కొత్తగా 1850 కేసులు

ABN , First Publish Date - 2020-07-05T07:27:19+05:30 IST

కరోనా మహమ్మారి రాష్ట్రంపై విరుచుకుపడుతోంది. శనివారం కొత్తగా మరో 1850 మందికి పాజటివ్‌ నిర్ధారణ అయింది.

కొత్తగా 1850 కేసులు

  • హైదరాబాద్‌లోనే 1572 మందికి కరోనా
  • 4 రోజుల్లోనే 5,973.. మొత్తం 22,312
  • దేశంలో ఆరో స్థానానికి చేరిన తెలంగాణ
  • ఐదుగురు మృతి.. మొత్తం మరణాలు 288
  • టీఆర్‌ఎస్‌ నేత మహేందర్‌రెడ్డికి పాజిటివ్‌
  • కరోనాతో జనవిజ్ఞాన వేదిక నేత విక్రమ్‌ మృతి
  • ఆంధ్రప్రదేశ్‌లో ఒక్కరోజే 765 కేసులు 

హైదరాబాద్‌, జూలై4 (ఆంధ్రజ్యోతి): కరోనా మహమ్మారి రాష్ట్రంపై విరుచుకుపడుతోంది. శనివారం కొత్తగా మరో 1850 మందికి పాజటివ్‌ నిర్ధారణ అయింది. రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 22,312కు చేరింది. కేసుల వారీగా చూస్తే దేశంలో మహారాష్ట్ర, తమిళనాడు, ఢిల్లీ, గుజరాత్‌, ఉత్తరప్రదేశ్‌ తర్వాత ఆరో స్థానంలో తెలంగాణ నిలిచింది. హైదరాబాద్‌ పరిధిలో ఒక్క రోజే 1572 మందికి పాజిటివ్‌ వచ్చింది. గత 24 గంటల్లో వైరస్‌ కారణంగా మరో ఐదుగురు కన్ను మూశారు. దీంతో కరోనా మరణాల సంఖ్య 288కి చేరింది. శనివారం 1,342 మంది కోలుకొని డిశ్చార్జి కాగా, ప్రస్తుతం రాష్ట్రంలో 10,487 యాక్టివ్‌ కేసులున్నాయి. కాగా, మేడ్చల్‌లో 272, రంగారెడ్డిలో 89, వికారాబాద్‌ జిల్లాలో 4 కేసులు నమోదైనట్లు అధికారులు తెలిపారు.


మూడు జిల్లాలో కలిపి మొత్తం బాధితుల సంఖ్య 1,963కి చేరింది. మహబూబ్‌నగర్‌లో 26 కేసులు నమోదు కాగా, జడ్చర్లలో ఓ మహిళ మృతి చెందారు. ఎమ్మెల్యే గొంగిడి సునీతకు ఇటీవల పాజిటివ్‌ రాగా, ఆమె భర్త, టెస్కాబ్‌ వైస్‌ చైర్మన్‌ మహేందర్‌రెడ్డికి సైతం కరోనా నిర్ధారణ అయింది. జనవిజ్ఞాన వేదిక (జేవీవీ)జాతీయ ఉపాధ్యక్షుడు నమ్మి విక్రమ్‌ కరోనా బారిన పడి గాంధీ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ శనివారం మృతి చెందారు.  


రోగిని ఊరి నుంచి పంపాలంటూ ధర్నా

కరోనా పాజిటివ్‌ వచ్చిన మహిళను గ్రామం నుంచి పంపించి వేయాలంటూ సూర్యాపేట జిల్లా నడిగూడెం మండల కేంద్రంలో స్థానికులు శనివారం ఆందోళన చేశారు. నడిగూడెం మండల కేంద్రానికి చెందిన కేన్సర్‌ బాధితురాలు వైద్య పరీక్షల నిమిత్తం గత నెల 23న హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్‌ ఆస్పత్రికి వెళ్లింది. అక్కడ నిర్వహించిన పరీక్షల్లో ఆమెకు పాజిటివ్‌ రావడంతో స్థానిక వైద్యులు ఆమెతో పాటు ఇద్దరు కుమారులను హోం కార్వంటైన్‌ చేసి చికిత్స అందిస్తున్నారు. విషయం తెలుసుకున్న స్థానికులు శనివారం తహసీల్దార్‌ కార్యాలయం ఎదుట ఆందోళనకు దిగారు.  


హుస్సేన్‌ సాగర్‌లో దూకి..

కరోనా సోకిందన్న అనుమానంతో ఓ వ్యక్తి హుస్సేన్‌ సాగర్‌లో దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. పశ్చిమ బెంగాల్‌కు చెందిన పల్టు పాన్‌ (34) హుస్సేనీఆలంలో ఉంటూ స్వర్ణకార వృత్తి కొనసాగిస్తున్నాడు. కొన్ని రోజులుగా శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది నెలకొనడంతో పలు ఆస్పత్రుల్లో చూపించుకున్నాడు. కరోనా లక్షణాలు ఉండడంతో పెద్దాస్పత్రికి వెళ్లాలని అక్కడి డాక్టర్లు సూచించారు. అదే అనుమానం పెంచుకున్న పల్టు.. శుక్రవారం సాయంత్రం తన స్నేహితుడు శ్రీరాములుతో కలిసి హుస్సేన్‌సాగర్‌ వద్దకు వచ్చాడు. కొద్దిసేపు మాట్లాడిన తర్వాత కాస్త ముందు వరకూ వెళ్లిన పల్టు ఒక్కసారిగా హుస్సేన్‌ సాగర్‌లోకి దూకేశాడు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.

Updated Date - 2020-07-05T07:27:19+05:30 IST