నగరంలో 23 మందికి ఒమైక్రాన్‌

ABN , First Publish Date - 2022-01-01T17:29:17+05:30 IST

కేంద్ర ప్రభుత్వం సమస్యాత్మక రాష్ట్రంగా గుర్తించి హెచ్చరించిన కొన్నిగంటల వ్యవధిలోనే కర్ణాటకలో ఒమైక్రాన్‌ వేరియంట్‌ కేసులు బెంబేలెత్తిస్తున్నాయి. శుక్రవారం బెంగళూరులో ఏకంగా 23 మందికి ఒమైక్రాన్‌ నిర్ధారణ

నగరంలో 23 మందికి ఒమైక్రాన్‌

బెంగళూరు: కేంద్ర ప్రభుత్వం సమస్యాత్మక రాష్ట్రంగా గుర్తించి హెచ్చరించిన కొన్నిగంటల వ్యవధిలోనే కర్ణాటకలో ఒమైక్రాన్‌ వేరియంట్‌ కేసులు బెంబేలెత్తిస్తున్నాయి. శుక్రవారం బెంగళూరులో ఏకంగా 23 మందికి ఒమైక్రాన్‌ నిర్ధారణ అయింది. ఇదే విషయాన్ని రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి డాక్టర్‌ సుధాకర్‌ ట్వీట్‌ ద్వారా స్పష్టం చేశారు. ఒమైక్రాన్‌ సోకిన 23 మందిలో టాంజానియా నుంచి వచ్చిన రెండేళ్ల చిన్నారి, పదేళ్ల బాలికతో పాటు అ మెరికా నుంచి వచ్చిన 12 ఏళ్ల బాలిక ఉన్నారు. విదేశాల నుంచి వచ్చిన 20 మందితో కలిపి ప్రాథమిక సంబంధాలు కలిగి ముగ్గురు స్థానికులుగా నిర్ధారించారు. వివిధ దేశాల నుంచి బెంగళూరు ఎయిర్‌పోర్టుకు చేరుకున్నవారికి కొవిడ్‌ నిర్ధారణ కాగా వారికి జినోమి సీక్వెన్స్‌ జరిపించిన మేరకు నిర్ధారణ అయింది. వీరిలో అమెరికా నుంచి వచ్చిన వారు ఏడుగురు కాగా టాంజానియా-3, దక్షిణాఫ్రికా- 2, నైజీరియా-2, దుబై-2 కాగా డెన్మార్క్‌, కొంగో, యునైటెడ్‌ అరబ్‌ఎమిరేట్స్‌, యునైటెడ్‌ కింగ్‌డం నుంచి వచ్చిన వారు ఒకొక్కరు ఉన్నారు. దేశంలో తొలి ఒమైక్రాన్‌ కేసులు బెంగళూరులో వెలుగుచూడగా తర్వాత చాలా రోజుల పాటు కేసులు నమోదు కాలేదు. అయితే ఒక్కసారిగా 23 మందికి ఒమైక్రాన్‌ వేరియంట్‌ సోకడంతో రాష్ట్రంలో బాధితుల సంఖ్య 66కు చేరింది. వివిధ దేశాల నుంచి వచ్చేవారి ద్వారానే వైరస్‌ ప్రబలుతుండటంతో బెంగళూరు, మంగళూరులోని అంతర్జాతీయ విమానాశ్రయాలను మరింత కట్టడి చేశారు. ప్రతి ప్రయాణికుడిని పూర్తిస్థాయిలో పరీక్షించనున్నారు. కొత్త ఏడాది ఆరంభంలోనే రాష్ట్ర ప్రజలు బెంబేలెత్తారు.

Updated Date - 2022-01-01T17:29:17+05:30 IST