Hadis Najafi: ఈ యువతిని అన్యాయంగా చంపేశారు

ABN , First Publish Date - 2022-09-28T00:46:42+05:30 IST

టెహ్రాన్: ఇరాన్‌లో మహ్స అమినీ మృతితో హిజాబ్‌ వ్యతిరేక ఆందోళనలు మిన్నంటుతున్న వేళ హదిస్ నజాఫి

Hadis Najafi: ఈ యువతిని అన్యాయంగా చంపేశారు

టెహ్రాన్: ఇరాన్‌లో మహ్స అమినీ మృతితో హిజాబ్‌ వ్యతిరేక ఆందోళనలు మిన్నంటుతున్న వేళ హదిస్ నజాఫి అనే 20 సంవత్సరాల యువతిని ఇరాన్ సైనిక బలగాలు అతి దారుణంగా చంపేశాయి. ఆమె ముఖం, మెడ, ఛాతిపై గుళ్ల వర్షం కురిపించి మరీ హత్య చేశారు ఇరాన్ సైనికులు. మొత్తం ఆరు బుల్లెట్లు ఆమె శరీరాన్ని చిధ్రం చేశాయి. ఆమె చేసిందల్లా మహ్స అమినీకి మద్దతు తెలుపుతూ తన జుట్టును కత్తిరించుకోవడమే. జట్టు కత్తిరించుకోవడం ద్వారా ప్రభుత్వానికి తమ నిరసనను, ఆగ్రహాన్ని తెలియజేయడమే. తన జడను ముడివేస్తూ తీసిన వీడియోను హదిస్ నజాఫి సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఆ వెంటనే వేలాది మంది ఆమె వీడియోను రీ షేర్ చేశారు. దీంతో హదిస్ నజాఫిపై ఇరాన్ సైనిక బలగాలు పగబట్టాయి. అల్బోర్జ్ ప్రావిన్స్‌లోని కరాక్ నగరంలో ఆందోళన చేసేందుకు వచ్చిన హదిస్ నజాఫిపై గుళ్ల వర్షం కురిపించి దారుణంగా చంపేశారు. 





ఇరాన్ సైనిక బలగాల కాల్పుల్లో ఇప్పటివరకూ నలభై మందికి పైగా నిరసనకారులు ప్రాణాలు కోల్పోయారని అంటున్నా వాస్తవ లెక్కలు ఎవరికీ తెలియడం లేదు. ఇరాన్‌లో మీడియాపై ప్రభుత్వ నియంత్రణ కొనసాగుతోంది. ఇరాన్‌ విదేశాంగ శాఖ బ్రిటన్‌ రాయబారికి సమన్లు జారీ చేసింది. దేశంలో అల్లర్లను రెచ్చగొట్టేలా వార్తా కథనాలు రాస్తున్న పార్సీ మీడియా సంస్థలకు ఆశ్రయం ఇవ్వడంపై నిరసన తెలిపింది. లండన్‌లో ఇరాన్‌ రాయబార కార్యాలయం వద్ద ఆందోళన హింసాత్మకంగా మారింది. ఈ కొట్లాటలో ఐదుగురు పోలీసు అధికారులు తీవ్రంగా గాయపడ్డారు. ఉత్తర ఇరాక్‌లో ఉన్న కుర్దిష్‌ వేర్పాటువాదుల స్థావరాలపై ‘ఇరాన్‌ రివల్యూషనరీ గార్డ్‌’ డ్రోన్‌ దాడులు చేసింది.


హిజాబ్‌ నిబంధనలపై ఇరాన్‌ సర్కారు కఠినంగా వ్యవహరిస్తున్న తీరుతో ఆ దేశ మహిళల్లో ఆగ్రహావేశాలు నానాటికీ పెరిగిపోతున్నాయి. నిజానికి 1979లో ఆయతుల్లా ఖొమేనీ ఇస్లామిక్‌ ప్రతిఘటన ఉద్యమం ద్వారా ఇరాన్‌పై పట్టు సాధించినప్పటి నుంచీ ఆ దేశంలో మహిళల వస్త్రధారణపై ఆంక్షలున్నాయి. వాటిని చాలా మంది మహిళా న్యాయవాదులు, విద్యార్థినులు, ఇతర వృత్తులవారు తీవ్రంగా వ్యతిరేకించారు. ‘‘తిరోగమించడానికి కాదు మనం విప్లవం చేసింది’’ అంటూ ఖొమేనీ విధానాలను నిరసించేవారు. కానీ, ఖొమేనీ, ఆయన మద్దతుదారులు వారి నిరసనలను పెద్దగా పట్టించుకోలేదు సరికదా.. బహిరంగ ప్రదేశాల్లో తమ జుత్తును హిజాబ్‌తో కప్పి ఉంచని మహిళలకు 74 కొరడా దెబ్బల శిక్ష విధించాలని 1983లో ఇరాన్‌ పార్లమెంటు నిర్ణయించింది. 1995 నాటికి ఆ ఆంక్షలు మరింత కఠినతరం చేసి హిజాబ్‌ ధరించని మహిళలకు రెణ్నెల్ల జైలు శిక్ష విధించే విధానం అమల్లోకి వచ్చింది. అలా నాలుగు దశాబ్దాలకు పైగా ఇరాన్‌ మహిళలు ఈ నిబంధనలపై నిరసన గళం వినిపిస్తూనే ఉన్నారు. 


హిజాబ్‌, వస్త్రధారణ నిబంధనలు పాటించనివారికి శిక్షలు సైతం విధించేలా గత నెల 15న ఇరాన్‌ అధ్యక్షుడు ఇబ్రహీం రైసీ ఒక డిక్రీ జారీ చేశారు. ఆ ఉత్తర్వు ప్రకారం.. ఇరాన్‌ మహిళలు సోషల్‌ మీడియాలో పెట్టే తమ ఫొటోల్లో హిజాబ్‌, వస్త్రధారణ నిబంధనలు తప్పనిసరిగా పాటించాలి. హిజాబ్‌ లేనివారికి జరిమానా విధించే హక్కు, వారికి సహజంగా లభించే సామాజికహక్కులను ఆర్నెల్ల నుంచి ఏడాదిపాటు అందకుండా చేసే హక్కు ప్రభుత్వానికి ఉంటుంది. ఈ డిక్రీపై ఇరాన్‌లో ఆగ్రహావేశాలు పెల్లుబుకుతున్న దశలో.. హిజాబ్‌ సరిగ్గా ధరించలేదంటూ మహ్సా అమిని అనే యువతిని మొరాలిటీ పోలీసులు అరెస్టు చేయడం, వారి కస్టడీలో ఆమె మరణించడంతో ఇరాన్‌ గత కొద్దిరోజులుగా ప్రజా నిరసనలతో అట్టుడుకిపోతోంది. ఈ నిరసనలను భద్రతా దళాలు ఉక్కుపాదంతో అణచివేయడానికి చేస్తున్నప్రయత్నాల్లో అనేకమంది చనిపోయారు. 

Updated Date - 2022-09-28T00:46:42+05:30 IST