నెలలో కోటిన్నర ఉద్యోగాలు గల్లంతు

ABN , First Publish Date - 2021-06-03T06:01:51+05:30 IST

దేశంలో కరోనా 2.0 ఉధృతి, స్థానిక లాక్‌డౌన్ల ప్రభావం కొలువులపై తీవ్రంగా పడింది. వరుసగా నాలుగు నెలలుగా ఉద్యోగాలు తగ్గుతూ వస్తుండగా ఒక్క మే నెలలోనే 1.5 కోట్లకు పైగా ఉద్యోగాలు

నెలలో కోటిన్నర ఉద్యోగాలు గల్లంతు

పట్టణ నిరుద్యోగిత 18% : సీఎంఐఈ

రోజువారీ కూలీలపైనే అధిక ప్రభావం


న్యూఢిల్లీ: దేశంలో కరోనా 2.0 ఉధృతి, స్థానిక లాక్‌డౌన్ల ప్రభావం కొలువులపై తీవ్రంగా పడింది. వరుసగా నాలుగు నెలలుగా ఉద్యోగాలు తగ్గుతూ వస్తుండగా ఒక్క మే నెలలోనే 1.5 కోట్లకు పైగా ఉద్యోగాలు గల్లంతయ్యాయి. సెంటర్‌ ఫర్‌ మానిటరింగ్‌ ఇండియన్‌ ఎకానమీ (సీఎంఐఈ) తాజా డేటా ప్రకారం గత నెల 30తో ముగిసిన వారానికి పట్టణ నిరుద్యోగిత రేటు ఏడాది గరిష్ఠ స్థాయి 18 శాతానికి దూసుకుపోయింది. ‘‘ఈ ఏడాది ఏప్రిల్‌లో 39.08 కోట్లుగా నమోదైన దేశవ్యాప్త ఉద్యోగాలు.. మే నెలలో 3.9 శాతం తగ్గి 37.55 కోట్లకు పడిపోయాయి.


అంటే, ఒక్క నెలలోనే 1.53 కోట్ల ఉద్యోగాలు కనుమరుగయ్యాయి’’ అని సీఎంఐఈ ఎండీ, సీఈఓ మహేశ్‌ వ్యాస్‌ కంపెనీ వెబ్‌సైట్‌లో పేర్కొన్నారు. సీఎంఐఈ కన్జ్యూమర్‌ పిరమిడ్‌ హౌస్‌హోల్డ్‌ సర్వే ప్రకారం.. రోజు కూలీలపై లాక్‌డౌన్‌ ప్రభావం తీవ్రంగా ఉంది. అయితే గ్రామీణ నిరుద్యోగిత రేటు తగ్గడం కొంత ఉపశమనం. మే నెల 23తో ముగిసిన వారానికి 13.5 శాతంగా ఉన్న గ్రామీణ నిరుద్యోగిత రేటు 30వ తేదీతో ముగిసిన వారానికి 9.6 శాతానికి తగ్గింది. 


గడిచిన రెండు నెలల్లో 2.27 కోట్లు

వరుసగా నాలుగు నెలలుగా ఉద్యోగాలు తగ్గుతూ వస్తున్నాయని, ఏప్రిల్‌, మే నెలల్లోనే తగ్గుదల అధికంగా నమోదైందని వ్యాస్‌ తెలిపారు.  ‘‘ఈ ఏడాది జనవరిలో మొత్తం ఉద్యోగాల సంఖ్య 40.07 కోట్లుండగా అది మే చివరి నాటికి 37.55 కోట్లకు పడిపోయింది. అంటే, ఈ ఏడాదిలో ఇప్పటివరకు 2.53 కోట్ల మంది ఉద్యోగం కోల్పోవాల్సి వచ్చింది. గడిచిన రెండు నెలల్లోనే 2.27 కోట్ల ఉద్యోగ నష్టం జరిగింది’ అన్నారు. 


ఉద్యోగనష్టం నిజమే: సుబ్రమణియన్‌

దేశంలో కరోనా ప్రభావం వల్ల నిరుద్యోగిత పెరిగిందని ప్రముఖ ప్రధాన ఆర్థిక సలహాదారు కేవీ సుబ్రమణియన్‌ అంగీకరించారు. ఎన్‌డీటీవీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ కరోనా 1.0 ఉదృతి తగ్గిన వెంటనే గత ఆర్థిక సంవత్సరం మూడు, నాలుగు త్రైమాసికాల్లో కీలకమైన నిర్మాణం, తయారీ రంగాల పునరుద్ధరణకు ప్రభుత్వం చర్యలు తీసుకున్నదని ఆయన చెప్పారు. అలాగే గత కొద్ది రోజులుగా దేశంలో కేసుల సంఖ్య నిలకడగా తగ్గుతున్నదని, కేసులు మరింతగా తగ్గిన వెంటనే కీలక ఆర్థిక కార్యకలాపాలు పూర్తి స్థాయిలో పునరుద్ధరించేందుకు చర్యలు తీసుకుంటామన్నారు.

Updated Date - 2021-06-03T06:01:51+05:30 IST