Advertisement
Advertisement
Abn logo
Advertisement

అమ్మో.. ఒకటో తారీఖు..!

ఈ తేదీ అంటేనే అందరికీ వణుకు

వెంటాడుతున్న అప్పులు

కూరగాయలు, కిరాణా బడ్జెట్‌ రెట్టింపు

మధ్యతరగతి ఢమాల్‌

వేతన జీవులదీ ఇదే పరిస్థితి

నెలవారీ వేతనాలు లేక రోడ్డున పడ్డ వందలాది మంది 

(ఏలూరు–ఆంధ్రజ్యోతి) :

ఒకప్పుడు ఫస్ట్‌ వస్తుందంటే చాలు తెగ సంబరపడిపోయేవారు. వేతన జీవులంతా ఈ తేదీ కోసమే ఎదురుచూసేవారు.  రాబడి, ఖర్చు బేరీజు వేసుకునేవారు. ఇంటి అద్దె దగ్గర నుంచి కిరాణా పట్టీ వరకు అప్పటికప్పుడే పద్దులు కట్టి ఫస్ట్‌ నుంచి ఐదులోపు అంతా సర్దేసేవారు. ఇంటి ఇల్లాలు కోరిన కోర్కెలను కొన్ని కోతలు కోసి తరువాత ఓకే అనేవారు.. కానీ ఫస్ట్‌ తారీఖు పట్టుతప్పింది. సామాన్యుడు మొదటి తేదీ అంటేనే హడలెత్తిపోతున్నాడు. కళ్లెదుట కనిపిస్తున్న ఖర్చులు, అప్పులు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయి. మార్కెట్‌కి వెళ్తే సంచి కూరగాయలు వందల్లోనే. కిరాణా రెట్టింపైంది. ఇంటి అద్దె సరేసరి. సాదాసీదా ఖర్చులు తడిసిమోపెడు. ఇదంతా ఒకెత్తయితే నెలల తరబడి జీతాలు అందక వేతన జీవులు పడే కష్టాలెన్నో...


మారిన మధ్య తరగతి బడ్జెట్‌ 

గడచిన ఆరు నెలల కాలంలో సామాన్యుడి నెలవారీ బడ్జెట్‌ తల్లకిందులైంది. కిరాణా ఖర్చులు తడిసిమోపెడయ్యాయి. కూర‘గాయాలు’అవుతున్నాయి. ఇక పెట్రోలు, గ్యాస్‌ బండ ఖర్చు ఒకప్పుడు సాధారణ తరగతి ఖర్చు మూడు వేల లోపే.. ఇప్పుడది ఐదు వేలకు పెరిగింది. సాదాసీదా జీతాలతో బతికేవారికి ఈ ఖర్చు భారమే. ఆఖరుకి పాలు దగ్గర నుంచి వంట నూనెలు, పప్పులు, ఉప్పులు ఇలా ఒకటేమిటి ఏదంటే అది తెగ పెరిగిపోయాయి. సాధారణ కిరాణా ఖర్చులు మూడు నుంచి ఐదు వేలకు పెరిగాయి. ఇవి రానురాను మరింత పెరగడమే తప్ప తగ్గుముఖం పట్టేలా కనిపించడం లేదు. ఇక ఊరూవాడా ఆటో చార్జీలు సరేసరి. ఇంటి అద్దె భయపెడుతోంది. విద్యుత్‌ చార్జీలు ఘొల్లుమనిపిస్తున్నాయి. పిల్లల ఫీజులు కట్టాలంటేనే దడ. ఒక్క మాటలో చెప్పాలంటే నెలంతా కష్టపడి సాధించిన సంపాదన ఏ మూలకు సరిపోవడం లేదు. ఆఖరుకి కొన్ని మధ్య తరగతి కుటుంబాలు పెరిగిన ఖర్చులతో మాంసాహారానికి దూరమయ్యాయి. రేషన్‌ బియ్యానికి అలవాటు పడ్డాయి. ఇంతకుముందు సన్న బియ్యం అంటూ మోజుపడేవారంతా ఇప్పుడు ఈ దశకు వచ్చారు. 


