Abn logo
Oct 23 2021 @ 01:20AM

228 ప్రాథమిక పాఠశాలలు విలీనం

పనులు పరిశీలిస్తున్న డీఈవో

డీఈవో విజయభాస్కర్‌

కనిగిరి, అక్టోబరు 22: జిల్లాలోని 228 ప్రాథమిక పాఠశాలలోని 3, 4, 5 తరగతులను ఉన్నత పాఠశాలలో విలీనం చేస్తున్నట్లు జిల్లా విద్యాశాఖాధికారి విజయభాస్కర్‌ తెలిపారు. మండలంలోని బడుగులేరు పాఠశాల, కేజీబీవీ విద్యాలయం, బాలికల ఉన్నత పాఠశాల, ఎమ్మార్సీ కార్యాలయాలను శుక్రవారం ఆయన తనిఖీ చేశారు. అనంతరం ప్రధానోపాద్యాయులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా డిఈఓ మాట్లాడుతూ విద్యార్థులను నూతన విద్యావిధానానికి అలవాటు చేయాలన్నారు. ఉన్నత పాఠశాలలో విలీనం ద్వారా, సబ్జెక్టు టీచర్ల ద్వారా మెరుగైన బోధన అందుతుందన్నారు. జిల్లాలో ప్రైవేటు పాఠశాలల నుంచి 36వేల మంది విద్యార్థులు ప్రభుత్వ పాఠశాలలో చేరారన్నారు. వారికి మెరుగైన విద్యాబోధన అందించి నమ్మకాన్ని నిలబెట్టుకోవాలన్నారు.

ఇద్దరు ఉపాధ్యాయులకు మెమోలు

 మండల పరిధిలోని బడుగులేరు ప్రాథమికోన్నత పాఠశాలలో సరైన సెలవు పత్రం లేకుండా విధులకు గైర్హాజరైన ఇద్దరు ఉపాద్యాయులకు డీఈవో మొమో ఇచ్చారు. షేక్‌ చిన్నావలి, ఎం.వెంకటేశ్వర్లులు ప్రధానోపాద్యాయనికి సమాచారం ఇవ్వకుండా విధులకు గైర్హాజరయ్యారు. డీఈవో వెంట సమగ్రశిక్ష  సీఎంవో రాజాల కొండారెడ్డి, ఎంఈవో  జే.ప్రసాదరావు, ఓపెన్‌ స్కూల్స్‌ జిల్లా కో-ఆర్డినేటర్‌ జి.శ్రీనివాసులరెడ్డిలు ఉన్నారు. అనంతరం నాడు నేడు కింద నిర్మించిన మరుగుదొడ్లను పరిశీలించారు. 

విద్యార్థులపై ప్రత్యేక శ్రద్ధ చూపించాలి

వెలిగండ్ల : విద్యార్థులను దండించకుండా వెనుకబడిన విద్యార్థులపై ప్రత్యేక శ్రద్ధ చూపాలని డీఈవో విజయభాస్కర్‌ అన్నారు. శుక్రవారం వెలిగండ్ల జడ్పీఉన్నత పాఠశాలకు తనిఖీ చేసి విద్యార్థుల సామర్థ్యాలను పరిశీలించారు. కార్యక్రమంలో ఎంఈఓ దాసు ప్రసాదు, హెచ్‌ఎం విజయభాస్కర్‌రెడ్డి, పాల్గొన్నారు.