‘దసపల్లా’ డీల్‌లో పెద్దలకు పావలా వాటా?

ABN , First Publish Date - 2021-06-22T05:27:19+05:30 IST

విశాఖపట్నం దసపల్లా భూముల్లో..

‘దసపల్లా’ డీల్‌లో పెద్దలకు పావలా వాటా?
ప్రభుత్వ భూమి అని దశాబ్దాల క్రితం కట్టిన వాటర్‌ ట్యాంక్‌

విలువ రూ.వందల కోట్లలోనే..

ఆ భూములను 22-ఏ జాబితా నుంచి తప్పించి, నిర్మాణాలకు అనుమతులు ఇప్పించేలా ఒప్పందం

భూములు ఇచ్చే వారికి దక్కేది 30 శాతమే

ఎక్కడైనా 60:40.. ఇక్కడ మాత్రం 30:70


(విశాఖపట్నం-ఆంధ్రజ్యోతి): విశాఖపట్నం దసపల్లా భూముల్లో వైసీసీ పెద్దలు పైసా పెట్టుబడి పెట్టకుండా పావలా వాటా దక్కించుకున్నారు. రికార్డుల్లో ప్రభుత్వ భూములుగా వున్న వీటిని ‘22-ఏ’ జాబితా నుంచి తప్పించి, భారీ అపార్టుమెంట్ల నిర్మాణానికి అవసరమైన అనుమతులు ఇప్పించడం, ప్రభుత్వపరంగా ఇతర అడ్డంకులు లేకుండా చూడడానికి 25 శాతం వాటా తీసుకున్నట్టు చెబుతున్నారు. కేవలం అధికారాన్ని ఉపయోగించుకొని దక్కించుకున్న ఈ వాటా విలువ రూ.వందల కోట్లు వుంటుందని అంచనా. 


దసపల్లా భూములపై చెముడు జమీందారిణి రాణీ కమలాదేవి తరపున కొందరు న్యాయస్థానంలో  కేసులు వేశారు. జిల్లాలో పలువురు రెవెన్యూ అధికారులను లోబరుచుకొని, ప్రభుత్వం తరపున సరైన సమయంలో కౌంటర్‌ అఫిడవిట్లు దాఖలు కాకుండా మేనేజ్‌ చేశారు. ఒక కేసులో రెండు వారాల్లో వేయాల్సిన కౌంటర్‌ను ఏడాదికి పైగా జాప్యం జరిగేలా చేసి, వారికి అనుకూలంగా తీర్పు వచ్చేలా చూసుకున్నారు. ఇలా ప్రభుత్వ అతిథి గృహం పరిసరాల్లో 20 ఎకరాలు చేజారిపోయింది. అందులో అనేక మంది 300 నుంచి వేయి గజాల చొప్పున కొనుక్కున్నారు. అయితే ఇంకా వివిదాలు కొనసాగుతున్నందున వ్యక్తిగతంగా ఎవరికి వారు అక్కడ నిర్మాణాలు చేపట్టడం దాదాపుగా ఇప్పట్లో సాధ్యం కాని పని. ఈ కేసుల్లో ఆరితేరి, అనేక మందికి భూములు విక్రయించిన వ్యక్తి టౌన్‌ప్లానింగ్‌ అధికారులను బెదిరించి అక్కడ బంగ్లా నిర్మాణం చేపట్టారు. ఒక వైపున రోడ్డు మీదికి ఆ నిర్మాణం వచ్చేసినా జీవీఎంసీ అధికారులు కిక్కురుమనడం లేదు. తానుకోర్టులో కేసు గెలుచుకున్నానని, ఎక్కువ మాట్లాడితే, ప్రభుత్వ అతిథిగృహం పక్కనే వున్న ప్రజా మంచినీటి పథకం ‘వాటర్‌ ట్యాంకు’ స్థలం కూడా తమదేనని, యాగీ చేస్తే దానిని తొలగించాల్సి వస్తుందని హెచ్చరించినట్టు ప్రచారం జరుగుతోంది.  


