26 మద్యం దుకాణాలు మూత?

ABN , First Publish Date - 2020-06-01T10:49:20+05:30 IST

జిల్లాలో మరో 26 మద్యం దుకాణాలు మూతపడనున్నాయి.

26 మద్యం దుకాణాలు మూత?

రెండో విడత కుదింపునకు రంగం సిద్ధం

సిబ్బంది భవితవ్యంపై తేల్చని వైనం


నెల్లిమర్ల, మే 31: జిల్లాలో మరో 26 మద్యం దుకాణాలు మూతపడనున్నాయి. దశల వారీ మద్య నిషేధం అమలులో భాగంగా మరోసారి ప్రభుత్వం మద్యం దుకాణాల కుదింపునకు రంగం సిద్ధం చేసింది. గతంలో 20 శాతం దుకాణాలను ఎత్తివేసిన సంగతి తెలిసిందే. రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వం ఏర్పాటయ్యేసరికి జిల్లాలో 204 మద్యం దుకాణాలు ఉండగా తొలిసారిగా 20 శాతం దుకాణాల కుదింపును అమలు చేశారు. దీంతో 36 మద్యం దుకాణాలు మూతపడ్డాయి. 168 దుకాణాలు మిగిలాయి. ఇప్పుడు మరోసారి షాపుల కుదింపునకు రంగం సిద్ధం అయింది. ఈసారి మరో 13 శాతం దుకాణాలను మూసివేయాలని ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసినట్లు సమాచారం. ఆ ప్రకారం జిల్లాలో ఉన్న 168 దుకాణాల్లో 26 షాపులను మూసివేయనున్నారు. ఇది ఎప్పటి నుంచి అమలు అనేదానిపై ఇంకా స్పష్టమైన ఉత్తర్వులు జారీ కాలేదు. ఏ ఏ దుకాణాలను మూసివేయాలన్న దానిపై అధికారులు ఒక నిర్ణయానికి వచ్చారు. ఆ వివరాలను రాష్ట్ర స్థాయి అధికారులకు పంపగా వాటిని ప్రభుత్వం ఆమోదించినట్లు తెలుస్తోంది. ఈ తంతు పూర్తయితే మొత్తం దుకాణాల్లో 33 శాతం కేవలం తొలి ఏడాదిలోనే కుదించినట్లు అవుతుంది.


మూత పడనున్న దుకాణాలు ఇవే..

ఈసారి అమలు చేస్తున్న 13 శాతం దుకాణాల వివరాలు ఇలా ఉన్నాయి. విజయనగరం పట్టణ పరిధిలో నాలుగు దుకాణాలు, భోగాపురంలో ఒకటి, చీపురుపల్లిలో 3, నెల్లిమర్లలో ఒకటి, గజపతినగరంలో రెండు, శృంగవరపుకోటలో 4, కొత్తవలసలో 2, బొబ్బిలి పట్టణంలో ఒకటి, గ్రామీణ ప్రాంతంలో 2, సాలూరు పట్టణంలో 3, గ్రామీణ ప్రాంతంలో ఒకటి, పార్వతీపురం పట్టణంలో 1, గ్రామీణ ప్రాంతంలో ఒకటి మూత పడనున్నట్లు విశ్వసనీయ సమాచారం. 


డోలాయమానంలో సిబ్బంది పరిస్థితి ? 

మద్యం దుకాణాల్లో సూపర్‌వైజర్‌లు, సేల్‌వర్కర్‌లుగా అవుట్‌ సోర్సింగ్‌ విధానంలో విధులు నిర్వర్తిస్తున్న ఉద్యోగుల భవితవ్యం ప్రస్తుతం ప్రశ్నార్థకమైంది. ప్రైవేటు షాపుల విధానం నుంచి ప్రభుత్వ మద్యం దుకాణాల విధానం అమలు నుంచే ప్రతి దుకాణానికీ ఒక సూపర్‌వైజర్‌ను, మరో ముగ్గురు సేల్స్‌ వర్కర్లను ప్రభుత్వం నియమించింది. వీరికి ఏడాది పాటు విధుల్లో ఉండేలా అవుట్‌ సోర్సింగ్‌ విధానంలో పనిచేసేందుకు ఉత్తర్వులు జారీ చేసింది. అయితే ప్రభుత్వం ఇప్పుడు అర్ధాంతరంగా దుకాణాల మూసివేత నిర్ణయం తీసుకోవడంపై సిబ్బంది బిక్కు బిక్కుమంటున్నారు. వారి గుండెల్లో రైళ్లు పరుగెడుతున్నాయి. దుకాణాల మూతపై ఇంత వరకు తేదీని ప్రకటించకపోయినా ఆయా దుకాణాల్లో ఉన్న మద్యం నిల్వలు అమ్మకం జరిగేంత వరకు వీరిని విధుల్లో ఉంచి ఇంటికి పంపించేస్తారా? లేదంటే మిగిలిన దుకాణాల్లో సర్దుబాటు చేస్తారా అనే విషయంపై ప్రభుత్వం నుంచి స్పష్టమైన ఉత్తర్వులు జారీ కాలేదు. 

Updated Date - 2020-06-01T10:49:20+05:30 IST