సూది హుషారు.. జేబు ఉసూరు!

ABN , First Publish Date - 2021-02-02T08:38:29+05:30 IST

భారీ వరాల్లేవ్‌! అద్భుతమైన మెరుపుల్లేవ్‌! అన్నదాతకు మద్దతు లేదు! వేతన జీవులకు ఊరట లేదు! నిరుద్యోగులకు ఉపాధి ఆశల్లేవ్‌! మధ్య తరగతికి ఊరింపుల్లేవ్‌! తెలుగు రాష్ట్రాలకు కేటాయింపుల్లేవ్‌! కరోనాతో కకావికలమైన భారతీయులను కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా

సూది హుషారు.. జేబు ఉసూరు!

ఆరోగ్యానికి 2.24 లక్షల కోట్లు.. అందులో టీకాలకు 35 వేల కోట్లు

భారీగా పెట్టుబడుల ఉపసంహరణ.. ఎల్‌ఐసీ వాటా విక్రయం

బీమాలో విదేశీ పెట్టుబడులు 49 నుంచి 74 శాతానికి

నిరుద్యోగులు, వేతన జీవులు, మధ్యతరగతికి మొండిచేయి

అన్నదాతకు మద్దతు లేదు కానీ అందరిపైనా అగ్రి సెస్‌ 

ఎన్నికలు జరిగే 4 రాష్ట్రాల దిశగా సాగిన నిర్మలమ్మ బడ్జెట్‌

ఆత్మ నిర్భర్‌ స్వస్థ్‌ భారత్‌ పథకం.. ఆరేళ్లలో 64 వేల కోట్లు

దేశంలో 9 ‘బయో సేఫ్టీ లెవెల్‌-3’ పరిశోధన కేంద్రాలు 

పుణె తరహాలో నాలుగు ప్రాంతీయ వైరాలజీ ఇన్‌స్టిట్యూట్లు

కేంద్ర సంస్థల భూముల అమ్మకానికి రెడీ.. ప్రత్యేకంగా ఎస్పీవీ

పత్తిపై 10 శాతం దిగుమతి సుంకం.. దేశీ పత్తికి ఊరట

16.5 లక్షల కోట్ల సాగు రుణాలు.. 1000 మార్కెట్లు ఆన్‌లైన్‌

ఎగిరెగిరి పడిన సెన్సెక్స్‌.. బడ్జెట్‌ టైంలో ఆల్‌టైం రికార్డ్‌

విశాఖ సహా 5 ప్రధాన చేపల పోర్టుల అభివృద్ధి

ఇక ప్రైవేటులో సైనిక స్కూళ్లు.. మరిన్ని ఏకలవ్య పాఠశాలలు 

మార్పుల్లేని ఐటీ శ్లాబులు.. టైర్‌-2 నగరాలకు మెట్రో రైళ్లు 

ఫిట్‌నెస్‌ లేని 20 ఏళ్ల వాహనాలు ఇక తుక్కులోకే

దేశవ్యాప్తంగా ఏడు మెగా టెక్స్‌టైల్‌ పార్కులు

ఈ ఏడాది చేయబోయే అప్పు12లక్షల కోట్లు


మొత్తం బడ్జెట్‌ ’34,83,236 కోట్లు’

ధరలు పెరిగేవి:  మొబైల్‌ ఫోన్ల విడి భాగాలు, బ్యాక్‌ కవర్లు, చార్జర్‌లు, పవర్‌ బ్యాంక్స్‌, లిథియం అయాన్‌ బ్యాటరీల ముడి సరుకు, ముడిపట్టు, రిఫ్రిజిరేటర్లు, ఏసీ కంప్రెసర్లు, ఎల్‌ఈడీ బల్బులు, విండ్‌స్ర్కీన్‌ వైపర్‌. 


తగ్గేవి:  బంగారం, వెండి, ప్లాటినం, ఇనుము, 

ఉక్కు, రాగి వస్తువులు, దిగుమతి చేసుకునే వైద్య పరికరాలు, బీమా ప్రీమియం


భారత వృద్ధిరేటు 

3 సార్లు మాత్రమే మైనస్‌లో నమోదైంది. మొదటి రెండుసార్లు మనదేశంలోని పరిస్థితులే కారణం. ఈసారి కరోనా కారణం.

