Mexico Metro ప్రమాదం... భారీ ప్రాణ నష్టం...

ABN , First Publish Date - 2021-05-04T19:44:44+05:30 IST

ఓ రైలు ప్రయాణిస్తుండగా నగరంలోని మెట్రో ఓవర్‌పాస్ సోమవారం

Mexico Metro ప్రమాదం... భారీ ప్రాణ నష్టం...

మెక్సికో సిటీ : ఓ రైలు ప్రయాణిస్తుండగా నగరంలోని మెట్రో ఓవర్‌పాస్ సోమవారం రాత్రి కుప్పకూలడంతో దాదాపు 23 మంది ప్రాణాలు కోల్పోయారు, సుమారు 70 మందిగాయపడ్డారు. కొన్ని ట్రైన్ క్యారేజెస్ నేలపై పడిపోయాయి. ఆ ఓవర్‌పాస్ క్రింద రద్దీగా ఉండే రోడ్డుపై ప్రయాణిస్తున్న ఓ కారు నుజ్జునుజ్జయింది. అగ్నిమాపక, ఇతర సిబ్బంది ఈ ప్రమాదం జరిగిన వెంటనే సహాయ కార్యకలాపాలు ప్రారంభించారు. ప్రమాదం నుంచి బయటపడినవారిని కాపాడేందుకు చర్యలు చేపట్టారు. 


ఈ మెట్రోలోని లైన్ 12పైగల ఒలివోస్ స్టేషన్ వద్ద ఈ ప్రమాదం జరిగింది. ఈ ఓవర్‌పాస్ కుప్పకూలుతున్నట్లు కనిపించే ఓ వీడియో బయటపడింది. 2017లో సంభవించిన భూకంపం తర్వాత ఈ మెట్రో నిర్మాణంలో పెద్ద ఎత్తున బీటలు కనిపిస్తున్నాయని స్థానికులు చాలా రోజుల నుంచి ఫిర్యాదు చేస్తున్నారు. అధికారులు మరమ్మతులు చేయించినప్పటికీ ఫలితం లేకపోయిందని స్థానిక మీడియా వెల్లడించింది. 


మెక్సికో సిటీ మేయర్ క్లాడియా షీన్‌బామ్ మాట్లాడుతూ, ఈ ప్రమాదంలో 23 మంది ప్రాణాలు కోల్పోయినట్లు, 70 మంది గాయపడినట్లు తెలిపారు. ఈ ప్రమాదంలో శిథిలాల క్రింద చిక్కుకున్నవారి కోసం అన్వేషణ జరుగుతోందని చెప్పారు. శిథిలాల క్రింద ఇంకా కొందరు ఉన్నట్లు ఆందోళన వ్యక్తమవుతోందన్నారు. 


ఈ ప్రమాదం నుంచి బయటపడిన మరియానా (26) మీడియాతో మాట్లాడుతూ, అకస్మాత్తుగా పెద్ద పిడుగులాంటి శబ్దం వినిపించిందన్నారు. అంతలోనే మొత్తం కుప్పకూలిపోయిందన్నారు. రైలులో చాలా మంది నిల్చున్నారని, కొందరు కూర్చున్నారని తెలిపారు. తాను రైలు పై కప్పునకు ఢీకొన్నానని చెప్పారు. తనకు తీవ్రమైన గాయాలు తగలలేదని, అందువల్ల తాను మరికొందరికి సహాయపడ్డానని తెలిపారు. తన సహాయంతో కొందరు కిటికీ గుండా బయటకు రాగలిగారన్నారు. 


ఓ ప్రత్యక్ష సాక్షి స్థానిక మీడియాతో మాట్లాడుతూ, తాను హఠాత్తుగా మెట్రో ఓవర్‌పాస్ కంపించడం చూశానన్నారు. అంతలోనే పెద్ద ఎత్తున ధూళి కమ్మిందని, ఆ ధూళి తగ్గిన వెంటనే తాము పరుగు పరుగున అక్కడికి వెళ్ళామని చెప్పారు. ఆ రైలులోనివారు ఎవరూ పెద్దగా కేకలు వేయలేదన్నారు. అయితే వారంతా దిగ్భ్రాంతికి గురవడం వల్ల అరవలేకపోయారేమోనని చెప్పారు. 


మెట్రోలైన్-12 నిర్మాణాన్ని 2012 అక్టోబరులో పూర్తి చేశారు. 


Updated Date - 2021-05-04T19:44:44+05:30 IST