210 ఏళ్ల సెయింట్‌ జాన్‌ చర్చి

ABN , First Publish Date - 2020-12-25T12:23:53+05:30 IST

భాగ్యనగరం సర్వమత సమ్మిళితం. హిందూ, ఇస్లాం

210 ఏళ్ల సెయింట్‌ జాన్‌ చర్చి

‘‘భాగ్యనగరం సర్వమత సమ్మిళితం. హిందూ, ఇస్లాం, క్రైస్తవం కలగలసిన సౌహర్ద్ర నగరి. తెలుగువాళ్లకి 16వ శతాబ్దంలో ఏసుక్రీస్తు పరిచయమయ్యారని చరిత్ర అధ్యయనకారుల అభిప్రాయం. అయితే, హైదరాబాద్‌లో మాత్రం 1800లలో బ్రిటీషు ఆర్మీరాకతో క్రీస్తు ఆరాధనా సంస్కృతి ప్రారంభమైందంటారు. ఈస్ట్‌మారేడ్‌పల్లిలోని సెయింట్‌ జాన్‌ చర్చి జంటనగరాల్లోనే అత్యంత పురాతనమైన ప్రార్థనామందిరంగా చరిత్రకారులు చెబుతారు. 210ఏళ్ల నాటి ఆ చర్చి తాలూకు విశేషాలు కథనంలో..!’’


హైదరాబాద్‌ : సికింద్రాబాద్‌లో అత్యంత పురాతనమైన చర్చి ఈస్ట్‌మారేడ్‌పల్లిలోని సెయింట్‌ జాన్‌ ప్రార్థనామందిరం. బాప్టిస్టు సెయింట్‌ జాన్‌ పేరుమీద 1810లో చర్చి నిర్మాణం ప్రారంభమైంది. 1813నాటికి కట్టడం పూర్తి అయింది. ఇటలీలోని టుస్కాన్‌ ప్రాంతపు శైలిలో దీనిని నిర్మించారు. సికింద్రాబాద్‌లో నివసించిన నాటి బ్రిటీషు సైన్యం అప్పట్లో చర్చి నిర్వాహకులను లండన్‌ నుంచి ప్రత్యేకంగా నియమించేవారని చారిత్రక ఆధారాల ద్వారా తెలుస్తోంది. చర్చిలోపల కుర్చీలు, బల్లలు తదితర చెక్క సామగ్రంతా ఆ రోజుల్లోనే బర్మా టేకుతో తయారుచేయించారు. అవి ఇప్పటికీ వాడకంలో ఉండటం విశేషం. తర్వాత కాలంలో చర్చి పోర్టిగో నిర్మాణానికి బహదూర్‌ రామ్‌గోపాల్‌ సేఠ్‌ ఆర్థిక సహాయం అందించారు.


1857 సమయంలో..

తొలినాళ్లలో కేవలం కొంతమంది సైనికాధికారులకు మాత్రమే చర్చిలోకి ప్రవేశం ఉండేది. చర్చి పెద్దలకు సైతం మేజర్‌ హోదాలో గౌరవం కల్పించేవారు. చర్చిలోకి వెళ్లేముందుగా, సైనికాధికారులు తమ ఆయుధాలను బయట ప్రత్యేకంగా నిర్మితమైన ఒక గదిలో భద్రపరిచిన అనంతరం ప్రార్థనామందిరంలోకి అడుగుపెట్టేవారు.  1857 సిపాయిల తిరుగుబాటు సమయంలో నిజాం సంస్థానంలోనూ బ్రిటీషు పాలనకు వ్యతిరేకంగా నిరసనలు మిన్నంటాయి. కొందరు తిరుగుబాటుదారులు ఆయుధాలతో చర్చిలోకి ప్రవేశించి, ఆంగ్లేయులపై దాడికి దిగిన ఘటనలూ ఉన్నాయని చరిత్ర అధ్యయనకారుడు యూనస్‌ లసానియా వివరించారు.


నాటి పరిణామాల అనంతరం బ్రిటీషు సైనికులు చర్చిలోకి ఆయుధాలను వెంట తీసుకెళ్లేందుకు మత పెద్దలు అనుమతించారు. చర్చిలో 1904నాటి పైప్‌ ఆర్గాన్‌ సంగీత పరికరం ప్రత్యేకం. ఇప్పటికీ పైప్‌ ఆర్గాన్‌ వాద్యంతో సంగీత ప్రదర్శనలు సాగుతుంటాయి. కంటోన్మెంట్‌కి చెందిన పలువురు బ్రిటీషు సైన్యాధ్యక్షుల స్మారకఫలకాలు చర్చిప్రాంగణంలో కనిపిస్తాయి. మద్రాసు యూరోపియన్‌ పదాతిదళనాయకుడు విలియం చార్లెస్‌ కెల్లోవ్‌ 1853లో మశూచికంతో కన్నుమూసినట్లు చర్చి ఆవరణలోని ఒక స్మారక ఫలకంద్వారా తెలుస్తుంది. సెయింట్‌ జాన్‌ చర్చికి సంబంధించిన మతపెద్దల సమాధులు పెరేడ్‌ మైదానం పరిసరాల్లోని శ్మశానవాటికలో ఉన్నాయని ఇన్‌ట్యాక్‌ కన్వీనర్‌ అనూరాధారెడ్డి చెబుతున్నారు.


నగరం భిన్న సంస్కృతికి ఆలవాలం..

జంటనగరాల్లోనే అత్యంత పురాతన ప్రార్థనామందిరంగా ఖ్యాతికెక్కిన సెయింట్‌ జాన్‌ చర్చిని 1998లో ఇన్‌ట్యాక్‌ సంస్థ వారసత్వ కట్టడంగా గుర్తించింది. సెయింట్‌ జాన్‌ చర్చి అనంతరం మరికొన్ని ప్రార్థనామందిరాలు సికింద్రాబాద్‌లో నిర్మితమయ్యాయి. అందులో విక్టోరియా మహారాణి నిధులతో 1847లో నిర్మించిన హోలిట్రినిటీ చర్చి ప్రత్యేకమైంది. తిరుమలగిరిలోని 1860 నాటి ఆల్‌ సెయింట్స్‌ చర్చి, సికింద్రాబాద్‌లోని 1839నాటి సెయింట్‌ మేరీస్‌ చర్చి, అబిడ్స్‌లో నిర్మితమైన 1844నాటి సెయింట్‌ జార్జి చర్చి, 1875లో క్రిస్మ్‌స రోజున ప్రారంభమైన గన్‌ఫౌండ్రీలోని సెయింట్‌ క్యాథడ్రల్‌ చర్చి, 1905లో చింతలబస్తీలో కట్టిన విజయమేరి చర్చి తదితర ప్రార్థనామందిరాలు నగరంలో నెలవైన భిన్నసంస్కృతికి ఆలవాలంగా నిలుస్తాయి.

Updated Date - 2020-12-25T12:23:53+05:30 IST