20 ఏళ్ల క్రితం మరణించిన వ్యక్తి శరీరభాగం దొరికిందని తలుపు కొట్టిన అధికారులు!

ABN , First Publish Date - 2021-09-08T06:41:10+05:30 IST

ఇంట్లో ఏదో పనిచేసుకుంటుందామె.. ఇంతలో ఎవరో తలుపు కొట్టారు. వెళ్లి చూసిన ఆమె కొడుకు డాంటె తల్లిని పిలిచాడు. ‘వీళ్లు అమ్మమ్మ గురించి వచ్చారు’ అని చెప్పాడు.

20 ఏళ్ల క్రితం మరణించిన వ్యక్తి శరీరభాగం దొరికిందని తలుపు కొట్టిన అధికారులు!

ఎన్నారై డెస్క్: ఇంట్లో ఏదో పనిచేసుకుంటుందామె.. ఇంతలో ఎవరో తలుపు కొట్టారు. వెళ్లి చూసిన ఆమె కొడుకు డాంటె తల్లిని పిలిచాడు. ‘వీళ్లు అమ్మమ్మ గురించి వచ్చారు’ అని చెప్పాడు. ఆ వచ్చింది ఇద్దరు అమెరికా ప్రభుత్వ డిటెక్టివ్‌లు. వాళ్లు ఆమెతో ‘మీ అమ్మగారి ఆనవాలు గుర్తించాం’ అని చెప్పారు. ముందు ఆమెకు వాళ్లు ఏం చెప్తున్నారో అర్థం కాలేదు. ఎందుకంటే ఆమె తల్లి డొరోథీ మోర్గాన్ చనిపోయి 20ఏళ్లయింది. 2001లో అమెరికా వరల్డ్ ట్రేడ్ సెంటర్‌పై ఉగ్రవాదులు చేసిన దాడిలో ఆమె మరణించింది. కనీసం ఆమె మృతదేహం కూడా లభించలేదు. ఇప్పుడు ఇద్దరు ఇంటికి వచ్చి తన తల్లి ఆనవాలు దొరకిందనడంతో నికియా మోర్గాన్‌కు ఏం చెప్పాలో తెలియలేదు. అయితే ఇదంతా అత్యుత్తమ డీఎన్ఏ టెస్టింగ్‌తో సాధ్యమైనట్లు ఆ డిటెక్టివ్‌లు చెప్పారు. 2001 సెప్టెంబరు 11న ఉగ్రవాదుల దాడిలో మరణించిన వారిలో 2,753 మంది మృతదేహాలు భవన శిథిలాల్లో కనిపించకుండా పోయాయి. కనీసం తల్లి మృతదేహం కూడా లేకపోవడంతో నికియా ఆమెకు సరిగా అంత్యక్రియలు కూడా నిర్వహించలేకపోయింది.


9/11 దాడుల తర్వాత ఆ భవన శిథిలాల నుంచి 22వేల శరీర భాగాలను అధికారులు సేకరించారు. అయితే అవి ఏవి ఎవరివో చెప్పడానికి మాత్రం వాళ్లు నానా తిప్పలూ పడాల్సి వచ్చింది. అలాగే ఇప్పటికీ ఆ భవనంలో చనిపోయిన 1,106 మందికి సంబంధించిన ఎటువంటి ఆనవాలూ దొరకలేదు. ఈ 22వేల శరీరభాగాలను వారి ఆనవాలు కోసం సైంటిస్టులు వెతుకుతూనే ఉన్నారు. వీళ్ల సంఖ్య మొత్తం మృతుల్లో 40శాతం ఉంది. అప్పుడే మిస్సయిన వ్యక్తుల డీఎన్ఏ శాంపిల్స్ సేకరించిన సైంటిస్టులు తమ పరిశోధనలు కొనసాగిస్తూనే వచ్చారు. 2005 నాటికి ఈ పరీక్షల్లో పాజిటివ్ ఫలితాలు కరువయ్యాయి. దీంతో తమ పరిశోధనలను నిలిపేస్తున్నట్లు అధికారులు ప్రకటించారు. అయితే అదే ఏడాది మళ్లీ ప్రయోగాలు ప్రారంభించారు. ఇలా అరుదుగానే పాజిటివ్ ఫలితాలు వచ్చి మృతుల శరీర భాగాలను గుర్తించిన్పటికీ సైంటిస్టులు తమ పరిశోధనలు కొనసాగించారు. ఈ క్రమంలో 2019 నుంచి ఇప్పటి వరకూ రెండు కొత్త కేసుల్లో పాజిటివ్ ఫలితం వచ్చింది. వాటిలో ఒకటి నికియా తల్లి డొరోతీది.


ఈ విషయం తెలిసిన నికియా ఏం చేయాలో తెలియని అయోమయంలో పడిపోయింది. ఆ శరీర భాగాలన్నింటిలో ఒక చిన్న ఎముక ముక్క తన తల్లిదని అధికారులు చెప్పారు. దాని కోసం ఒక పెద్ద శవపేటిక కొని పూడిస్తే.. అంత్యక్రియలు చేసిన తృప్తి కన్నా, కనీసం మృతదేహం లేదే అనే బాధే ఎక్కువగా ఉంటుందని ఆమె అంటోంది. ‘‘ఇలా చేయడం వల్ల అణుచుకున్న బాధలన్నీ మళ్లీ పెల్లుబుకుతాయి’’ అంటూ చెమ్మగిల్లిన కళ్లను తుడుచుకుందామె. ‘‘ఆ ఘటన జరిగి 20 ఏళ్లు అయిపోయింది. నెమ్మదిగా ఆ వ్యధను మర్చిపోతున్న తరుణంలో ఇలా ఆ పాత గాయాన్ని మరోసారి గుర్తుచేశారు. ఇప్పుడు మళ్లీ ఆ రోజులు గుర్తొచ్చి..’’ అంటూ తల్లి గుర్తొచ్చి ఏడ్చేసిందామె. అయితే ఇది తమ కనీస బాధ్యతని, మరణించిన వారికి తామిచ్చే గౌరవమని సైంటిస్టులు చెప్తున్నారు. 

Updated Date - 2021-09-08T06:41:10+05:30 IST