పుల్వామాలో ఎన్‌కౌంటర్.. ఇద్దరు జైషే ఉగ్రవాదులు హతం..

ABN , First Publish Date - 2020-06-03T04:12:34+05:30 IST

జమ్మూ కశ్మీర్‌లోని పుల్వామా జిల్లాలో ఇవాళ భద్రతా బలగాలు ఇద్దరు ఉగ్రవాదులను మట్టుబెట్టాయి...

పుల్వామాలో ఎన్‌కౌంటర్.. ఇద్దరు జైషే ఉగ్రవాదులు హతం..

శ్రీనగర్: జమ్మూ కశ్మీర్‌లోని పుల్వామా జిల్లాలో ఇవాళ భద్రతా బలగాలు ఇద్దరు ఉగ్రవాదులను మట్టుబెట్టాయి. మృతి చెందిన ఇద్దరు ఉగ్రవాదులు జైషే మహ్మద్ (జేఈఎం) ఉగ్రసంస్థలో పనిచేస్తున్నట్టు గుర్తించామని పోలీసులు వెల్లడించారు. ట్రాల్‌లో సైమోలో పాంపోష్ కాలనీ వద్ద ఉగ్రవాదులు సంచరిస్తున్నట్టు సమాచారం అందడంతో స్థానిక పోలీసులు, సీఆర్పీఎఫ్ బలగాలు సంయుక్తంగా కార్డన్ సెర్చ్ నిర్వహించినట్టు పోలీసులు పేర్కొన్నారు. గాలింపు జరుపుతుండగానే ఉగ్రవాదులు కాల్పులు ప్రారంభించడంతో భద్రతా బలగాలు ఎదురుకాల్పులు జరిపారనీ.. దీంతో ఓ ఉగ్రవాది అక్కడికక్కడే మరణించాడని పోలీసులు తెలిపారు.


మరో ఉగ్రవాది ఇళ్ల వైపు పరుగెత్తడంతో అక్కడ అందర్నీ ఖాళీ చేయించి కార్డన్ సెర్చ్ నిర్వహించారు. అయితే ఘటనా స్థలిలో దాదాపు 40 మంది గుమిగూడి రాళ్లు రువ్వడం మొదలు పెట్టారు. దీంతో టియర్ గ్యాస్ ఉపయోగించి వారిని చెదరగొట్టారు. మళ్లీ కార్డన్ సెర్చ్ కొనసాగించిన భద్రతా బలగాలు.. ఓ నీటిపైపు వద్ద ఉగ్రవాది నక్కినట్టు గుర్తించారు. అక్కడి నుంచే అతడు కాల్పులు జరపడంతో.. భద్రతా బలగాలు అతడిని మట్టుబెట్టాయని పోలీసులు తెలిపారు. కాగా ఈ ఎన్‌కౌంటర్‌లో ఎక్కడా ఎలాంటి ఆస్తినష్టం జరగకుండా జాగ్రత్తలు తీసుకున్నామని అధికారులు వెల్లడించారు. కొవిడ్-19 నిబంధనల కారణంగా ప్రస్తుతానికి ఉగ్రవాదుల గుర్తింపు వివరాలను వెల్లడించడం లేదని తెలిపారు.  

Updated Date - 2020-06-03T04:12:34+05:30 IST