నేటి నుంచి ఏపీకి 22 రైళ్లు

ABN , First Publish Date - 2020-06-01T08:47:16+05:30 IST

రాష్ట్రానికి సోమవారం నుంచి 22 రైళ్లు రానున్నాయి. ఇవి రాష్ట్రంలోని 71 రైల్వేస్టేషన్లలో ఆగుతాయి.

నేటి నుంచి ఏపీకి 22 రైళ్లు

అమరావతి, న్యూఢిల్లీ, గుంటూరు, విజయవాడ, మే 31(ఆంధ్రజ్యోతి): రాష్ట్రానికి సోమవారం నుంచి 22 రైళ్లు రానున్నాయి. ఇవి రాష్ట్రంలోని 71 రైల్వేస్టేషన్లలో ఆగుతాయి. హైరిస్క్‌ నగరాలు చెన్నై, ముంబై, హైరిస్క్‌ రాష్ట్రాలు గుజరాత్‌, ఢిల్లీ, రాజస్థాన్‌, మధ్యప్రదేశ్‌ల నుంచి వచ్చేవారిని ఏడు రోజుల పాటు క్వారంటైన్‌లో ఉంచుతారు. తర్వాత వారిని హోమ్‌ క్వారంటైన్‌కు పంపుతారు. కొవిడ్‌ ప్రత్యేక అధికారి ఎంటీ కృష్ణబాబు ఆదివారం ఈ వివరాలు వెల్లడించారు. కాగా, దేశవ్యాప్తంగా సోమవారం నుంచి 200 ప్రత్యేక రైళ్లు నడపనున్నారు. అయితే రైళ్ల సంఖ్య, స్టాపుల సంఖ్యపై ఏపీతోపాటు జార్ఖండ్‌, మహారాష్ట్ర ప్రభుత్వాలు అభ్యంతరం వ్యక్తం చేశాయి.


ఏపీలోని 18 స్టేషన్లలో మాత్రమే రైళ్లను ఆపాలని కోరినట్లు కృష్ణబాబు తెలిపారు. 71 స్టేషన్లలో హెల్త్‌ ప్రొటోకాల్‌ పాటించడం సాధ్యం కాదని రైల్వేశాఖకు వివరించామన్నారు. ఇదే అంశంపై ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్ని రైల్వే బోర్డు చైర్మన్‌ వినోద్‌కు ఓ లేఖ కూడా రాశారు. హైదరాబాద్‌-విశాఖ గోదావరి ఎక్స్‌ప్రె్‌సను విజయవాడ, రాజమండ్రిలలోనే ఆపాలని విజ్ఞప్తి చేశారు. గుంటూరు-సికింద్రాబాద్‌ గోల్కొండ ఎక్స్‌ప్రె్‌సను విజయవాడలో, తిరుపతి-నిజామాబాద్‌ రాయలసీమ ఎక్స్‌ప్రె్‌సను కడప, గుంతకల్‌లో, విశాఖ-న్యూఢిల్లీ ఏపీ ఎక్స్‌ప్రెస్‌ను రాజమండ్రి, విజయవాడలో, ముంబై-భువనేశ్వర్‌ కోణార్క్‌ ఎక్స్‌ప్రెస్‌ను విజయవాడ, విశాఖపట్నంలలో ఆపాలని కోరారు. ఈ స్టేషన్లలో జాగ్రత్తలన్నీ తీసుకుంటామని తెలిపారు. 


70 రోజుల తర్వాత..

దాదాపు 70 రోజుల తర్వాత గుంటూరు రైల్వేస్టేషన్‌ నుంచి తొలి రైలు సోమవారం బయలుదేరనుంది. గోల్కొండ ఎక్స్‌ప్రెస్‌(గుంటూరు-సికింద్రాబాద్‌)నే స్పెషల్‌ ట్రైన్‌గా మార్పు చేసి, రైల్వేశాఖ జెండా ఊపి ప్రారంభించనుంది. ఇప్పటికే  సెకండ్‌ సిట్టింగ్‌, ఏసీ చైర్‌కార్‌ టికెట్లన్నింటినీ ప్రయాణికులు అడ్వాన్స్‌ బుకింగ్‌ చేసుకున్నారు. ఉదయం 6 గంటలకు ఈ రైలు బయలుదేరనుండటంతో ప్రయాణికులు గంటన్నర ముందుగానే స్టేషన్‌కు చేరుకోవాల్సిందిగా అధికారులు సూచించారు. 

Updated Date - 2020-06-01T08:47:16+05:30 IST