20.. 30.. 40.. 50..! ‘హిజాబ్‌ నిషేధం’ తర్వాత ఎంత మంది మానేశారు!

ABN , First Publish Date - 2022-09-15T10:12:28+05:30 IST

హిజాబ్‌ను నిషేధిస్తూ కర్ణాటక హైకోర్టు తీర్పు ఇచ్చిన తర్వాత ఎంత మంది విద్యార్థులు విద్యాసంస్థలను మధ్యలోనే వదిలేశారు(డ్రాపౌట్‌).

20.. 30.. 40.. 50..! ‘హిజాబ్‌ నిషేధం’ తర్వాత ఎంత మంది మానేశారు!

పిటిషనర్లను ప్రశ్నించిన సుప్రీంకోర్టు.. నిషేధం ఎత్తివేతకు నిరాకరణ


న్యూఢిల్లీ, సెప్టెంబరు 14: ‘‘హిజాబ్‌ను నిషేధిస్తూ కర్ణాటక హైకోర్టు తీర్పు ఇచ్చిన తర్వాత ఎంత మంది విద్యార్థులు విద్యాసంస్థలను మధ్యలోనే వదిలేశారు(డ్రాపౌట్‌). 20.. 30.. 40.. లేదా 50.. మీదగ్గర అధికారిక లెక్కలేమైనా ఉన్నాయా? ఉంటే వాటిని మాకివ్వండి’’ అని సుప్రీం కోర్టు ధర్మాసనం పిటిషనర్లను ఆదేశించింది. అదేవిధంగా ఈ విషయంలో కర్ణాటక హైకోర్టు ఇచ్చిన తీర్పు కాపీని కూడా సమర్పించాలని పేర్కొంది. హిజాబ్‌పై కర్ణాటక హైకోర్టు నిషేధం విధించాక.. విద్యార్థులు చదువుకు దూరమయ్యారంటూ దాఖలైన పిటిషన్లపై ధర్మాసనం విచారణ చేపట్టింది. ఈ సందర్భంగా న్యాయమూర్తులు జస్టిస్‌ హేమంత్‌ గుప్తా, జస్టిస్‌ సుధాంశు ధూలియాలతో కూడిన ధర్మాసనం పిటిషనర్ల తరఫు న్యాయవాదులను పైవిధంగా ఆదేశించింది. అదేవిధంగా హిజాబ్‌పై నిషేధాన్ని ఎత్తివేసేందుకు నిరాకరించింది. పిటిషనర్ల తరఫున సీనియర్‌ న్యాయవాది హుజెఫా అహ్మదీ వాదనలు వినిపిస్తూ.. ఒక నివేదికను ప్రస్తావించారు. ‘‘హైకోర్టు తీర్పు తర్వాత 17 వేల మంది విద్యార్థులు పరీక్షలకు హాజరుకాకుండా ఆగిపోయారని.. నా స్నేహితుడు ఒకరు(ఆయన కూడా లాయరే) చెప్పారు’’ అని వివరించారు. ముఖ్యంగా బాలికల డ్రాపౌట్లు ఎక్కువగా ఉన్నాయని, వారిని బలవంతంగా మదర్సాలకు పంపే పరిస్థితి వచ్చిందని తెలిపారు. ‘‘ఒక మతపరమైన ఆచారం.. లౌకికత్వానికి, విద్యకు, ఐక్యతకు ఆటంకం కలిగిస్తుందని ఎందుకు భావించాలి? హిజాబ్‌ ధరించి పాఠశాలకు వెళ్తే ఎవరైనా ఎందుకు రెచ్చిపోవాలి? ఇతర విద్యార్థులకు సమస్య ఎందుకు?’’ అని అహ్మదీ ప్రశ్నల వర్షం కురిపించారు. 


ఇస్లాం అంటే పిటిషన్‌ కొట్టేయడమేనా?!

‘‘హిజాబ్‌ ధరించిన వ్యక్తిపై మతం, లింగం ఆధారంగా వివక్ష చూపరాదనేది ఈ కేసులో అత్యంత కీలకమైన అంశం. భారత్‌ అయినా.. ప్రపంచమైనా.. లేదా.. ఇస్లామిక్‌ దేశాలైనా.. హిజాబ్‌ను చెల్లుబాటయ్యేలా గుర్తించాలి. ఇది క్రమశిక్షణకు సంబంధించిన సాధారణ కేసు కాదు. కంటితో చూస్తూ పబ్లిక్‌ ఆర్డర్‌కు వ్యతిరేకమని ఎలా చెబుతారు? ఇది క్రమశిక్షణా కేసు కిందకు రాదు. ఇది కేవలం ముస్లింలను, ముస్లిం మహిళలను లక్ష్యం చేసుకున్న అంశం. పైగా ఆర్టికల్‌ 14, 15కు విరుద్ధం. ఇలా చేయడం చట్టాన్ని, రాజ్యాంగాన్ని తుంగలో తొక్కడమే. అంతేకాదు, ఇస్లాం పేరుతో ఏ పిటిషన్‌ వచ్చినా కొట్టేస్తున్నారు. దీనికి గోవధే నిదర్శనం. ముస్లిం మహిళలు హిజాబ్‌ ధరిస్తే.. ఇతరులు దానిని ఎందుకు రెచ్చగొట్టాలి?’’ అని మరో సీనియర్‌ న్యాయవాది రాజీవ్‌ ధవన్‌ పేర్కొన్నారు. ఈ సందర్భంగా పత్రికల్లో వచ్చిన వార్తలను ఆయన ప్రస్తావించగా, ఆ విషయంలో తాము జోక్యం చేసుకోబోమని, హిజాబ్‌ అంశానికి మాత్రమే పరిమితం కావాలని ధర్మాసనం స్పష్టం చేసింది. మరోసారి ధవన్‌ జోక్యం చేసుకుని.. హిజాబ్‌ను ధరించడాన్ని సహించరని చెప్పడమంటే.. రాజ్యాంగ పీఠికలో పేర్కొన్న ‘సోదరభావం’ స్ఫూర్తికి విరుద్ధమన్నారు. జాతీయ విద్యా విధానం అంటే.. చట్టబద్ధమైన రాష్ట్ర ప్రయోజనాలను, విద్యను ప్రోత్సహించేలా ఉండాలన్నారు. ‘‘ప్రజాప్రయోజనం క్రమశిక్షణలో ఉందా? విద్యను ప్రోత్సహించడంలో ఉందా?’’ అని ప్రశ్నించారు. కాగా, కోర్టు సమయం ముగియడంతో వాదనలను గురువారం వినిపించాలని ధర్మాసనం పేర్కొంది. 

Updated Date - 2022-09-15T10:12:28+05:30 IST