రెండో విడత రుణమాఫీకి 1,850 కోట్లు!

ABN , First Publish Date - 2021-08-02T07:18:02+05:30 IST

రెండో విడత రుణమాఫీ కోసం ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న రైతులకు కేబినేట్‌ నిర్ణయంతో కాస్త ఉపశమనం కలిగింది.

రెండో విడత రుణమాఫీకి 1,850 కోట్లు!

రూ. 25 వేలు - 50 వేల కేటగిరీలో 6.13 లక్షల మంది రైతులు

ఆగస్టు 15 నుంచి పంపిణీకి ఆదేశాలు

కుటుంబం ప్రాతిపదికగా ఎంపిక


హైదరాబాద్‌, ఆగస్టు 1 (ఆంధ్రజ్యోతి): రెండో విడత రుణమాఫీ కోసం ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న రైతులకు కేబినేట్‌ నిర్ణయంతో కాస్త ఉపశమనం కలిగింది. రూ. 25 వేల నుంచి రూ. 50 వేల వరకు ఉన్న పంట రుణాలను మాఫీ చేయాలని సీఎం కేసీఆర్‌ అధ్యక్షతన ఆదివారం నిర్వహించిన కేబినేట్‌ భేటీలో నిర్ణయం తీసుకోవటం గమనార్హం. ఈనెల 15వ తేదీ నుంచి రుణమాఫీ ప్రక్రియ మొదలుపెట్టి నెలఖారు వరకు పూర్తి చేయనున్నారు. ఇందుకుగాను రూ. 1,850 కోట్ల నిధులు రాష్ట్ర ప్రభుత్వం సర్దుబాటు చేయాల్సి ఉంటుంది. కాగా కుటుంబ సభ్యుల సంఖ్యను, వారి పేరుమీద ఉన్న రుణాల లెక్కను ప్రాతిపదికగా తీసుకొని వ్యవసాయశాఖ లబ్ధిదారులను ఎంపిక చేయనుంది. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో సీఎం కేసీఆర్‌ ఇచ్చిన హామీ మేరకు.. రైతులకు రూ. 1 లక్ష వరకు పంట రుణాలు మాఫీ చేయాల్సి ఉంది. 2014 ఏప్రిల్‌ ఒకటో తేదీ నుంచి 2018 డిసెంబరు 11 తేదీ వరకు కటా్‌ఫగా తీసుకొని బ్యాంకర్లు లెక్క తీస్తే.. 40.66 లక్షల మంది రైతులు ఈ పథకం పరిధిలోకి వచ్చారు. వీరందరికీ కలిపి రూ. 25,936 కోట్ల బకాయిలు ఉన్నట్లు లెక్కతేల్చారు. అయితే.. నాలుగేళ్లలో నాలుగు విడతలుగా రుణ మాఫీ చేస్తామని చెప్పిన ప్రభుత్వం.. నిరుడు నిర్ణయం మార్చుకొని రూ. 25 వేల లోపు బకాయిలు ఉన్న రైతులకు మాత్రమే రుణమాఫీ చేసింది. ఇదిలాఉండగా రూ. 25 వేల నుంచి రూ. లక్ష వరకు ఉన్న బకాయిలను నాలుగు విడతల్లో మాఫీ చేస్తామని సీఎం కేసీఆర్‌ నిరుడు చెప్పటంతో.. ఆ మేరకు లెక్కలు తీసి ప్రభుత్వానికి వ్యవసాయశాఖ నివేదిక సమర్పించింది. ఆదివారం నాటి కేబినేట్‌ భేటీలో రుణమాఫీ అంశంపై చర్చ జరిగింది.


లబ్ధిదారుల ఎంపికకు వ్యవసాయశాఖ కసరత్తు

నేషనల్‌ ఇన్‌ఫర్మేటిక్‌ సెంటర్‌ (ఎన్‌ఐసీ)తో సమన్వయం చేసుకుంటూ లబ్ధిదారులను ఎంపిక చేయటానికి నేటి(సోమవారం)నుంచి వ్యవసాయశాఖ కసరత్తు ప్రారంభించనుంది. లబ్ధిదారుల ఎంపికకు చేసే వడపోతలో రైతుల రేషన్‌కార్డులు, ఆధార్‌ కార్డులు, సమగ్ర కుటుంబ సర్వే వివరాలే కీలకం కాబోతున్నాయి. వీటిని సీడింగ్‌ చేసి లబ్ధిదారులను ఎంపిక చేయనున్నారు. ఆధార్‌ కార్డుతో ఒక రైతుకు ఎన్ని బ్యాంకు ఖాతాలు ఉన్నాయో తేలుస్తారు. రేషన్‌ కార్డు, సమగ్ర కుటుంబ సర్వేతో కుటుంబంలో ఉన్న సభ్యుల సంఖ్య తేలిపోతుంది. కుటుంబం మొత్తానికి కలిపి రూ. 1 లక్ష వరకు మాఫీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించటంతో.. లబ్ధిదారుల సంఖ్య బాగా తగ్గే అవకాశాలున్నాయి.

Updated Date - 2021-08-02T07:18:02+05:30 IST