ముంబైలో వర్ష బీభత్సం..32 మంది దుర్మరణం

ABN , First Publish Date - 2021-07-19T07:47:54+05:30 IST

దేశ ఆర్థిక రాజధాని ముంబైని ముంచెత్తిన భారీ వర్షం 32 మంది ప్రాణాలను బలిగొంది.

ముంబైలో వర్ష బీభత్సం..32 మంది దుర్మరణం

  • మూడు గంటల్లో 250 మిల్లీమీటర్ల వర్షం
  • చెంబూర్‌లో గోడ కూలి 21 మంది మృతి
  • విరిగిపడ్డ కొండచరియ.. నలిగిన గుడిసెలు
  • విఖ్రోలీలో ప్రాణాలు కోల్పోయిన పది మంది
  • ప్రధాని జాతీయ సహాయ నిధి నుంచి 2 లక్షలు
  • రాష్ట్ర ప్రభుత్వ సాయం 5 లక్షలు: సీఎం ఉద్ధవ్‌


ముంబై, జూలై 18: దేశ ఆర్థిక రాజధాని ముంబైని ముంచెత్తిన భారీ వర్షం 32 మంది ప్రాణాలను బలిగొంది. శనివారం అర్ధరాత్రి 12 గంటల నుంచి ఆదివారం తెల్లవారుజామున 3 గంటల దాకా ఎడతెగకుండా కురిసిన వర్షం ఎన్నో కుటుంబాలకు దుఃఖం మిగిల్చింది. ముంబైలోని చెంబూర్‌ ప్రాంతంలో పూర్తిగా నానిన రిటైనింగ్‌వాల్‌.. ఆ పక్కనే ఉన్న ఇళ్లపై కూలిపోవడంతో 21 మంది ప్రాణాలు కోల్పోయారు. తీవ్రగాయాలపాలైన మరో ఏడుగురిని ఆస్పత్రికి తరలించారు. అలాగే, తెల్లవారుజామున 2.30 గంటల సమయంలో విఖ్రోలీ ప్రాంతంలో కొండచరియలు విరిగిపడడంతో 6 గుడిసెలు కూలి 10 మంది మరణించారు. గాయపడిన ఇద్దరికి ఆస్పత్రిలో చికిత్స చేయిస్తున్నారు. మరోవైపు భాండుప్‌ ఏరియాలో అటవీ విభాగానికి చెందిన కార్యాలయం ప్రాంగణం గోడ కూలి పదహారేళ్ల బాలుడు చనిపోయాడు. వారి మృతికి రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌, ప్రధాని మోదీ సంతాపం తెలిపారు. మృతుల కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపిన మోదీ ప్రధానమంత్రి జాతీయ సహాయ నిధి నుంచి రూ.2 లక్షల పరిహారం ప్రకటించారు. మహాసీఎం ఉద్ధవ్‌ ఠాక్రే కూడా మృతుల కుటుంబాలకు రూ.5 లక్షల పరిహారం ప్రకటించారు.


ముప్పు తొలగిపోలేదు..

ముంబైలో శనివారం అర్ధరాత్రి నుంచి 3 గంటల వరకు 250 మిల్లీమీటర్ల వాన కురిసింది. ఆదివారం ఉదయం 7 గంటల సమయానికి మొత్తం 305 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. దీంతో రోడ్లపై పెద్ద ఎత్తున వాన నీరు నిలిచిపోయి జనజీవనం స్తంభించిపోయింది. ట్రాఫిక్‌ జామ్‌లతో సగటు ముంబైవాసి కుదేలయ్యాడు. రైల్వే ట్రాకులపై నడుం లోతున నీళ్లు నిలిచిపోవడంతో పశ్చిమ రైల్వే, మధ్య రైల్వే ముంబైలో పలు సబర్బన్‌ రైళ్లను రద్దు చేశాయి. ఆదివారం సాయంత్రానికి కూడా ముంబైకి ముసురు ముప్పు తొలగిపోలేదు. దీంతో భారత వాతావరణ విభాగం ముంబైలో ఆరెంజ్‌ అలర్ట్‌ ప్రకటించింది. ‘‘భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయ’’ని హెచ్చరికలు జారీ చేసింది.  ఈ ముప్పును ఎదుర్కోవడానికి అధికారులంతా సిద్ధంగా ఉండాలని మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్‌ ఠాక్రే సూచించారు. శనివారం అర్ధరాత్రి దాటాక ముంబైపై విరుచుకుపడ్డ వర్షం సాధారణమైంది కాదని.. 2005 జూలై 26న విలయం సృష్టించిన అతి భారీ వర్షంతో దీన్ని పోల్చవచ్చని యూనివర్సిటీ ఆఫ్‌ రీడింగ్‌ (యూకే)లోని వాతావరణ విభాగం పీహెచ్‌డీ విద్యార్థి అక్షయ్‌ దేవ్‌రాస్‌ ఆందోళన వ్యక్తం చేశారు.(ముంబైవాసులు ఎప్పటికీ మరచిపోని పీడకల అది. 


దాదాపు 24 గంటల్లో ముంబైని 944 మిల్లీమీటర్ల వాన ముంచెత్తింది). ‘‘ఈ భారీ వర్షం 18 కిలోమీటర్ల ఎత్తులో ఉన్న మేఘం నుంచి కురిసింది. అంటే భూమి నుంచి దాదాపుగా 60 వేల అడుగుల ఎత్తు. వాణిజ్య విమానాలు ప్రయాణించే ఎత్తు కన్నా 25 వేల అడుగులు ఎక్కువ ఎత్తు. ఇంకా అర్థమయ్యేలా చెప్పాలంటే.. ఈ రాక్షస వర్షం దాదాపుగా ఎవరెస్టు పర్వతం ఎత్తు కన్నా రెట్టింపు ఎత్తు నుంచి పడింది.’’ అని ఆయన పేర్కొన్నారు. దీనికి సంబంధించి భారత వాతావరణ విభాగం విడుదల చేసిన డాప్లర్‌ రాడార్‌ చిత్రాలను ఆయన ట్విటర్‌లో పోస్ట్‌ చేశారు. ఈ స్థాయి భారీ వర్షాలు.. అదీ జూలై నెలలో.. కచ్చితంగా ముంబైకి అసాధారణమైనవేనని అని ఆయన పేర్కొన్నారు. ఈ నెలలో ముంబైని భారీ, అతి భారీ వర్షాలు ముంచెత్తడం ఇది ఐదోసారి అని.. జూలై 9, 11, 12, 16, 17 తేదీల్లో ఇలాగే కురిశాయని ఆయన గుర్తుచేశారు.

Updated Date - 2021-07-19T07:47:54+05:30 IST