వైసీపీ పెద్దతో డీల్‌

ఏ పార్టీ అధికారంలో వుంటే ఆ పార్టీ నాయకులతో కలిసిపోయి ఆర్థిక వ్యవహారాలు నడిపే ఈ వ్యక్తి ఇక్కడి వైసీపీ పెద్దను కలిసి దసపల్లా భూముల్లో నిర్మాణాలకు అనుమతులు ఇస్తే భారీగా లబ్ధి చేకూరుతుందని ప్రణాళిక వివరించారు. వందల గజాలు చొప్పున కొన్న వారందరినీ తాను ఒప్పిస్తానని, డెవలపర్‌ను చూస్తే సరిపోతుందని సూచించారు. అటు స్థలాలు కొన్నవారి దగ్గరకు వెళ్లి... 22-ఏలో భూములు వున్నందున అంత వేగంగా నిర్మాణానికి అనుమతులు రావని, డెవలప్‌మెంట్‌కు ఇస్తే...వారే అన్నీ చూసుకుంటారని ఒప్పించారు. 


ఎక్కడైనా 60:40.. ఇక్కడ మాత్రం 30:70

విశాఖపట్నంలో భూములను తీసుకొని అభివృద్ధి చేసి అపార్ట్‌మెంట్లు కట్టేవారు స్థలం ఇచ్చిన వారికి 60 శాతం వాటా ఇచ్చి, డెవలపర్‌ వాటాగా 40శాతం తీసుకుంటున్నారు. ఇంకా నాన్‌ రిఫండబుల్‌ అమౌంట్‌గా భూమి విస్తీర్ణం బట్టి రూ.50 లక్షల నుంచి రూ.2 కోట్ల వరకు ఇస్తున్నారు. కానీ ఇక్కడ అలా జరగలేదు. ముందుగా మంచి వాటానే వస్తుందని చెప్పి, ఆ తరువాత ప్రభుత్వంలో చేయాల్సిన తతంగం ఎక్కువ ఉన్నందున...పార్టీ పెద్దలకు 25 శాతం వాటా ఇవ్వాల్సి ఉంటుందని, ప్రభుత్వానికి ఫీజుల రూపంలో మరో 5 శాతం వాటా కట్టాల్సి ఉంటుందని వివరించి, వారి వాటా 30 శాతానికి పరిమితం చేశారు. అక్కడి స్థలంలో హై రైజ్డ్‌ భవనాలు వస్తాయి కాబట్టి, వాటి విలువ పెరుగుతుందని, సముద్రం కనిపించేలా ఎలివేటెడ్‌ ఫ్లాట్లు ఇస్తామని వారికి హామీ ఇచ్చారు. బయటకు మాత్రం 60:40గానే ప్రచారం చేశారు. ఈ వ్యవహారంపై ‘దసపల్లా’పై సొంత లా’ శీర్షికతో సోమవారం ‘ఆంధ్రజ్యోతి’ దినపత్రికలో కథనం రావడంతో...అక్కడ భూములున్న కొందరు ఫోన్లు చేసి, తమకు 60 శాతం వాటా ఇవ్వడం లేదని, కేవలం 30 శాతం ఇస్తున్నారని ఆవేదన వ్యక్తంచేశారు. 


కాంగ్రెస్‌ హయాంలో ఎమ్మెల్యేల స్థలాలకు ప్రతిపాదన

దససల్లా భూములు పక్కాగా ప్రభుత్వానికి చెందినవి. న్యాయస్థానాల్లో ప్రభుత్వం తరపున సరిగ్గా వ్యవహరించక చాలావరకు చేజారిపోయింది. వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి ముఖ్యమంత్రిగా వున్న సమయంలో జిల్లాలోని కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలకు అక్కడ ఇళ్ల స్థలాలు ఇవ్వాలని ప్రతిపాదించారు. అత్యంత ఖరీదైన భూములు తీసుకున్నారనే అపవాదు వస్తుందని ఆ ప్రతిపాదన వెనక్కి తీసుకున్నారు. ఈ రికార్డులన్నీ పరిశీలించిన కలెక్టర్‌ యువరాజ్‌ 2014లో వాటిని 22-ఏ జాబితాలో పెట్టి రిజిస్ట్రేషన్లకు అడ్డుకట్ట వేశారు. ఇప్పుడు వాటిని ఆ జాబితా నుంచి తప్పించడానికి పెద్దలు ప్రయత్నిస్తున్నారు. రిజిస్ట్రేషన్లకు ఆటంకం లేకుండా పావులు కదుపుతున్నారు.

Updated Date - 2021-06-22T05:27:19+05:30 IST