బెంగళూరులో కొందరి అతి తెలివి కారణంగా డేంజర్‌‌లో నగరవాసులు..!

ABN , First Publish Date - 2020-07-14T05:15:40+05:30 IST

కర్ణాటకలో కరోనా వైరస్ రోజురోజుకూ తీవ్ర రూపం దాల్చుతోంది. మరీ ముఖ్యంగా..

బెంగళూరులో కొందరి అతి తెలివి కారణంగా డేంజర్‌‌లో నగరవాసులు..!

బెంగళూరు: కర్ణాటకలో కరోనా వైరస్ రోజురోజుకూ తీవ్ర రూపం దాల్చుతోంది. మరీ ముఖ్యంగా.. బెంగళూరు నగరంలో నమోదవుతున్న కరోనా కేసుల సంఖ్య కలవరపెడుతోంది. ఇలాంటి సందర్భంలో.. కొందరి నిర్లక్ష్యం నగరవాసులకు శాపంగా మారింది.


విషయమేంటంటే.. అన్‌లాక్ 2లో భాగంగా నిబంధనలను సడలించి ప్రజా రవాణాకు కొంత వెసులుబాటు కల్పించడంతో ఇతర రాష్ట్రాల నుంచి బెంగళూరుకు, ఇతర రాష్ట్రాల్లో చిక్కుకున్న బెంగళూరు వాసులు నగరానికి గత కొద్ది రోజులుగా తిరిగొస్తున్నారు. అయితే.. కర్ణాటక ప్రభుత్వ నిబంధనల ప్రకారం.. ఇతర రాష్ట్రాల నుంచి కర్ణాటకకు వచ్చే వారు 14 రోజులు తప్పనిసరిగా హోం క్వారంటైన్‌లో ఉండాలి. దీంతో.. బెంగళూరు నగరంలోకి వచ్చే వారి వివరాలను, వారి చిరునామాలను బస్టాండ్లు, రైల్వే స్టేషన్లలో తప్పనిసరిగా తీసుకుంటున్నారు. హోం క్వారంటైన్‌లో 14 రోజులు తప్పనిసరిగా ఉండాల్సిందిగా వైద్యఆరోగ్య శాఖ అధికారులు సూచిస్తున్నారు.


అయితే.. నగరానికి వచ్చిన వారిలో కొందరు అతి తెలివి ప్రదర్శించి.. ఇతరుల ప్రాణాలను అపాయంలోకి నెట్టినట్టు తాజాగా వెల్లడైంది. సరైన చిరునామా ఇస్తే హోం క్వారంటైన్‌ను పాటిస్తున్నారో, లేదో తనిఖీ చేస్తారని భావిస్తున్న కొందరు తప్పుడు చిరునామాలు ఇస్తున్నట్లు తేలింది. ఇలా బెంగళూరు నగరానికి వచ్చిన వారిలో.. ఆదివారం నాటికి 69,297 మంది హోం క్వారంటైన్‌‌లో ఉండాల్సి ఉంది. వీరిలో.. 46,113 మంది సరైన చిరునామాలు సమర్పించగా, 23,184 మంది తప్పుడు చిరునామాలు, పనిచేయని సెల్ ఫోన్ నంబర్లు ఇచ్చినట్లు వైద్యశాఖ అధికారులు తేల్చారు.


వీరిని ట్రాక్ చేయడం స్థానికంగా ఉండే క్వారంటైన్ స్క్వాడ్‌‌కు పెద్ద తలనొప్పిగా మారింది. అడ్రస్ సరైంది కాదని.. ఫోన్ చేస్తున్నప్పటికీ అందుబాటులో లేదనే సమాధానం వస్తోంది. ఇలా తప్పుడు అడ్రస్‌లు ఇచ్చిన వారంతా కరోనా టెస్టులు చేయించుకోకుండా.. హోం క్వారంటైన్‌ను పాటించకుండా ప్రజల్లో కలిసి తిరిగితే వారితో పాటు ఇతరులకు కూడా ప్రమాదమేనని కర్ణాటక వైద్యఆరోగ్య శాఖ అధికారులు చెబుతున్నారు.

Updated Date - 2020-07-14T05:15:40+05:30 IST