సొంతింటి కల సాకారం

ABN , First Publish Date - 2020-06-05T10:24:40+05:30 IST

గత చంద్రబాబు ప్రభుత్వ హయాంలో పట్టణ పేదల కోసం నిర్మించిన జీ+3 ఇళ్ల సముదాయాన్ని వైఎస్‌ జయంతిని పురస్కరించుకుని జూలై 8న

సొంతింటి కల సాకారం

  • టిడ్కో ఇళ్ల పంపిణీకి సన్నాహాలు
  • 2432 ఇళ్లు సిద్ధం
  • జూలై 8న లబ్ధిదారులకు అందజేత


కడప, జూన్‌ 4 (ఆంధ్రజ్యోతి): గత చంద్రబాబు ప్రభుత్వ హయాంలో పట్టణ పేదల కోసం నిర్మించిన జీ+3 ఇళ్ల సముదాయాన్ని వైఎస్‌ జయంతిని పురస్కరించుకుని జూలై 8న లబ్ధిదారులకు అందించేందుకు అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. వీటితో పాటు 1,22,356 మంది పేదలకు ఇంటి స్థలాలను కూడా ఇవ్వనున్నారు. ఈ మేరకు లబ్ధిదారుల గుర్తింపు కూడా పూర్తయింది. అప్పటి చంద్రబాబు సర్కారు పట్టణ పేదలకు సొంతింటి కలను సాకారం చేసేందుకు జి+3 ఇళ్ల నిర్మాణానికి శ్రీకారం చుట్టింది. షేర్‌వాల్‌ టెక్నాలజీతో నిర్మాణం చేపట్టారు. జిల్లాలో 19,232 ఇళ్లు మంజూరయ్యాయి.


కడపలో 992, జమ్మలమడుగులో 1440 ఇళ్ల నిర్మాణం పూర్తయ్యాయి. అయితే డోర్లు, వైరింగ్‌, నీటి సరఫరా తదితర వసతుల కల్పన పూర్తి కాలేదు. డబ్బులు చెల్లించిన లబ్ధిదారులకు ఆ ఇళ్లను ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఎవరైనా వద్దనుకుంటే మాత్రం మిగతా వారికి కేటాయిస్తారని తెలిసింది. జిల్లాలో కడప నగరం, ప్రొద్దుటూరు, ఎర్రగుంట్ల, రాయచోటి, రాజంపేట, బద్వేలు, మైదుకూరు, పులివెందుల, జమ్మలమడుగు మున్సిపాలిటీల్ల్లో పేదలకు పక్కా గృహాలు నిర్మాణాలకు గత చంద్రబాబు ప్రభుత్వం శ్రీకారం చుట్టింది.  300, 360, 430 చదరపు అడుగుల విస్తీర్ణంలో మూడు క్యాటగిరీల వారీగా కేటాయించారు.


ఏపీ టిడ్కో సంస్థ పర్యవేక్షణలో జీ+3 ఇళ్ల సముదాయం నిర్మాణాలు చేపట్టారు. 12,907 ఇళ్ల నిర్మాణాలు ప్రారంభమైతే వాటిలో కేవలం 3,292 ఇళ్లు మాత్రమే పైకప్పు (రూఫ్‌లెవల్‌) పూర్తి చేశారు. రూ.155.58 కోట్లు ఖర్చు చేసినట్లు ఏపీ టిడ్కో ఇంజనీర్లు పేర్కొన్నారు. టిడ్కో పర్యవేక్షణలో నివాస గృహ సముదాయం నిర్మాణాలు దాదాపు పూర్తయ్యాయి. అయితే ఆయా బ్లాకులకు అవసరమైన మౌలిక వసతులు కల్పించలేదు. రహదారులు, విద్యుత్‌, నీటి సౌకర్యం కల్పించాల్సి ఉంది. వీటన్నింటినీ కాంట్రాక్టర్లు పూర్తి చేయాల్సి ఉంది. జూలై 8 లోపు పూర్తి స్థాయి మౌలిక వసతులు కల్పిస్తారా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. 


జిల్లాలో ఆయా మున్సిపాలిటీల్లో ఫేజ్‌-1, 2, 3 కింద నిర్మించిన జీ+3 ఇళ్ల వివరాలు:

మున్సిపాలిటీ మంజూరైనవి గ్రౌండెడ్‌ నాట్‌ స్టార్‌టెడ్‌ బేస్మెంట్‌ రూఫ్‌ లెవల్‌


కడప 4,373 2,608 1,765 1,016 1,598

ప్రొద్దుటూరు 4,150 4,150 -- 4,046 101

జమ్మలమడుగు 1,415 1,415 -- 11 1,404

ఎర్రగుంట్ల 2,046 2,045 -- 2,046 --

రాయచోటి 1,011 1,008 3 816 192

రాజంపేట 1,279 336 943 336 --

బద్వేలు 888 624 264 624 --

పులివెందుల 3,143 720 2,423 720 --

మైదుకూరు 927 -- 927 -- --

మొత్తం 19,232 12,907 6,325 9,615 3,292

Updated Date - 2020-06-05T10:24:40+05:30 IST