. అనంతరం రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్‌ కుమార్‌ నగరపాలక సంస్థ అధికారులతో సమావేశం నిర్వహించారు. నగరంలో జరుగుతున్న అభివృద్ధి పనులపై సమీక్ష నిర్వహించారు. ఆయన ఆదేశం మేరకు నగరపాలక సంస్థ కమిషనర్‌ అనురాగ్‌జయంతి పర్యవేక్షణలో నగరంలో 41 ప్రాంతాల్లో 182 పబ్లిక్‌ టాయ్‌లెట్ల నిర్మాణం వేగంగా సాగుతున్నది. ఇందులో 50 పబ్లిక్‌ టాయ్‌లెట్లు పూర్తికాగా, వాటిని ఈనెల15న మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌ ప్రారంభిస్తారని నగరపాలక సంస్థ అధికారులు తెలిపారు.


ఆధునిక మోడళ్లలో నిర్మాణం.

నగరంలో ఆధునిక పద్ధతుల్లో పబ్లిక్‌ టాయ్‌లెట్ల నిర్మాణం చేపడుతున్నారు. లూకేఫ్‌ మోడల్లో 15 టాయిలెట్లు, బయోడైజిక్‌ మోడల్‌లో 28 టాయిలెట్లు నిర్మిస్తున్నారు. రద్దీ ప్రదేశాల్లో, వ్యాపార సముదాయాల్లో ప్రజా మరుగుదొడ్లు నిర్మాణానికి ప్రాధాన్యతను ఇస్తున్నారు. మొత్తం 182 టాయిలెట్లలో 50 పూర్తికాగా, మిగతావి దాదాపు పూర్తయ్యే దశలో ఉన్నాయి. 

Updated Date - 2020-08-14T10:11:02+05:30 IST