హత్రాస్‌కు 500 కి.మీ. దూరంలోనే మరో దారుణం

ABN , First Publish Date - 2020-10-01T09:52:35+05:30 IST

హత్రాస్ ఘటనను మరువకముందే యూపీలో మరో దారుణమైన సంఘటన చోటుచేసుకుంది.

హత్రాస్‌కు 500 కి.మీ. దూరంలోనే మరో దారుణం

లక్నో: హత్రాస్ ఘటనపై దేశం అట్టుడుకుతోంటే.. యూపీలో మరో దారుణమైన సంఘటన చోటుచేసుకుంది. హత్రాస్‌కు 500 కి.మీ. దూరంలో ఉన్న బలరాంపూర్‌లో ఓ దళిత యువతిపై బుధవారం దుండగులు సామూహిక అత్యాచారానికి పాల్పడి ఆమె హత్యకు కారణమయ్యారు. యువతిని దారుణంగా కొట్టడంతో ఆసుపత్రికి తీసుకెళ్లే సమయంలోనే ఆమె మృతిచెందింది. బాధితురాలు సామూహిక అత్యాచారానికి గురైనట్టు.. నిందితులు ఆమెను తీవ్రంగా గాయపరచడం వల్లే ఆమె మరణించినట్టు పోస్టుమార్టం రిపోర్టులు చెబుతున్నాయి. ఇక ఈ కేసుకు సంబంధించి పోలీసులు ఇద్దరిని అరెస్ట్ చేయగా.. అందులో ఒక నిందితుడు మైనర్ అని తెలుస్తోంది. 


బుధవారం ఉదయం ఉద్యోగానికి బయల్దేరిన తన కూతురిని నిందితులు అపహరించారని బాధితురాలి తల్లి తెలిపింది. తన కూతురికి నిందితులు డ్రగ్స్ ఇచ్చి స్పృహ కోల్పోయేలా చేశారని.. అనంతరం సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారని ఆమె ఆవేదన వ్యక్తం చేసింది. అత్యాచారానికి పాల్పడటమే కాకుండా తన కూతురు నిలబడలేని విధంగా కొట్టారని చెబుతూ కన్నీటి పర్యంతమైంది. తన కూతురిని దారుణంగా కొట్టి నిందితులు ఓ ఆటోలో ఇంటికి పంపించారని.. తనకు చావాలని లేదని బతికించమంటూ ఇంటికొచ్చిన కూతురు వేడుకుందని తల్లి ఆవేదన వెల్లగక్కింది. కాగా.. ఆసుపత్రికి తీసుకెళ్లే మార్గమధ్యంలోనే బాధితురాలు మృతిచెందింది.


ఇక ఈ ఘటనపై యూపీ మాజీ సీఎం అఖిలేష్ యాదవ్ స్పందిస్తూ.. ‘హత్రాస్ బాధితురాలిలా యూపీలోని బలరాంపూర్‌లో మరో యువతి నరకాన్ని అనుభవించి మరణించింది. బీజేపీ ప్రభుత్వం కనీసం ఈ ఘటనకు కారణమైన నిందితులపైన అయినా వెంటనే చర్యలు తీసుకోవాలి’ అని ట్వీట్ చేశారు.  

Updated Date - 2020-10-01T09:52:35+05:30 IST