వచ్చే ఐదేళ్లలో 23 హైవేలు

ABN , First Publish Date - 2020-08-15T07:22:54+05:30 IST

భారత్‌మాల అనుసంధానంలో భాగంగా జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ(ఎన్‌హెచ్‌ఏఐ) రాష్ట్రంలో వచ్చే ఐదేళ్లలో నాలుగు జాతీయ రహదారులను ఎకనమిక్‌ కారిడార్‌లుగా తీర్చిదిద్దేందుకు...

వచ్చే ఐదేళ్లలో 23 హైవేలు

  • 3.3లక్షల కోట్లతో 7,800 కి.మీ నిర్మాణం


న్యూఢిల్లీ, హైదరాబాద్‌, ఆగస్టు 14 (ఆంధ్రజ్యోతి): భారత్‌మాల అనుసంధానంలో భాగంగా జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ(ఎన్‌హెచ్‌ఏఐ) రాష్ట్రంలో వచ్చే ఐదేళ్లలో నాలుగు జాతీయ రహదారులను ఎకనమిక్‌ కారిడార్‌లుగా తీర్చిదిద్దేందుకు నిర్ణయించింది. వచ్చే ఐదేళ్లలో 23 హైవేలు నిర్మించాలని సంకల్పించింది. ఈ మేరకు 2025 వరకు కొత్త హైవేల నిర్మాణంపై ప్రణాళికను సిద్ధం చేసింది. మొత్తంగా 7,800 కిలోమీటర్ల పొడవుగల ఈ రహదారుల నిర్మాణం కోసం రూ.3.3లక్షల కోట్లు ఖర్చు చేయనున్నారు. 23 హైవేల్లో ఢిల్లీ-ముంబై, అహ్మదాబాద్‌-ధొలేరా, అమృత్‌సర్‌-జామ్‌నగర్‌ సహా నాలుగు ఎక్స్‌ప్రెస్‌ హైవేలు ఉన్నాయి. కొత్త రహదారుల్లో ఇండోర్‌-హైదరాబాద్‌ (713 కి.మీ), హైదరాబాద్‌-విశాఖపట్నం (221 కి.మీ), హైదరాబాద్‌-రాయ్‌పూర్‌ (330 కి.మీ), రాయ్‌పూర్‌-వైజాగ్‌ (464 కి.మీ), చిత్తూర్‌, థాచూర్‌ (125 కి.మీ), షోలాపూర్‌-కర్నూలు (318 కి.మీ), నాగపూర్‌-విజయవాడ (457కి.మీ) ఉన్నాయి.  


ఎగుమతి, దిగుమతి టాప్‌-5 జిల్లాల్లో హైదరాబాద్‌

ఎగుమతి, దిగుమతి రంగంలో హైదరాబాద్‌ టాప్‌-5 జిల్లాల్లో ఒకటిగా కేంద్ర ఉపరితల రవాణాశాఖ ఆధ్వర్యంలో జరిగిన సర్వేలో వెల్లడైంది. ఐరన్‌, స్టీలు, సిమెంటు, బొగ్గుతో పాటు భవన నిర్మాణ మెటీరియల్‌ దిగుమతుల్లో, ఫార్మా, పప్పుదినుసులు, భారీ యంత్రాలు, పేపర్‌ ప్రొడక్ట్‌ల ఎగుమతుల్లో హైదరాబాద్‌ జిల్లా టాప్‌-5లో నిలిచింది. దీంతో, ఈ ప్రాంతాన్ని ఎకనమిక్‌ కారిడార్‌ జాబితాలో కేంద్రం చేర్చిందని ఎన్‌హెచ్‌ఏఐ వర్గాలు వెల్లడించాయి. శాస్త్రీయ పద్ధతిలో నిర్వహించిన సర్వేలో దేశవ్యాప్తంగా 44 ఎకనమిక్‌ కారిడార్‌లను కేంద్రం గుర్తించింది. ఇందులో, హైదరాబాద్‌-పనాజీ, హైదరాబాద్‌-ఔరంగబాద్‌ కూడా ఉన్నాయి. రాష్ట్రానికి సంబంధించి మరో రెండు జాతీయ రహదారులను కూడా ఈ  జాబితాలో చేర్చింది. 

Updated Date - 2020-08-15T07:22:54+05:30 IST