Omicron ఎంత పని చేసిందో.. కువైత్‌లో ప్రస్తుతం 20శాతం ప్రయాణికులు చేస్తుంది ఇదే..

ABN , First Publish Date - 2021-12-03T16:52:05+05:30 IST

కరోనా కొత్త వేరియంట్ ఒమైక్రాన్ మరోసారి ప్రపంచ దేశాలను భయం గుప్పిట్లోకి నెట్టేసింది. మొదట దక్షిణాప్రికాలో వెలుగుచూసిన ఈ వేరియంట్ శరవేగంగా వ్యాప్తి చెందుతోంది.

Omicron ఎంత పని చేసిందో.. కువైత్‌లో ప్రస్తుతం 20శాతం ప్రయాణికులు చేస్తుంది ఇదే..

కువైత్ సిటీ: కరోనా కొత్త వేరియంట్ ఒమైక్రాన్ మరోసారి ప్రపంచ దేశాలను భయం గుప్పిట్లోకి నెట్టేసింది. మొదట దక్షిణాప్రికాలో వెలుగుచూసిన ఈ వేరియంట్ శరవేగంగా వ్యాప్తి చెందుతోంది. ఇప్పటివరకు భారత్, అమెరికా సహా 30 దేశాలకు పాకింది. అటు గల్ఫ్‌లోనూ ప్రవేశించింది. ఇప్పటికే సౌదీ అరేబియా, యూఏఈలో కేసులు నమోదయ్యాయి. దీంతో మిగతా గల్ఫ్ దేశాలు అప్రమత్తమవుతున్నాయి. ఇప్పటికే ఆఫ్రికన్ దేశాలకు విమాన సర్వీసులను పూర్తిగా నిలిపివేశాయి. ఇక కువైత్ కూడా కొత్త వేరియంట్ ప్రబలకుండా చర్యలు చేపట్టింది. దీనిలో భాగంగా తొమ్మిది ఆఫ్రికన్ దేశాలకు కువైత్ విమాన సర్వీసులు నిలిపివేసింది. ఈ జాబితాలో దక్షిణాఫ్రికా, నమీబియా, బోత్స్వానా, జింబాబ్వే, మొజాంబిక్, లెసోతో, ఈశ్వతిని, జాంబియా, మాలావి ఉన్నాయి. అలాగే దేశ పౌరులు, ప్రవాసులను దేశం విడిచి వెళ్లొద్దంటూ హెచ్చరించింది. 


కొత్త వేరియంట్‌ శరవేగంగా ప్రబలుతున్నందున ఈ సమయంలో విదేశాలకు వెళ్లడం మంచిది కాదని అంతర్గత, ఆరోగ్యశాఖ అధికారులు తెలిపారు. కొన్ని రోజుల తర్వాత ఒమైక్రాన్(B.1.1.529)పై ఓ అవగాహన ఏర్పడే అవకాశం ఉందని, అప్పటి వరకు కువైత్ విడిచి బయటకు వెళ్లొద్దని సూచించారు. అంతే.. ఈ ప్రకటనతో చాలా మంది ప్రయాణికులు కువైత్ వదిలి వెళ్లేందుకు జంకుతున్నారు. ఒమైక్రాన్ ప్రభావం ఎక్కువైతే విమానాశ్రయం మూసివేసే పరిస్థితి వస్తుందేమోనని చాలా మంది తమ ప్రయాణాలను వాయిదా వేసుకుంటున్నారు. దీంతో ఇప్పటికే బుక్ చేసుకున్న ప్రయాణ టికెట్లను క్యాన్సిల్ చేసుకుంటున్నారు. ఇలా ఇప్పటివరకు సుమారు 20 శాతం మంది ప్రయాణికులు తమ విమాన టికెట్లను క్యాన్సిల్ చేసుకున్నట్లు ట్రావెల్ ఏజెన్సీలు వెల్లడించాయి. క్రిస్మస్, కొత్త ఏడాది సందర్భంగా విదేశాలకు వెళ్లేవారి సంఖ్య భారీగా ఉంటుందని భావించిన తమకు ఒమైక్రాన్ రూపంలో ఊహించని షాక్ తగిలిందని వాపోతున్నాయి. అలాగే కువైత్ నుంచి పర్యాటకానికి ప్రసిద్ధి చెందిన టర్కీ, కైరో వంటి గమ్యస్థానాలకు వెళ్లేవారి సంఖ్య కూడా గణనీయంగా పడిపోయిందట. ప్రవాసులు సైతం స్వదేశానికి వచ్చేందుకు సుముఖంగా లేరు. ఇంతకుముందు కరోనా కారణంగానే స్వదేశాల్లో చిక్కుకుని నరకయాతన అనుభవించారు. దాంతో మళ్లీ ఆ తప్పు చేయకూడదని వేచిచూసే ధోరణిని ప్రదర్శిస్తున్నారు.  


Updated Date - 2021-12-03T16:52:05+05:30 IST