నిర్మల 


న్యూఢిల్లీ, ఫిబ్రవరి 1: భారీ వరాల్లేవ్‌! అద్భుతమైన మెరుపుల్లేవ్‌! అన్నదాతకు మద్దతు లేదు! వేతన జీవులకు ఊరట లేదు! నిరుద్యోగులకు ఉపాధి ఆశల్లేవ్‌! మధ్య తరగతికి ఊరింపుల్లేవ్‌! తెలుగు రాష్ట్రాలకు కేటాయింపుల్లేవ్‌! కరోనాతో కకావికలమైన భారతీయులను కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ సోమవారం ప్రవేశపెట్టిన బడ్జెట్‌తో ఉసూరనిపించారు! మహమ్మారి కారణంగా సొమ్ములుడిగిన ప్రజల చేతుల్లో నాలుగు డబ్బులు ఉండేలా.. వస్తు డిమాండ్‌ పెరిగేలా ఈసారి బడ్జెట్‌ ఉంటుందని నిపుణులు ఊహిస్తే.. అసలే కష్టాల్లో ఉన్న ప్రజల నుంచి ఇంకా ఇంకా పిండుకునేలా బడ్జెట్‌కు రూపకల్పన చేశారు. అన్నదాతపై ప్రత్యేకంగా వరాలు ఏమీ ప్రకటించలేదు. కానీ, అన్నదాతను అడ్డం పెట్టుకుని అగ్రి సెస్‌ పేరిట మిగిలిన అందరినీ బాదేశారు. పెట్రోల్‌, డీజిల్‌పై ఎక్సైజ్‌ డ్యూటీని తగ్గించారు. ఆ మేరకు అగ్రి సెస్‌ను వేశారు. తద్వారా, మిగతా ఇప్పటికే భగ్గుమంటున్న పెట్రోల్‌, డీజిల్‌ ధరలను తగ్గిస్తారేమోనని ఆశలు పెట్టుకున్న వాహనదారుల ఆశలను అడియాసలు చేశారు.


ఇక, ఆదాయ పన్నులో ఎటువంటి మినహాయింపులూ ఇవ్వకపోగా ప్రావిడెంట్‌ ఫండ్‌ వడ్డీ రాయితీలపైనా ఆంక్షలు విధించారు. దేశవ్యాప్తంగా కరోనా సంక్షోభం కంటే నాలుగు రాష్ట్రాల ఎన్నికల్లో తమ క్షేమమే ముఖ్యమనుకున్నారు! త్వరలో ఎన్నికలు జరగనున్న తమిళనాడు, పశ్చిమ బెంగాల్‌, కేరళ, అసోం రాష్ట్రాల్లో మౌలిక సదుపాయాల ప్రాజెక్టులకు ఏకంగా రూ.2.27 లక్షల కోట్ల ప్రాజెక్టులను కేటాయించారు. చేతికి ఎముక లేనట్లు వీటిలో తమిళనాడుకు లక్ష కోట్లకుపైగా హైవే ప్రాజెక్టులను మంజూరు చేస్తే.. కేరళలో రూ.65 వేల కోట్ల పనులకు వరమిచ్చారు. కరోనా సమయంలో నాలుగు ‘మినీ బడ్జెట్ల’ను ప్రకటించిన ఆర్థిక మంత్రి.. వాటికి కొనసాగింపుగా వార్షిక బడ్జెట్‌ను వండివార్చారు! మౌలిక సదుపాయాలపై ఖర్చుకు పెద్దపీట వేయడం; ఆరోగ్య రంగంలో వ్యయాన్ని రెట్టింపు చేయడం; బీమా రంగంలో విదేశీ పెట్టుబడులను పెంచడం ద్వారా ఆర్థిక వ్యవస్థకు ఊతమివ్వడానికి పావులు కదిపినా.. మార్కెట్లో నిధుల చలామణీని పట్టించుకోకపోవడం పెద్ద లోపంగా విశ్లేషకులు భావిస్తున్నారు. అందుకే, స్టాక్‌ మార్కెట్‌ ఎగిరెగిరి పడితే.. సామాన్యుడు డీలా పడ్డాడని విశ్లేషించారు.


టీకా వరం ఎవరికి!?

