ప్రైవేటు టీచర్లకు 2 వేల సాయం

ABN , First Publish Date - 2021-04-09T09:01:42+05:30 IST

కరోనా కారణంగా స్కూళ్లు మూతపడి.. వేతనాల్లేక కుటుంబాన్ని కూడా పోషించుకోలేని దీన పరిస్థితుల్లో ఉన్న ప్రైవేటు పాఠశాలల ఉపాధ్యాయులకు ప్రభుత్వం

ప్రైవేటు టీచర్లకు 2  వేల సాయం

కుటుంబానికి 25 కిలోల బియ్యం కూడా 

పాఠశాలలు ప్రారంభమయ్యేదాకా అమలు

ఈనెల నుంచే.. కలెక్టర్లకు దరఖాస్తు చేసుకోండి

ఆపత్కాలంలో ఆదుకునేందుకే ఈ నిర్ణయం

1.5 లక్షల కుటుంబాలకు లబ్ధి: సీఎం కేసీఆర్‌ 

సాగర్‌ ప్రైవేటు ఉపాధ్యాయుడి భార్య ఆత్మహత్య

2 రోజుల క్రితం భర్త రవికుమార్‌ బలవన్మరణం


హైదరాబాద్‌, ఏప్రిల్‌ 8 (ఆంధ్రజ్యోతి): కరోనా కారణంగా స్కూళ్లు మూతపడి.. వేతనాల్లేక కుటుంబాన్ని కూడా పోషించుకోలేని దీన పరిస్థితుల్లో ఉన్న ప్రైవేటు పాఠశాలల ఉపాధ్యాయులకు ప్రభుత్వం ఊరటనిచ్చే నిర్ణయం తీసుకుంది. వారికి ఆపత్కాల ఆర్థికసాయం అందించాలని నిర్ణయించింది. గుర్తింపు పొందిన ప్రైవేటు పాఠశాలల ఉపాధ్యాయులకు రూ.2 వేల ఆర్థికసాయంతోపాటు కుటుంబానికి 25 కేజీల చొప్పున బియ్యాన్ని రేషన్‌ షాపుల ద్వారా ఉచితంగా అందించాలని సీఎం కేసీఆర్‌ అధికారులను ఆదేశించారు. స్కూళ్లను తిరిగి ప్రారంభించేదాకా ప్రతి నెలా వీటిని అందజేయాలని, ఏప్రిల్‌ నుంచే దీనిని అమలు చేయాలని అన్నారు. ఇందుకోసం ప్రైవేటు పాఠశాలల ఉపాధ్యాయులు, సిబ్బంది తమ బ్యాంకు అకౌంటు, ఇతర వివరాలతో స్థానిక జిల్లా కలెక్టర్లకు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుందని ముఖ్యమంత్రి తెలిపారు. ప్రైవేటు టీచర్లు, ఇతర సిబ్బంది కుటుంబాలను మానవీయ దృక్ఫథంతో  ఆదుకోవాలని ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుందని అన్నారు.


ఇందుకు సంబంధించి శుక్రవారం ఉదయం 11.30 గంటలకు బీఆర్కే భవన్‌లో అన్ని జిల్లాల కలెక్టర్లు, డీఈవోలు, పౌరసరఫరాల శాఖ అఽధికారులతో వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించాలని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి, పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్‌, ప్రభుత్వ ప్రధాన సలహాదారు రాజీవ్‌శర్మను సీఎం కేసీఆర్‌ ఆదేశించారు. సమావేశం అనంతరం విధి విధానాలు, కార్యాచరణ ప్రణాళిక అమలుకు ఆదేశాలు జారీ చేయనున్నారు. కాగా, రాష్ట్రంలో గుర్తింపు పొందిన ప్రైవేటు స్కూళ్లలో పనిచేస్తున్న దాదాపు లక్షన్నర మంది కుటుంబాలకు ఈ నిర్ణయంతో లబ్ధి చేకూరుతుందని ప్రభుత్వం తెలిపింది. ప్రభుత్వ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నట్లు తెలంగాణ ప్రైవేటు టీచర్ల ఫోరం (టీపీటీఎఫ్‌) అధ్యక్షుడు షబ్బీర్‌ అలీ అన్నారు. కాగా, ఈ సాయాన్ని ప్రభుత్వ పాఠశాలల్లో పనిచేసిన విద్యా వలంటీర్లకూ వర్తింపజేయాలని తెలంగాణ విద్యా వలంటీర్ల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు శివానందస్వామి కోరారు. 


