అసోంలో దారుణం.. కొండచరియలు విరిగిపడి 19 మంది మృతి

ABN , First Publish Date - 2020-06-03T01:07:55+05:30 IST

అసోంలో దారుణం జరిగింది. కొండచరియలు విరిగిపడి 19 మంది ప్రాణాలు కోల్పోయారు. మరో ఇద్దరు తీవ్రంగా

అసోంలో దారుణం.. కొండచరియలు విరిగిపడి 19 మంది మృతి

గువాహటి: అసోంలో దారుణం జరిగింది. కొండచరియలు విరిగిపడి 19 మంది ప్రాణాలు కోల్పోయారు. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. దక్షిణ అసోంలోని బరాక్ లోయ జిల్లాలైన హైలాకండీ, కరీంగంజ్ కచర్‌లలో ఈ ఉదయం నుంచి ఎడతెగని వర్షాలు కురుస్తున్నాయి. దీంతో కొండచరియలు విరిగిపడుతున్నాయి. హైలాకండ్ జిల్లాలో బోలోబాబజర్ సమీపంలోని మోహన్‌పూర్ ప్రాంతంలో ఈ ఉదయం ఆరు గంటల సమయంలో ఓ చిన్న ఇంటిపై కొండ చరియలు విరిగిపడ్డాయి. ఈ ఘటనలో ఏడుగురు మృతి చెందారు. వీరిలో ఇద్దరు చిన్నారులు, ఓ మహిళ ఉన్నారు. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను వెంటనే హైలాకండిలోని ఎస్‌కే సివిల్ ఆసుపత్రికి తరలించారు.  


కరీంగంజ్ జిల్లాలో జరిగిన మరో ఘటనలో ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు. వీరిలో ఓ మహిళ, ముగ్గురు చిన్నారులు ఉన్నారు. కచర్ జిల్లాలోని కోలాపూర్ గ్రామంలో కొండ చరియలు విరిగిపడి మరో ఏడుగురు మృతి చెందారు. సమాచారం అందుకున్న వెంటనే ఎస్‌డీఆర్ఎఫ్ సిబ్బంది ఘటనా స్థలాలకు చేరుకుని సహాయక కార్యక్రమాలు చేపట్టారు. మృతుల కుటుంబాలకు అసోం ముఖ్యమంత్రి సర్బానంద సోనోవాల్ నివాళులు అర్పించారు. 

Updated Date - 2020-06-03T01:07:55+05:30 IST