కరోనా కాలంలో టీకా వేసేందుకు బడ్జెట్లో కేంద్రం పెద్దపీట వేసింది. ఏకంగా రూ.35 వేల కోట్లను ఇందుకు కేటాయించింది. టీకాను ఎవరెవరికి ఉచితంగా ఇస్తారనే విషయంలో స్పష్టత ఇవ్వలేదు. కానీ, బడ్జెట్‌ కేటాయింపులను బట్టి.. కరోనా యోధులతోపాటు కోబార్బిడిటీలు ఉన్న 50 ఏళ్లు పైబడిన వారికి టీకాను ఉచితంగా ఇచ్చే అవకాశం ఉందా? అనే అనుమానాలు మాత్రం వ్యక్తమవుతున్నాయి. అదే సమయంలో కొవిడ్‌ నేపథ్యంలో ఆరోగ్య రంగాన్ని బలోపేతం చేసేందుకు పెద్దపీట వేసింది. గత బడ్జెట్‌తో పోలిస్తే.. ఈ రంగానికి ఏకంగా 137 శాతం అధికంగా నిధులు కేటాయించింది.


వీటిని మౌలిక సదుపాయాలకు ఖర్చు చేయాలని సంకల్పించింది. ‘ఆత్మ నిర్భర్‌ స్వస్థ్‌ భారత్‌’ పేరిట కొత్త పథకానికి రూపకల్పన చేశారు. ఇందుకు రాబోయే ఆరేళ్లలో రూ.64,180 కోట్లను ఖర్చు చేయాలని సంకల్పం చెప్పుకొన్నారు. అదే సమయంలో, కరోనా సమయంలో సవాల్‌గా నిలిచిన వైద్య పరిశోధనలను విస్మరించింది. ప్రజలంతా ఎదురు చూస్తున్న ఆరోగ్య బీమానూ పట్టించుకోలేదు.

ప్రభుత్వ సంస్థల ప్రైవేటు బాట

భారత్‌ పెట్రోలియం కార్పొరేషన్‌, ఎయిర్‌ ఇండియా తదితర ప్రభుత్వ రంగ సంస్థల్లో వాటాలను తెగనమ్మాలని కేంద్ర ప్రభుత్వం సంకల్పించింది. తద్వారా, వచ్చే ఆర్థిక సంవత్సరంలో రూ.1.75 లక్షల కోట్లను రాబట్టాలని లక్ష్యంగా నిర్దేశించుకుంది. ఐడీబీఐతోపాటు మరో రెండు ప్రభుత్వ రంగ బ్యాంకులు; ఒక బీమా కంపెనీని ప్రైవేటీకరించనుంది. ప్రభుత్వ రంగ సంస్థలకు వివిధ పట్టణాల్లో ఉన్న భూముల విక్రయానికి మార్గం సుగమం చేసింది. అంతేనా, రాష్ట్రాలు కూడా తమ ప్రభుత్వ రంగ సంస్థల్లో వాటాలు విక్రయించుకునే దిశగా ప్రోత్సహించాలని నిర్ణయించింది. ఈసారి బడ్జెట్లో అన్నిటికంటే ముఖ్యమైన అంశం.. ఎల్‌ఐసీలో వాటా విక్రయాలకు తెరలేపడం!


రైతుకు మద్దతు ఏదీ!?

ఎన్నో ప్రత్యేకతల కరోనా కాలంలో కేంద్ర ఖజానాకు దన్నుగా నిలిచిన రైతన్నపై ఈసారి బడ్జెట్లో కరుణ చూపుతారని ఆశించారు. దేశ రాజధానిలో రైతన్నలు ఆందోళనలు కూడా చేస్తున్నందున ‘పీఎం కిసాన్‌’ సాయాన్ని రూ.10 వేలకు పెంచుతారనే అంచనాలు వెలువడ్డాయి. కానీ, అన్నదాతకు అండగా నిలిచే నిర్ణయాలేవీ బడ్జెట్లో లేవు. మద్దతు ధరకు భరోసానిచ్చే చర్యలూ కరువే. ఎమ్మెస్పీ, మండీల విషయంలో నిర్మల ఇచ్చిన హామీలు కేవలం ఆందోళన చేస్తున్న రైతులను ఉద్దేశించినవి మాత్రమే. ఇక, గ్రామీణ ప్రాంతాల్లో జీవన భరోసాను ఇస్తున్న ఉపాధి హామీ పథకానికి కేటాయింపులూ అంతంతే.


