కిలో చికెన్‌ రూ.240

ABN , First Publish Date - 2020-03-30T10:02:01+05:30 IST

రాష్ట్రంలో చికెన్‌, మటన్‌ ధరలు అనూహ్యంగా పెరిగాయి. ఆదివారం కొన్ని ప్రాంతాల్లో వ్యాపారులు ఏకంగా ఎన్నడూ లేనంత రేట్లకు అమ్మారు. లాక్‌డౌన్‌తో

కిలో చికెన్‌ రూ.240

కిలో మటన్‌ రూ.800 వరకు

హైదరాబాద్‌తో పాటు జిల్లాల్లోనూ దాదాపు ఇంతే..

లాక్‌డౌన్‌తో భారీగా పెరిగిన వినియోగం

ఒక్కసారిగా పెరిగిన రేట్లు

వినియోగదారుల గగ్గోలు

నియంత్రించాలని ప్రభుత్వానికి సూచన


హైదరాబాద్‌, మార్చి 29 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో చికెన్‌, మటన్‌ ధరలు అనూహ్యంగా పెరిగాయి. ఆదివారం కొన్ని ప్రాంతాల్లో వ్యాపారులు ఏకంగా ఎన్నడూ లేనంత రేట్లకు అమ్మారు. లాక్‌డౌన్‌తో ప్రజలంతా ఇళ్లకే పరిమితమై మాంసాహార వంటకాలు ఎక్కువగా చేస్తుండటంతో ఇప్పటికే వినియోగం పెరిగింది. దీనికితోడు ‘కరోనా ప్రబలేందుకు.. చికెన్‌, మటన్‌, చేపలు, గుడ్లు ఏవీ కారణం కాదు. ఇప్పుడున్న పరిస్థితుల్లో రోగ నిరోధక శక్తి మరింత పెరగాలంటే వాటిని ఎక్కువగా తినాలి’ అని ముఖ్యమంత్రి కేసీఆర్‌ స్వయంగా ప్రకటించడంతో అపోహలు తొలగాయి. ఇదే అదనుగా వ్యాపారులు ధరలు పెంచుతున్నారు.


హైదరాబాద్‌లో ఇటీవలి వరకు కిలో మటన్‌ రూ.680 నుంచి రూ.700 మధ్య ఉండగా.. ఆదివారం రూ.800 అయింది. రామంతాపూర్‌, ఉప్పల్‌, మేడిపల్లి, హయత్‌నగర్‌, సికింద్రాబాద్‌, పంజాగుట్ట, అమీర్‌పేట, కూకట్‌పల్లి, దిల్‌సుఖ్‌నగర్‌, కొండాపూర్‌, మణికొండ, ఎల్బీనగర్‌ వంటి ప్రఽధాన ప్రాంతాల్లో ఆ పైనే విక్రయించారు. ఫిబ్రవరిలో కిలో మటన్‌ రూ.580 మాత్రమే కావడం గమనార్హం.


జిల్లాల్లోనూ ఇదే తీరు..

సంగారెడ్డి, సూర్యాపేట జిల్లా కోదాడలో కిలో మటన్‌ ధరను ఏకంగా రూ.200 పెంచేసి.. రూ.800కి విక్రయించారు. మహబూబ్‌నగర్‌లో రూ.700 చొప్పున అమ్మారు. నిజామాబాద్‌లో రూ.600 కిలో చొప్పున విక్రయించారు. సాధారణంగా ఆడ గొర్రెలు, మేకల ధర.. పొట్టేలు ధర కంటే తక్కువ. కానీ, ఆ మాంసాన్ని కూడా పొట్టేలు ధరతో సమానంగా అమ్ముతున్నారు. పశు వెద్యాధికారులు పరీక్షలు చేయని, కనీసం స్టాంపులు కూడా వేయని మేకలు, గొర్రెలను కోసి అమ్మేస్తున్నారు. వీటిలో రోగాల బారిన పడినవీ ఉంటున్నాయి.


ఒకవైపు ప్రభుత్వం మాంసం వినియోగాన్ని ప్రోత్సహిస్తోంది. అదే క్రమంలో ధరలను నియంత్రించే ప్రయత్నం మాత్రం చేయడం లేదు. దీంతో ఒక్క రోజుకు అంత ఖర్చు అవసరమా? అని సాధారణ, మధ్య తరగతి వినియోగదారులు ఆలోచిస్తున్నారు. ప్రభుత్వం కూరగాయల ధరలను నియంత్రించేందుకు హైదరాబాద్‌లో సంచార రైతు బజార్లు  ఏర్పాటుచేసింది. ఇప్పటికే ఉన్నవాటిని కూడా నడిపిస్తోంది. అదే క్రమంలో మాంసం ధరలను కట్టడి చేయాలని కోరుతున్నారు.


ఎగబాకుతున్న చికెన్‌ ధర

ఈ నెల ప్రారంభం వరకు రూ.180 ఆపైన ఉన్న కిలో చికెన్‌ ధర.. కరోనా వ్యాప్తి వదంతులతో భారీగా పడిపోయింది. కొన్ని ప్రాంతాల్లో రూ.30 నుంచి రూ.40 లెక్కన అమ్మేశారు. కానీ, మళ్లీ నాలుగు రోజులుగా ధర పెరగడం మొదలైంది. ఆదివారం హైదరాబాద్‌లో కిలో రూ.200 నుంచి రూ.220 మధ్య, సంగారెడ్డిలో ఏకంగా రూ.240కి అమ్మారు. మొన్నటిదాక ఉచితంగా ఇచ్చిన కోదాడలో రూ.180కి విక్రయించారు. చేపల ధర కూడా భారీగా పెరిగింది. కిలో రూ.110-రూ.120 మధ్య ఉన్న రగులు, బొచ్చెల ధర రూ.180- రూ.200 చేశారు. చికెన్‌, మటన్‌పై తరహాలో చేపలపై వదంతులు లేకపోవడంతో నెల రోజుల నుంచి అదే పనిగా రేట్లు పెంచుతూ పోతున్నారు.

Updated Date - 2020-03-30T10:02:01+05:30 IST