ఉద్యోగుల్లోనూ అసంతృప్తే 

ప్రైవేటు, ప్రభుత్వ ఉద్యోగాల్లో ఉన్నవారు, రోజువారి కూలీతో బతుకీడ్చుకొచ్చేవారు, చిన్నచిన్న వ్యాపారులు, రోడ్డుపక్క చిరు వ్యాపారులు పెరిగిన ధరలతో బెంబేలెత్తిపోతున్నారు. నెలవారీ బడ్జెట్‌ ఎప్పుడో గీత దాటింది. ఆ స్థానంలో అప్పులు పెరిగాయి. ఈ అప్పు తీర్చేందుకు ‘ఫస్ట్‌’కు వాయిదా వేసినా అది కాస్తా దగ్గరపడేంతవరకు మరింత అప్పు. ఉద్యోగులకు నెలవారీ వేతనాలు చేతికందుతున్నా ఏదో తెలియని లోటే. అంచనాలకు మించి వైద్య ఖర్చులు, ప్రయాణ ఖర్చులు. అంతకంటే మించి ఇంట్లో వయసు మీరిన వారుంటే ఆ ఖర్చు సరేసరి. దూర ప్రయాణం చేయాలంటే జేబులు ఖాళీ. ప్రభుత్వ ఉద్యోగులైతే మాకు నెలవారీ వేతనం సరిపోలేదంటూ తెగ గగ్గోలు పెట్టేస్తున్నారు.  వివిధ పథకాలపై ఉన్నంత శ్రద్ధ మార్కెట్‌లో ధరల అదుపునకు లేదంటూ వేతన జీవులు రగిలిపోతున్నారు.  


అసలు జీతాలు రానివారి సంగతేంటి 

గడచిన కొంతకాలంగా వందల మందికి రావాల్సిన గౌరవ వేతనం, కాంట్రాక్టు వేతనం, అవుట్‌ సోర్సింగ్‌ వేతనాలు రాక పెండింగ్‌లో పడ్డాయి. ఇలా జిల్లా వ్యాప్తంగా వందలాది మంది ఫస్ట్‌ కోసం ఎదురుచూస్తూనే ఉన్నారు. గ్రామ పంచాయతీ నిర్వహణ కోసం స్వీపర్లు, బిల్లు కలెక్టర్లు, జూనియర్‌ అసిస్టెంట్లు, అటెండర్లు దాదాపు 200 మందికి గడిచిన రెండు నెలలుగా పైసా వేతనం ఇవ్వడం లేదు. వీరంతా సంవత్సరాల తరబడి తాత్కాలిక ఉద్యోగులుగా చలామణి అయ్యి ఆ తరువాత శాశ్వత ఉద్యోగులైనా వేతనం మాత్రం చేతికందలేదు. ఫలితంగా ఫస్ట్‌ తారీఖు రాగానే అలో లక్ష్మణ అంటూ కనిపించిన వారందరికీ తమ గోడు వినిపిస్తూనే ఉన్నారు. మహిళా పొదుపు సంఘాలను సమన్వయపరిచి ముందుకు నడిపించే వెలుగు యానిమేటర్లు కూడా ఇప్పుడు పస్తులే. వీరందరికీ గౌరవ వేతనం చెల్లించక చాలా కాలమైంది. అదిగో ఇదిగో అంటూనే కాలయాపన చేసేశారు.  ఇలాంటి వారి సంఖ్య దాదాపు జిల్లా వ్యాప్తంగా 2,500 మందికిపైగానే ఉంది. ఇక కాలువల్లో నీటి సరఫరా నిర్వహణకు సంబంధించి కీలక పాత్ర పోషించేదే లష్కర్లు. వీరిలో కొందరిని అవుట్‌ సోర్సింగ్‌లో తీసుకున్నారు. భీమవరం, నిడదవోలు డివిజన్లలో వీరికి పది నెలల నుంచి జీతాలే చెల్లించడం లేదు. కాస్తంత వీరికి సాయపడాలని ఎమ్మెల్యేలు సైతం ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నా ఫలితం లేదు. కొవిడ్‌ రోగులకు సేవలందించేందుకు విడతలవారీగా వందల మందిని అవుట్‌సోర్సింగ్‌లో తీసుకున్నారు. వీరికి ఇవ్వాల్సిన వేతనాలను ఇప్పటికీ చెల్లించలేదు. ఆఖరుకి ఆరోగ్య మంత్రి నివాసం ముట్టడికి ప్రయత్నించినా అతీగతీలేదు. 600 మందికిపైగా ఈ తరహా సేవకులకు ఇంకా వేతన బకాయి చేతికందనే లేదు. 


Advertisement
Advertisement