Abn logo
Jun 4 2020 @ 17:41PM

పోలీసు అధికారిని కత్తితో పొడిచిన దుండగుడు.. న్యూయార్క్‌లో..

బ్రూక్లిన్: నల్ల జాతీయుడు జార్జ్ ఫ్లాయిడ్ మరణంతో అమెరికా అల్లకల్లోలంగా మారింది. అమెరికా వ్యాప్తంగా నిరసనలు మిన్నంటుతున్నాయి. వేలాది మంది నిరసనకారులు రోడ్లెక్కడంతో పరిస్థితి అదుపు తప్పింది. మరోపక్క దేశవ్యాప్తంగా అనేక మంది పోలీసు అధికారులపై దాడులు జరుగుతున్నాయి. తాజాగా న్యూయార్క్‌ నగరంలో ఓ దుండగుడు విధులు నిర్వర్తిస్తున్న పోలీసు అధికారి మెడపై కత్తితో పొడిచాడు. వెంటనే అక్కడకు వచ్చిన మరో ఇద్దరు పోలీసు అధికారులపై కూడా దుండగుడు దాడి చేశాడు. ఇదే సమయంలో ఇద్దరు పోలీసు అధికారులు దుండగుడిని తుపాకీతో కాల్చారు. ప్రస్తుతం ఘటనలో గాయపడిన నలుగురు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. పోలీసులకు స్వల్ప గాయాలే అయినప్పటికి.. దుండగుడిని తుపాకీతో కాల్పడంతో పరిస్థితి విషమంగా ఉన్నట్టు వైద్యులు తెలిపారు. పోలీసు అధికారి ఫ్లాట్‌బష్ ఎవెన్యూ దగ్గర విధులు నిర్వర్తిస్తున్న సమయంలో దుండగుడు అక్కడకు వచ్చి కత్తితో మెడపై ఎడమ భాగాన గాయం చేసినట్టు పోలీసులు తెలిపారు. దుండగుడు నిరసనల్లో భాగంగా కత్తితో పొడిచాడా లేదా వేరే కారణంతో ఈ ఘటనకు పాల్పడ్డాడా అన్నది తెలియాల్సి ఉంది. ఇదిలా ఉండగా.. కొద్ది రోజుల క్రితం సెయింట్ లూయిస్‌లోనూ నలుగురు పోలీసులపై నిరసనకారులు కాల్పులు జరిపారు. మరో నగరంలో ఓ పోలీసు అధికారి ప్రాణాలు కూడా కోల్పోయాడు.

Advertisement
Advertisement
Advertisement