కరోనా విజృంభణ

ABN , First Publish Date - 2021-04-09T04:49:44+05:30 IST

జిల్లాలో కరోనా వైరస్‌ మళ్లీ విజృంభిస్తోంది. గురువారం ఒక్కరోజే ఏకంగా 185 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. దీంతో జిల్లావాసులు, అధికారులు ఉలిక్కిపడ్డారు.

కరోనా విజృంభణ

ఒక్కరోజే 185 పాజిటివ్‌ కేసులు నమోదు

భయాందోళన చెందుతున్న జిల్లావాసులు

(శ్రీకాకుళం,ఆంధ్రజ్యోతి, ఏప్రిల్‌ 8)

జిల్లాలో కరోనా వైరస్‌ మళ్లీ విజృంభిస్తోంది. గురువారం ఒక్కరోజే ఏకంగా 185 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. దీంతో జిల్లావాసులు, అధికారులు ఉలిక్కిపడ్డారు. జిల్లాలో గత ఏడాది కరోనా వ్యాప్తి ప్రారంభం నుంచి ఇప్పటివరకు 9,68,593 నమూనాలు సేకరించగా..  కరోనా బాధితుల సంఖ్య 47,662కు చేరింది. వీరిలో చాలామంది కోలుకున్నారు. ప్రస్తుతం రెండోదశ కరోనా వ్యాప్తి తీవ్రత పెరుగుతోంది. ప్రస్తుతం ఐసోలేషన్‌ కేంద్రంలో 618 మంది, కొవిడ్‌ కేర్‌ సెంటర్లలో 44 మంది, కొవిడ్‌ ఆస్పత్రుల్లో 76 మంది చికిత్స పొందుతున్నారు. గతంలో కరోనా పాజిటివ్‌ నిర్ధారణ కాగానే, వారి ఆరోగ్య పరిస్థితిని బట్టి.. ఆసుపత్రికి... లేదా క్వారంటైన్‌ కేంద్రానికి అధికారులు తక్షణమే తరలించేవారు. ప్రస్తుతం ఆ పరిస్థితి లేదు. రోజువారీ వందల్లో కేసులు పెరుగుతున్నా... హోం ఐసోలేషన్‌లో ఉన్నవారి స్థితిగతులను కూడా పరిశీలిస్తున్న దాఖలాలు లేవు. ప్రస్తుతం ప్రభుత్వ సర్వజన ఆసుపత్రిలో మాత్రమే కరోనా బాధితులకు సేవలు అందుతున్నాయి. కేసుల తీవ్రత పెరిగితే భారీ సంఖ్యలో బెడ్స్‌.. అంతేస్థాయిలో ఆక్సిజన్‌ సామర్థ్యం గల వెంటిలేటర్లు అవసరమవుతాయి. ఈ దిశగా అధికారులు చర్యలు తీసుకోలేదు. కొవిడ్‌ ఆసుపత్రిల్లో కూడా అప్పట్లో నియమించిన అదనపు సిబ్బందిని వివిధ కారణాలతోనూ.. ఒప్పందం ప్రకారం తొలగించేశారు. ఇవన్నీ మళ్లీ భర్తీ చేయాల్సి ఉంది. కరోనా చికిత్స పేరుతో కొన్ని ప్రైవేటు ఆస్పత్రులు భారీగా దందా చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో ప్రభుత్వ ఆస్పత్రులతో పాటు జెమ్స్‌లో కూడా మళ్లీ కరోనా సేవలు అందించేలా చర్యలు తీసుకోవాలని జిల్లావాసులు కోరుతున్నారు. 


 ఏర్పాట్లు చేస్తున్నాం 

జిల్లాలో కరోనా రెండోదశ వ్యాప్తి పెరిగింది. అందుకే వెయ్యి బెడ్స్‌ సిద్ధం చేస్తున్నాం. జెమ్స్‌ ఆసుపత్రిలో కూడా సేవలు అందుబాటులోకి తీసుకువస్తున్నాం.  వెంటిలేటర్లు కొరత లేకుండా చర్యలు తీసుకున్నాం. క్వారంటైన్‌ కేంద్రాలను తెరిచాం. కరోనాపై నిర్లక్ష్యం వహించకుండా ప్రజలు జాగ్రత్తలు పాటించాలి. 

- చంద్రానాయక్‌, డీఎంహెచ్‌వో

Updated Date - 2021-04-09T04:49:44+05:30 IST