అర్హులను గుర్తించేదెలా..?  

ప్రైవేటు పాఠశాలల ఉపాధ్యాయులు, సిబ్బందికి ఆర్థిక సాయం, బియ్యం అందించేందుకు.. వారిని గుర్తించేది ఎలా అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి. విద్యాశాఖ రికార్డుల ప్రకారం రాష్ట్ర వ్యాప్తంగా 10,984 గుర్తింపు పొందిన పాఠశాలలుండగా.. వీటిలో 2.50 లక్షలకు పైగా ఉపాధ్యాయులు, సిబ్బంది పనిచేస్తున్నారు.


ప్రైవేటు పాఠశాలలో పనిచేస్తున్న ప్రతి ఉపాధ్యాయుడి వివరాలూ విద్యాశాఖ వద్ద ఉన్నాయి. అయితే అవి ఎన్నేళ్ల క్రితం నాటివన్నదే ప్రశ్నార్థకం. పాఠశాల అనుమతి కోసం దరఖాస్తు చేసే సమయంలో యాజమాన్యాలు.. ఉపాధ్యాయులు, వారి అర్హతల వివరాలను సమర్పిస్తారు. ఆ పాఠశాల నుంచి వారు మారినప్పుడు కొత్తగా చేరిన వారి వివరాలను అప్‌డేట్‌ చేయాల్సి ఉంటుంది. కానీ, అనేక పాఠశాలల్లో ప్రారంభంలో పేర్కొన్నవారి వివరాలే ఉంటాయి. ఆర్థికసాయాన్ని రికార్డుల్లో ఉన్న వారికే అందిస్తే.. చాలా మందికి అన్యాయం జరుగుతుందని ప్రైవేటు ఉపాధ్యాయుల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. ఈఎ్‌సఐ, పీఎఫ్‌ ఆధారంగా ఇస్తే.. 50వేల మందికి కూడా ఈ సౌకర్యం లేదంటున్నారు.


సాగర్‌ ప్రైవేటు ఉపాధ్యాయుడి భార్య ఆత్మహత్య

నాగార్జునసాగర్‌: ఆర్థిక ఇబ్బందులతో రెండు రోజుల క్రితం ఆత్మహత్య చేసుకున్న నాగార్జునసాగర్‌కు చెందిన ప్రైవేటు టీచర్‌ రవికుమార్‌ భార్య కూడా బలవన్మరణానికి పాల్పడ్డారు. పెద్దవూర మండలంలోని ఓ ప్రైవేటు స్కూల్‌లో టీచర్‌గా పనిచేస్తున్న రవికుమార్‌(30) ఈ నెల 6న తన ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే. స్కూళ్లు మూతపడటంతో ఆర్థిక ఇబ్బందులకు గురి కావడం, ఈ క్రమంలో భార్యాభర్తల మధ్య గొడవ జరగడంతో.. ఈ నెల 5న రవికుమార్‌ భార్య అక్కమ్మ ఇంటినుంచి వెళ్లిపోయింది. మరుసటి రోజే రవికుమార్‌ చనిపోగా.. అక్కమ్మ తిరిగి వస్తుందేమోనని కుటుంబసభ్యులు అతని మృతదేహానికి రెండు రోజులు అంత్యక్రియలు చేయకుండా వేచిచూశారు. ఆమె ఆచూకీ తెలియకపోవడంతో బుధవారం ఖననం చేశారు. బుధవారం సాయంత్రం ఏపీలోని గుంటూరు జిల్లా మాచర్ల మండలం దుర్గి వద్ద ఉన్న బుగ్గ వాగులో మహిళ మృతదేహాన్ని మాచర్ల పోలీసులు గుర్తించారు. తొలుత గుర్తు తెలియని మృతదేహంగా భావించినా; అది అక్కమ్మ మృతదేహంగా గుర్తించి బంధువులకు అప్పగించారు. గురువారం మధ్యాహ్నం అక్కమ్మ మృతదేహాన్ని సాగర్‌కు తెచ్చి, ఖననం చేశారు. తల్లిదండ్రులిద్దరి మృతితో వారి పిల్లలు బాబు(5), పాప(3) అనాథలయ్యారు.

Updated Date - 2021-04-09T09:01:42+05:30 IST