22ఏ కొత్త జాబితాపై కసరత్తు

ABN , First Publish Date - 2021-10-22T04:45:02+05:30 IST

అమ్మడానికి వీలులేని నిషేధ భూములు(22ఏ) కొత్త జాబితా తయారు చేయడానికి అధికారులు రంగం సిద్ధం చేస్తున్నారు. అందుకు సంబంధించి సీసీఎల్‌ఏ జీవో కూడా జారీ అయ్యింది. జాబితా తయారీపై తహసీల్దార్లుకు కూడా మార్గదర్శకాలు అందాయి.

22ఏ కొత్త జాబితాపై కసరత్తు

నేడు తహసీల్దార్లతో సమావేశం కానున్న కలెక్టర్‌

కలెక్టరేట్‌, అక్టోబరు 21: అమ్మడానికి వీలులేని  నిషేధ భూములు(22ఏ) కొత్త జాబితా తయారు చేయడానికి అధికారులు రంగం సిద్ధం చేస్తున్నారు. అందుకు సంబంధించి సీసీఎల్‌ఏ జీవో కూడా జారీ అయ్యింది. జాబితా తయారీపై తహసీల్దార్లుకు కూడా మార్గదర్శకాలు అందాయి. ఈ నేపథ్యంలోనే కలెక్టర్‌ సూర్యకుమారి శుక్రవారం తహసీల్దారులతో కలెక్టరేట్‌లో సమావేశం అవుతున్నారు. 1908 భూ చట్టం ప్రకారం అమ్మడానికి వీలు లేని భూములైన డి.పట్టా, గిరిజన, ఎండోమెంట్‌, వక్ఫ్‌బోర్డు, అసైన్డ్‌ భూముల వివరాలను రిజిస్ర్టేషన్‌ చట్టం ప్రకారం  2007లో 22ఏ జాబితాలో చేర్చారు. ఈ జాబితాను 2016, 2017 సంవత్సరాల్లో రెండు సార్లు తహసీల్దారులు సంబంధిత రిజిస్ర్టేషన్‌ కార్యాలయాలకు పంపించారు. ఈ జాబితాలోని భూములున్న సర్వే నెంబర్లను రిజిసే్ట్రషన్‌ చేయకూడదు. 2017లో జిల్లా వ్యాప్తంగా అన్ని మండలాలు కలిసి అసైన్డ్‌, డి.పట్టా, దేవదాయ, గిరిజన, వక్ఫ్‌బోర్డుల భూములకు సంబంధించి  2,83,654 సర్వే నెంబర్ల వివరాలను బ్లాక్‌లిస్టులో పెడుతూ తహసీల్దారులు సబ్‌ రిజిసా్ట్రర్‌ కార్యాలయాలకు పంపించారు. వీటిల్లో కొన్ని నంబర్లు వేర్వేరు కారణాలతో నిషేధ జాబితాల్లో చేరిపోవడంతో అసలైన రైతులు తీవ్ర నిరాశ చెందుతున్నారు. వారిలో కొందరి సమస్య పరిష్కారమైంది. 2016 నుంచి 22ఏ జాబితాపై దరఖాస్తు చేసుకున్న వారిలో ఇప్పటి వరకూ 40 నుంచి 50 దరఖాస్తులనే కలెక్టర్లు ఆమోదించినట్లు తెలుస్తోంది. గతంలో తహసీల్దార్లు పంపించిన  22ఏ జాబితాలో ఏవైనా నెంబర్లు ఇప్పుడు తయారు చేస్తున్న జాబితాలో నుంచి తీసివేస్తే అందుకు గల కారణాలను సృష్టంగా తెలియజేయాల్సి ఉంది. ఇదిలా ఉండగా కొత్తగా తయారు చేయనున్న 22ఏ జాబితాపై కొంతమంది ప్రజా ప్రతినిధులు ఆశలు పెట్టుకున్నారు. ఎప్పటిలా తహసీల్దార్లపై తీవ్ర స్థాయిలో ఒత్తిడి తెచ్చే అవకాశాలు లేకపోలేదు.


Updated Date - 2021-10-22T04:45:02+05:30 IST