ఆదాయ పన్ను శ్లాబుల్లో మార్పులు చేస్తారని ఆశలు పెట్టుకున్న వేతనజీవులను నిరాశపరిచారు. పన్ను శ్లాబుల్లో మార్పు లేకపోవడం కొంత నిరాశే. 80సీ పరిమితిలోనూ మార్పులేదు. నిర్మల బడ్జెట్లో అత్యంత నిరాశాజనకమైన అంశం నిరుద్యోగ సమస్యను పట్టించుకోకపోవడం. కొవిడ్‌ వల్ల లక్షల మంది ఉపాధి కోల్పోయిన తరుణంలో ఉపాధి కల్పనకు ఆమె నిర్దిష్ట చర్యలు ప్రతిపాదిస్తారని అంతా ఆశించారు. కానీ అది జరగలేదు. మధ్యతరగతి వర్గాన్ని కూడా ఈసారి బడ్జెట్లో పట్టించుకోలేదు. ఇల్లు కట్టుకోవడానికి రుణం తీసుకున్న వారికి లక్షన్నర దాకా ఇస్తున్న వడ్డీ మినహాయింపును మరో ఏడాది పాటు పొడించడం స్వల్ప ఊరట. మొబైల్‌ ఫోన్లు, ఆటో పార్టులు, ఫ్రిజ్‌లు, ఏసీల ధరల పెరుగుదల ప్రస్తుత కష్టకాలంలో ఇబ్బందికరమే! 


అన్నదాత.. దేశ ఆర్థిక వ్యవస్థకు వెన్నెముక.. కరోనా సమయంలోనూ దన్నుగా నిలిచాడు! సాగు చట్టాలను రద్దు చేయడమే కాదు.. మద్దతుకు చట్టబద్ధత కల్పించాలంటూ ఢిల్లీలో ఆందోళన చేస్తున్నాడు! అయినా.. బడ్జెట్లో రైతుకు రొక్కం లేదు!


వేతన జీవులు.. సర్కారు ఖజానాను నింపే చేదోడు వాదోడు! ఇప్పుడు కొవిడ్‌ దెబ్బకు కొత్త కష్టాల్లో చిక్కుకున్నారు. కొందరికి ఉద్యోగాలు పోయాయి! మరికొందరికి వేతనాలు తగ్గాయి! అయినా.. బడ్జెట్లో వారికి ఎటువంటి వితరణా లేదు!


నిరుద్యోగులు.. కొలువు కలల బేహారులు! ఇటు ప్రభుత్వ ఉద్యోగమో అటు ప్రైవేటు కొలువో వస్తుందని ఆశపడే కుర్రాళ్లు! అయినా, బడ్జెట్లో ప్రభుత్వ కొలువుకు భరోసా లేదు! ప్రైవేటు కొలువుకు ఊతమూ లేదు!


మధ్య తరగతి.. కరోనా మహమ్మారి కారణంగా భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారిన చిరు జీవులు! ఈసారి ప్రభుత్వం వరాలు కురిపించకపోతుందా అని ఆశలు పెట్టుకున్న ఆశాజీవులు! అయినా, బడ్జెట్లో వారి ఆశలపై భారీ బకెట్‌తో నీళ్లు కుమ్మరించారు!


తెలుగు రాష్ట్రాలు.. కేంద్ర ఖజానాకు ఆర్థిక భరోసానిచ్చే రాష్ట్రాలు! కొవిడ్‌తో రెండూ అప్పుల కుప్పగా మారాయి! ఇప్పుడు ఆర్థిక సాయం కోసం కేంద్రం వైపు చూస్తున్నాయి! అయినా, బడ్జెట్లో తెలుగు రాష్ట్రాలపై శీతకన్నే!!


దేశాన్ని అమ్మకానికి పెట్టారు

దేశాన్ని మోదీ సర్కారు అమ్మకానికి పెట్టింది. జనం చేతుల్లో డబ్బులు ఉంచడం మాట అటు ఉంచి దేశ ఆస్తులను ఆశ్రిత పెట్టుబడిదారులకు విక్రయించాలని మోదీ సర్కారు యోచిస్తోంది. 

రాహుల్‌ గాంధీ’

Updated Date - 2021-02-02T08:38:29+05:30 IST