అభివృద్ధి పేరిట రూ.25 లక్షల ఖర్చు

ABN , First Publish Date - 2021-04-20T05:38:48+05:30 IST

పనులు చేయకుండానే బిల్లులను సృష్టించి, నిధుల దుర్వినియోగానికి పాల్పడిన చౌటపల్లి సర్పంచ్‌పై చర్యలు తీసుకోవాలని వార్డు సభ్యులు సోమవారం కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు.

అభివృద్ధి పేరిట రూ.25 లక్షల ఖర్చు

 పనులు చేయకుండానే బిల్లులు

 చౌటపల్లి సర్పంచ్‌పై చర్యలు తీసుకోవాలని కలెక్టర్‌కు వార్డు సభ్యుల ఫిర్యాదు


అక్కన్నపేట, ఏప్రిల్‌ 19: పనులు చేయకుండానే బిల్లులను సృష్టించి, నిధుల దుర్వినియోగానికి పాల్పడిన చౌటపల్లి సర్పంచ్‌పై చర్యలు తీసుకోవాలని వార్డు సభ్యులు సోమవారం కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు. ఇప్పటి వరకు వివిధ అభివృద్ధి పనుల పేరుతో రూ.25 లక్షలు డ్రా చేశారని వార్డు సభ్యులు ఆరోపించారు. గ్రామంలో పల్లె ప్రకృతి వనం నిర్మాణం ఇంకా ప్రారంభం కాలేదని, డంపింగ్‌ యార్డ్‌ నిర్మాణం పూర్తికాలేదన్నారు. గ్రామంలో పారిశుధ్య వ్యవస్థ అస్తవ్యస్థంగా ఉండడంతో గ్రామస్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని వాపోయారు. నామమాత్రంగానే గ్రామ ప్రణాళిక, పల్లె ప్రగతి పనులు చేపట్టారని, ఎక్కడి సమస్యలు అక్కడే ఉన్నా సర్పంచ్‌, పంచాయతీ కార్యదర్శి మాత్రం పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. అంతేకాకుండా గ్రామసభలు తూతూమంత్రంగా నిర్వహిస్తూ, ఏకపక్ష తీర్మానాలు చేస్తున్నాడని, అభివృద్ధి పనులపై అడిగితే తమను సర్పంచ్‌ అవమానపరుస్తున్నాడని చెప్పారు. గ్రామాన్ని అభివృద్ధి చేసినట్లు రూ.25లక్షల నకిలీ బిల్లులు సృష్టించారని వార్డు సభ్యులు ఆరోపించారు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి నకిలీ బిల్లులపై విచారణ చేపట్టాలని కోరారు. కలెక్టర్‌కు ఫిర్యాదు చేసిన వారిలో వార్డు సభ్యులు వేముగంటి వెంకట్రావు, గంగాధరి శ్రీనివాస్‌ తదితరులు ఉన్నారు.


 

Updated Date - 2021-04-20T05:38:48+05:30 IST