మంజీరా తీరంలో 2 వేల ఏళ్లనాటి శాసనం

ABN , First Publish Date - 2020-08-09T08:19:43+05:30 IST

తెలంగాణలోని మంజీరా తీరంలో 2200 ఏళ్ల క్రితం నాగరికత వర్ధిల్లిందా? కామారెడ్డి జిల్లా నాగిరెడ్డిపేట మండలం మాల్‌తుమ్మెద గ్రామంలో ఓ బండరాయి మీద బ్రాహ్మీలిపిలో రాసివున్న సూక్ష్మ శాననాన్ని గుర్తించిన చరిత్ర పరిశోధకులు...

మంజీరా తీరంలో 2 వేల ఏళ్లనాటి శాసనం

  • కామారెడ్డి జిల్లాలో బండపై బ్రాహ్మీలిపిలో లభ్యం
  • తెలంగాణలో అత్యంత పురావస్తు ఆధారం ఇదే
  • క్రీ.పూ. 2వ శతాబ్దంలోనే తెలంగాణలో జనజీవనం

హైదరాబాద్‌, ఆగస్టు 8: తెలంగాణలోని మంజీరా తీరంలో 2200 ఏళ్ల క్రితం నాగరికత వర్ధిల్లిందా? కామారెడ్డి జిల్లా నాగిరెడ్డిపేట మండలం మాల్‌తుమ్మెద గ్రామంలో ఓ బండరాయి మీద బ్రాహ్మీలిపిలో రాసివున్న సూక్ష్మ శాననాన్ని గుర్తించిన చరిత్ర పరిశోధకులు ఇదే వ్యాఖ్యానిస్తున్నారు. గ్రామానికి ఆగ్నేయంగా, మంజీరా నదికి 500 మీటర్ల దూరంలో బండరాయిపై ఐదు అక్షరాలతో బ్రాహ్మీలిపిలో రాసివున్న శాసనాన్ని ఈనెల 6న ఎం.ఎ.శ్రీనివాసన్‌, వై.భానుమూర్తి, బి.శంకర్‌ రెడ్డిలతో కూడిన పురావస్తు పరిశోధకుల బృందం గుర్తించింది. ఈ అక్షరాలకు ‘మాధవచమ్డ’ అనే అర్థం వస్తుంనది, బహుశా అది ఒక వ్యక్తి పేరు కావొచ్చునని ఉస్మానియా విశ్వవిద్యాలయంలో పరిశోధకుడు ఎంఏ శ్రీనివాసన్‌ తెలిపారు. ఈ శాసనం.. క్రీస్తుపూర్వం 2వ శతాబ్దానికి చెందినదని, తెలంగాణకు సంబంధించిన అత్యంత ప్రాచీన పురావస్తు ఆధారం ఇదేనని ఆర్కియాలజికల్‌ సర్వే ఆఫ్‌ ఇండియా గుర్తించింది. ‘‘తెలంగాణ చరిత్రకు సంబంధించి ఇది గర్వించదగిన సమయం’’ అని ఆర్కియాలజికల్‌ సర్వే ఆఫ్‌ ఇండియా శాసన విభాగం డైరెక్టర్‌ తెలిపారు. మంజీరా- గోదావరి తీరప్రాంతంలో శాతవాహన సామ్రాజ్యం విలసిల్లిందని చెప్పే కొండాపూర్‌, బోధన్‌ శాసనాలకు ఈ బ్రాహ్మీలిపిలో ఉన్న శాసనం మరింత బలం చేకూరుస్తుందని శ్రీనివాసన్‌ తెలిపారు. ప్రాచీనమైన ఈ బ్రాహ్మీ శాసనం తెలంగాణ చారిత్రక వైభవంపై మరింత లోతుగా పరిశోధనలు జరిపేందుకు తోడ్పడుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. 


మాల్‌తుమ్మెదలో మెట్లబావి

తెలంగాణ చారిత్రక వైభవాన్ని చాటిచెప్పే పలు ఆధారాలను పరిశోధకులు గతంలో కూడా కామారెడ్డి జిల్లాలో గుర్తించారు. మాల్‌తుమ్మెద గ్రామంలోనే ప్రాచీనకాలానికి చెందిన వర్ణచిత్రాలను, గుహల వంటి ఆవాసాలను గతంలో కనుగొన్నారు. ఇదే గ్రామంలో మధ్యయుగానికి చెందిన మెట్లబావిని, ఆలయాన్ని కూడా ఇటీవల గుర్తించారు.

Updated Date - 2020-08-09T08:19:43+05:30 IST