కొవిడ్‌తో చనిపోయిన వ్యక్తికి అంత్యక్రియలు.. 21 మంది మృతి

ABN , First Publish Date - 2021-05-08T22:28:57+05:30 IST

కరోనా సోకి మృతి చెందిన వ్యక్తికి అంత్యక్రియలు చేసిన 21 మంది కొవిడ్ బారినపడి మృత్యువాత పడ్డారు.

కొవిడ్‌తో చనిపోయిన వ్యక్తికి అంత్యక్రియలు.. 21 మంది మృతి

జైపూర్: కరోనా సోకి మృతి చెందిన వ్యక్తికి అంత్యక్రియలు చేసిన 21 మంది కొవిడ్ బారినపడి మృత్యువాత పడ్డారు. రాజస్థాన్‌లోని శిఖర్ జిల్లాలో జరిగిన ఈ ఘటన సంచలనమైంది. అయితే, నలుగురు మాత్రమే కరోనాతో చనిపోయారని, మిగతా వారు వివిధ కారణాలతో మరణించారని అధికారులు చెబుతున్నారు. ఇంతకీ ఏం జరిగిందంటే.. గత నెల 21న కరోనాతో మృతి చెందిన వ్యక్తి మృతదేహాన్ని స్వగ్రామమైన ఖీర్వా గ్రామానికి తీసుకొచ్చి అంత్యక్రియలు నిర్వహించారు. 150 మంది గ్రామస్థులు అంత్యక్రియల్లో పాల్గొన్నారు. నిజానికి కరోనా సోకిన వ్యక్తి మృతదేహానికి కరోనా నియమ నిబంధనలు పాటించి దహన సంస్కారాలు నిర్వహించాల్సి ఉండగా అలాంటివేమీ లేకుండానే పని పూర్తి చేశారు. 


ఈ ఘటన తర్వాతి నుంచి ఈ నెల 5వ తేదీ మధ్య ఏకంగా 21 మంది గ్రామస్థులు కరోనాతో మృతి చెందారు. వారందరూ అంత్యక్రియల్లో పాల్గొన్నవారే కావడంతో కలకలం రేగింది. అయితే, అధికారులు మాత్రం అందులో నాలుగు మరణాలు మాత్రమే కొవిడ్ సంబంధమైనవని, మిగతావి వయసు పరమైన సమస్యల కారణంగా సంభవించిన మరణాలని పేర్కొన్నారు. అవి కరోనా మరణాలు అవునో, కాదో తెలుసుకునేందుకు ఆయా కుటుంబాలకు చెందిన 147 మంది నుంచి నమూనాలు సేకరించి పరీక్షించినట్టు లక్ష్మణ్‌గఢ్ సబ్ డివిజనల్ అధికారి కల్రాజ్ మీనా తెలిపారు.  


గ్రామంలో 21 మంది మరణించిన తర్వాత అప్రమత్తమైన అధికారులు గ్రామంలో శానిటైజేషన్ డ్రైవ్ నిర్వహించారు. కరోనా తీవ్రత గురించి గ్రామస్థులకు వివరించామని, వారిప్పుడు సహకరిస్తున్నారని అన్నారు. ఘటన జరిగిన గ్రామం కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడు గోవింద్ సింగ్ డోటస్రా అసెంబ్లీ నియోజకవర్గంలోకి వస్తుంది. ఇక్కడి మరణాలపై తొలుత వెలుగులోకి తీసుకొచ్చింది ఆయనే.  

Updated Date - 2021-05-08T22:28:57+05:30 IST