9 ఏళ్ల బాలికపై హత్యాచారం.. 62 సంవత్సరాల తర్వాత వీడిన చిక్కుముడి!

ABN , First Publish Date - 2021-11-24T00:01:42+05:30 IST

1959లో 9 ఏళ్ల చిన్నారిపై జరిగిన హత్యాచారం కేసు చిక్కుముడి 62 సంవత్సరాల తర్వాత తాజాగా వీడింది

9 ఏళ్ల బాలికపై హత్యాచారం.. 62 సంవత్సరాల తర్వాత వీడిన చిక్కుముడి!

వాషింగ్టన్: అమెరికాలోని వాషింగ్టన్ స్టేట్‌లో 1959లో 9 ఏళ్ల చిన్నారిపై జరిగిన హత్యాచారం కేసు చిక్కుముడి 62 సంవత్సరాల తర్వాత తాజాగా వీడింది. అత్యాధునిక డీఎన్‌ఏ సాంకేతికతను ఉపయోగించి ఈ కేసులో నిందితుడిని ఎట్టకేలకు గుర్తించగలిగారు.  బాధితురాలైన 9 ఏళ్ల కేండీ రోగర్స్‌పై ఆమె కంటే 11 ఏళ్ల పెద్దవాడైన నిందితుడు మార్చి 1959లో అత్యాచారానికి పాల్పడి ఆపై గొంతునులిమి చంపేశాడు. 


హత్య జరిగిన రోజు చిన్నారి వాషింగ్టన్‌లోని స్పోకనేలో చాక్లెట్లు విక్రయిస్తోంది. ఆ రోజు తిరిగి ఆమె ఇంటికి చేరుకోలేదు. తల్లిదండ్రులు గాలించినా ఫలితం లేకపోయింది. రెండు వారాల తర్వాత చిన్నారి మృతదేహం లభ్యమైంది. 62 సంవత్సరాలుగా కొనసాగుతున్న ఈ కేసు దర్యాప్తునకు తాజాగా ఫుల్‌స్టాప్ పడింది. ఆర్మీ జవాను జాన్ రీగ్ హాఫ్ ఈ అఘాయిత్యానికి పాల్పడినట్టు తాజా డీఎన్ఏ పరీక్షల్లో తేలింది. దోషిగా తేలకుండానే 1970లో అతడు మృతి చెందడం గమనార్హం. 



ఘటన జరిగిన సమయంలో రీగ్ స్పోకనే కౌంటీలోని ఫెయిర్‌చిల్ట్ ఎయిర్‌ఫోర్స్ బేస్‌లో ఉన్నట్టు స్పోకనే పోలీసులు అధికారులు తాజాగా తెలిపారు. 1961లో నిందితుడిని అరెస్ట్ చేశారు. అయితే, ఈ కేసులో నిందితులను తేల్చడం పోలీసులకు దుర్లభంగా మారింది.


ఒకానొక సమయంలో ఈ కేసును పోలీసు అధికారులు ‘ఎవరెస్ట్ పర్వతం’తో పోల్చారు. ఈ ఏడాది మొదట్లో కేండీ శరీరం పైనుంచి సేకరించిన వీర్యపు నమూనాలను టెక్సాస్‌లోని డీఎన్‌ఏ లేబొరేటరీలో పరీక్షలకు పంపారు. ముగ్గురు అనుమానిత నిందితుల్లో ఇది ఒకరిగా పోలీసులు గుర్తించారు. మిగతా ఇద్దరు నిందితులు కూడా అతడి సోదరులే కావడం గమనార్హం. 


ఈ మొత్తం దర్యాప్తులో రీగ్ కుమార్తె పోలీసులకు సహకరించారు. ఖననం చేసిన రీగ్ మృతదేహాన్ని వెలికి తీసేందుకు ఆమె అంగీకరించారు. ఈ క్రమంలో బాలిక శరీరంపై నుంచి సేకరించిన వీర్యం రీగ్‌దేనని తేలింది.


మరో వ్యక్తితో పోలిస్తే అది అతడి డీఎన్ఏ అయ్యే అవకాశం  25 క్విన్టిలియన్ (18 సున్నాలు) రెట్లు ఎక్కువ అని పోలీసులు నిర్ధారించారు. భయంకరమైన కేండీ రోజర్స్ హత్యకు సంబంధించిన రహ్యస్యాన్ని అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం ద్వారా ఛేదించామని తరాలపాటు డిటెక్టివ్‌లు పనిచేశారని వివరించింది. కేసు చిక్కుముడి వీడడంతో 62 సంవత్సరాల తర్వాత కేసును మూసివేశారు. 

Updated Date - 2021-11-24T00:01:42+05:30 IST