Abn logo
Sep 26 2021 @ 19:21PM

మొదటిసారి Americaకు వెళుతున్నారా.. ప్లీజ్.. ఈ తప్పులు అస్సలు చేయకండి!

ఇంటర్నెట్ డెస్క్: ప్రతి సంవత్సరం సగటున 7.5 కోట్ల మంది అమెరికాలో పర్యటిస్తుంటారు. భిన్న నేపథ్యాలు, విభిన్న సంస్కృతులకు చెందిన అనేక మంది తొలిసారిగా అమెరికాకు వెళుతుంటారు. అటువంటి సమయంలో.. అమెరికా ప్రజలతో ఎలా మెలగాలి, బహిరంగ ప్రదేశాల్లో ఏదీ చేయాలి, ఏదీ చేయకూడదు.. ఏదీ మాట్లాడితే పెడర్థం వస్తుంది.. అనే విషయాల్లో పూర్తి అవగాహన కలిగి ఉండాలి. లేని పక్షంలో ప్రమాదంలో పడే అవకాశం ఉంది. ఒక్కోసారి విషయం పోలీసుల వరకూ వెళ్లినా ఆశ్చర్యపోనక్కర్లేదు. కాబట్టి.. తొలిసారిగా అమెరికాలో పర్యటించే వారు కింది విషయాల్లో చాలా జాగ్రత్తగా ఉండాలి! అవేంటంటే..

 • అమెరికన్లకు చేతి మధ్య వేలును అస్సలు చూపించకూడదు. దీని వల్ల ఒక్కోసారి ప్రాణాలమీదకు వచ్చినా ఆశ్చర్యపోనక్కర్లేదు. 
 • జనసంచారం అధికంగా ఉన్న ప్రాంతాల్లో అల్లా హు అక్బర్ అని గట్టిగా అనకండి. ఆ తరువాత మీరు ఇబ్బందుల్లో పడతారు. 
 • సీట్ బెల్ట్ పెట్టుకోకుండా కారులో ప్రయాణం నిషిద్ధం
 • మద్యం మత్తులో కారు నడపకండి. పోలీసులు దీన్ని అస్సలు సహించరు.
 • కారు నడిపే టప్పుడు ఫోన్లో మాట్లాడటం..మొబైల్‌లో మెసేజ్‌లు పంపించడం చేస్తే చిక్కుల్లో పడ్డట్టే.
 • అమెరికా జాతీయ పతాకాన్ని అవమానించినా లేదా అమెరికా సైన్యాన్ని నిందించినా అపాయాన్ని కొని తెచ్చుకున్నట్టే..
 • ఒక రాష్ట్రంలో చట్టం ఆమోదించినవి మరో రాష్ట్రంలో చట్టవ్యతిరేకం కావచ్చు.. ఇటువంటి వస్తువుల విషయంలో జాగ్రత్త తప్పనిసరి.
 • వ్యక్తులతో సంభాషించే క్రమంలో వారికి కాస్తంత దూరంగా ఉండండి. మరీ దగ్గరకొచ్చి మాట్లాడితే మీరు వ్యక్తిగత సరిహద్దులను మీరుతున్నట్టు అవతలివారు భావించే ప్రమాదం ఉంది.
 • ఎవరినీ అదేపనిగా గుచ్చి గుచ్చి చూడకండి. అమెరికన్లు దీన్ని అమర్యాదకరమైన చర్యగా భావిస్తారు. 
 • వికలాంగుల కోసం కేటాయించిన స్థలంలో వాహనాలను నిలపకండి
 • లిఫ్ట్‌లోని వారందరూ బయటకొచ్చాకే మీరు లోపలికెళ్లండి. మీరు ఆదరాబాదరాగా లోపలికెళ్లేందుకు ప్రయత్నిస్తే..లిఫ్ట్ బయటకొచ్చేవారు ఇబ్బంది పడి విసుక్కునే ప్రమాదం ఉంది. 
 • వీధుల్లో నడిచి వెళ్లేటప్పుడు కుడివైపునే ఉండాలి
 • క్యూలో నిలబడినప్పుడు మీ సమయం వచ్చే దాకా వేచి చూడండి.. లైన్ జంప్ చేసేవారిని అమెరికన్లు అసలేమాత్రం ఇష్టపడరు
 • టెర్రరిస్టుల, బాంబులు వంటి పదాలను సరదాకు కూడా పలకకండి. మనదేశంలో అది జోక్ అవుతుందేమో గానీ.. అమెరికాలో మాత్రం ఈ పేర్లు ప్రకంపనలు సృష్టిస్తాయి. ఊహించని పరిణామాలకు దారితీస్తాయి
 • పరిచయం లేని వారితో రాజకీయాలు, మతపరమైన విషయాలపై చర్చలు మొదలెట్టొద్దు.
 • పోలీసులతో మాట్లాడుతున్నప్పుడు మీ జేబులో ఉన్న వస్తువులను తీసేందుకు ప్రయత్నించకండి. వారు అపార్థం చేసుకునే ప్రమాదం ఉంది. అంతేకాకుండా.. అక్కడి పోలీసులు మీ కారును ఆపితే..వెంటనే కారు దిగే ప్రయత్నం చేయకండి. సీటులోనే కూర్చుని వారితో ప్రశాంతంగా సంభాషించండి
 • పోలీసులతో వాదనలకు దిగొద్దు. 
 • ఏదైనా ప్రమాదంలో ఉంటే తప్ప కారు హారన్‌ను మోగించకండి
 • అమెరికా ప్రభుత్వం దృష్టిలో అందరూ సమానమే. కాబట్టి.. మీ హోదా లేదా ఆస్తిపాస్తులను ప్రస్తావిస్తే ప్రత్యేక మర్యాద దక్కుతుందనే ఆశలు పెట్టుకోవద్దు. 
 • రెస్టారెంట్లు, హోటళ్ల నుంచి వెళ్లిపోయేటప్పుడు అక్కడి సర్వర్లకు టిప్ ఇవ్వడం మర్చిపోకండి. మీరు ఇచ్చే టిప్పుల ద్వారానే వారికి తమ జీవికకు కావాల్సిన ఆదాయం వస్తుంది.
 • ఊబకాయం అంశంపై జోకులు వేయడాన్ని అక్కడి వారు అమర్యాదగా భావిస్తారు. 
 • ఒక్క పర్యటనలోనే అన్ని రాష్ట్రాలను చుట్టేయాలని ట్రై చేయకండి. అది దాదాపుగా అసాధ్యం
 • మీ సంస్కృతి, సంప్రదాయాల గురించి అమెరికన్లతో పంచుకునేందుకు వెనకాడొద్దు. అధిక శాతం అమెరికన్లు తమ నిత్య జీవితంలో చాలా బిజీగా ఉండటంతో విదేశీ పర్యటనలు చేయరు. కాబట్టి.. మీరు చెప్పే విషయాలను ఆసక్తితో వింటారు.  

తాజా వార్తలుమరిన్ని...