భారత సైనికులు కరోనా విధుల్లో.. పాక్ ఉగ్రవాదులు సరిహద్దుల్లో..

ABN , First Publish Date - 2020-04-10T02:43:15+05:30 IST

భారత్‌లో విధ్వంసానికి పాక్ ప్రేరేపిత ఉగ్రవాదులు మరోమారు పథకం పన్నారా? తాజా పరిణామాలు చూస్తుంటే..

భారత సైనికులు కరోనా విధుల్లో.. పాక్ ఉగ్రవాదులు సరిహద్దుల్లో..

న్యూఢిల్లీ: భారత్‌లో విధ్వంసానికి పాక్ ప్రేరేపిత ఉగ్రవాదులు మరోమారు పథకం పన్నారా? తాజా పరిణామాలు చూస్తుంటే అవుననే అనిపిస్తోంది. భారత భద్రతా బలగాలు జమ్ముకశ్మీర్‌లో కరోనా మహమ్మారిపై యుద్ధం చేస్తుంటే, పాక్ ప్రేరేపిత ఉగ్రవాదులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని చూస్తున్నారు. కశ్మీరులోని నియంత్రణ రేఖతోపాటు జమ్ము సరిహద్దుల్లో కాపుకాశారు. దాదాపు 230 మంది ఉగ్రవాదులు భారత్‌లో చొరబడేందుకు లాంచ్‌ ప్యాడ్‌లను సిద్ధం చేస్తున్నారు. వచ్చే మరికొన్ని వారాల్లో లేదంటే, కొన్ని నెలల్లో వీరంతా భారత్‌లోకి చొరబడేందుకు రెడీ అవుతున్నారు. ఆదివారం జరిగిన ఎన్‌కౌంటర్‌లో మరణించిన ఐదుగురు ఉగ్రవాదులు తొలి బ్యాచ్ వారని, ఇలాంటి బ్యాచ్‌లు ఇంకా చాలానే ఉన్నాయని జమ్మూకశ్మీర్ పోలీస్ చీఫ్ దిల్‌బాగ్ సింగ్ తెలిపారు.  


లష్కరే తాయిబా, (ఎల్‌ఈటీ), జైషే మహ్మద్ (జేఈఎం), హిజ్బుల్ ముజాహిదీన్ (హెచ్ఎం) వంటి ఉగ్రవాద సంస్థలకు చెందిన 160 చొరబాటుకు సిద్ధంగా ఉన్నట్టు ఇంటెలిజెన్స్ వర్గాలు గుర్తించాయి. జమ్ము సెక్టార్‌లో మరో 70 మంది శిక్షణ పొందిన, సాయుధ ఉగ్రవాదులు చొరబాటుకు సిద్ధంగా ఉన్నారు. వీరంతా ఫెన్సింగ్ లేని సరిహద్దులు, నదీ ప్రాంతం, నల్లాల ద్వారా భారత్‌లోకి ప్రవేశించాలని చూస్తున్నట్టు ఇంటెలిజెన్స్ వర్గాలకు ఉప్పందింది. 

Updated Date - 2020-04-10T02:43:15+05:30 IST