కరోనా కలకలం.. అతడితో ప్రయాణించిన 24 మంది కుటుంబాల్లో కలవరం..!

ABN , First Publish Date - 2020-05-21T18:32:42+05:30 IST

కరీంనగర్ జిల్లాలో మళ్లీ కరోనా కలవరం కలిగిస్తున్నది. ఇండోనేషియన్లు, మర్కజ్‌ల లింకులలో కరోనా బారిన పడ్డ 19 మంది చికిత్స అనంతరం కోలుకొని ఇళ్లకు చేరుకున్నారు. ఇప్పుడిప్పుడే భయం ఛాయలు వీడుతున్న దశలో ముంబై భయం పట్టుకున్నది.

కరోనా కలకలం.. అతడితో ప్రయాణించిన 24 మంది కుటుంబాల్లో కలవరం..!

భయపెడుతున్న ముంబై వలసలు

చొప్పదండిలో ఒకరికి కరోనా

అతనితోపాటు ప్రయాణించిన 24 మంది కుటుంబాల్లో కలవరం

క్వారంటైన్‌కు ఆరుగురు కుటుంబసభ్యులు 

జిల్లావ్యాప్తంగా 924 మంది వలస జీవుల రాక 

గ్రామాల్లో భయం...భయం 


(ఆంధ్రజ్యోతి ప్రతినిధి, కరీంనగర్‌): కరీంనగర్ జిల్లాలో మళ్లీ కరోనా కలవరం కలిగిస్తున్నది. ఇండోనేషియన్లు, మర్కజ్‌ల లింకులలో కరోనా బారిన పడ్డ 19 మంది చికిత్స అనంతరం కోలుకొని ఇళ్లకు చేరుకున్నారు. ఇప్పుడిప్పుడే భయం ఛాయలు వీడుతున్న దశలో ముంబై భయం పట్టుకున్నది. ముంబై నుంచి చొప్పదండికి తిరిగి వచ్చిన ఒకరికి కరోనా వ్యాధి సోకినట్లు నిర్ధారణ కావడంతో అతడిని గాంధీ ఆస్పత్రికి పంపించి అతడి కుటుంబసభ్యులు ఆరుగురిని క్వారంటైన్‌కు తరలించారు. కరోనా పాజిటివ్‌ వ్యక్తి మరో 24 మందితో కలిసి ఈ నెల 12వ తేదీ సాయంత్రం ముంబైలో బయలుదేరి 13 న చొప్పదండికి చేరుకున్నారు. చొప్పదండికి చెందిన ఆరుగురు, రామడుగుకు చెందిన ఐదుగురు, జగిత్యాల జిల్లా మల్యాల మండలానికి చెందిన ఐదుగురు, పెగడపల్లికి చెందిన నలుగురు, ధర్మపురి మండలానికి చెంది న ఇద్దరు, గొల్లపల్లి, బుగ్గారం, రాజన్న సిరిసిల్లకు చెం దిన ఒక్కొక్కరు మొత్తం 25 మంది కలిసి ముంబై నుంచి ఒకే వాహనంలో ప్రయాణించారు. ఒకరోజంతా వారు కలిసే ఉన్నారు. వారిలో ఒకరికి ఇప్పుడు కరోనా పాజిటివ్‌ రావడంతో ఆయా కుటుంబాలకు చెందిన వారందరూ బెంబేలెత్తి పోతున్నారు. 


చొప్పదండిలో ఐదు వైద్య బృందాలతో పరీక్షలు

చొప్పదండికి చెందిన వ్యక్తికి కరోనా వ్యాధి సోకినట్లు నిర్ధారణ కావడంతో జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారు లు అప్రమత్తమై ఆ గ్రామానికి ఐదు వైద్యబృందాలను పంపించారు. అతని ఇంటి పరిసర ప్రాంతాల్లో ఉన్న 267 గృహాల్లో 1,068 మందికి థర్మల్‌ స్ర్కీనింగ్‌ చేయడంతోపాటు వారి ఆరోగ్యపరిస్థితులు అడిగి తెలుసుకున్నారు. గురువారం కూడా వైద్య పరీక్షలు నిర్వహించాలని నిర్ణయించారు. ఉమ్మడి జిల్లా పరిధిలోని కరీంనగర్‌, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల జిల్లాలకు చెందిన వారు పలువురు ముంబై, భీవండి, సూరత్‌, పూణె తదితర ప్రాంతాల్లో వలస కార్మికులుగా పనిచేస్తున్నారు. మహారాష్ట్ర ప్రధానంగా ముంబైలో కరో నా వ్యాధి విజృంభించడం, వేలాది మంది వ్యాధి బారిన పడుతుండడంతో ఆయా ప్రాంతాల్లో ఉన్న జిల్లాకు చెందిన వారు వారంరోజులుగా ఇళలకు రావడం ప్రారంభించారు. 


ఇష్టారాజ్యంగా సంచారం

జిల్లాకు చెందిన 924 మంది ముంబై తదితర ప్రాంతాల నుంచి స్వగ్రామాలకు చేరుకున్నారు. వీరందరికి వైద్య ఆరోగ్యశాఖ హోంక్వారంటైన్‌ విధించినట్లు చెప్పి ఇళ్లకే పరిమితం కావాలని సూచించింది.  ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన వారు ఇళ్లలోనే ఉంటున్నా, వారి కుటుంబసభ్యులు ఎప్పటిలాగే సంచరిస్తుండడం తో కరోనా భయం పొంచి ఉన్నట్లు ఆందోళన వ్యక్తమవుతున్నది. అధికారుల దృష్టికి రాకుండా మరికొందరు గ్రామాలకు చేరుకున్నారని తెలుస్తున్నది. జగిత్యాల జిల్లాలో 3,964 మంది, రాజన్న సిరిసిల్లలో 618 మంది ముంబై త దితర ప్రాంతాల నుంచి వారి స్వగ్రామాలకు చేరుకున్నారు. దీంతో ఒక్క సారిగా కరోనా కేసులు పెరగడం ప్రారంభమైంది. వారంరోజుల వ్యవధిలో జగిత్యాల జిల్లాలో 20 మందికి కరోనా వ్యాధి నిర్ధారణ కాగా, రాజన్న సిరిసిల్లలో నలుగురికి, కరీంనగర్‌లో ఒక్కరికి వ్యాధి సోకినట్లు నిర్ధారణ అయింది. ఉమ్మడి జిల్లా పరిధిలో 5,600 మంది తిరిగి రావడంతో వీరిలో ఎందరిలో కరో నా వ్యాధి లక్షణాలు ఉన్నాయో మరెన్ని కేసులు రిపోర్టు అవుతాయనే ఆందోళన వ్యక్తమవుతున్నది. పొరుగునే ఉన్న మంచిర్యాల జిల్లాలో కూడా 17 మంది వలస కూలీలకు  కరోనా వ్యాధి సోకింది.

Updated Date - 2020-05-21T18:32:42+05:30 IST