26న లేదా 27న సీఎం సభ

ABN , First Publish Date - 2021-01-21T06:15:33+05:30 IST

నాగార్జునసాగర్‌ ఉప ఎన్నిక నేపథ్యంలో భారీ బహిరంగ సభ నిర్వహించాలని అధికార టీఆర్‌ఎస్‌ నిర్ణయించింది.

26న లేదా 27న సీఎం సభ
ఏర్పాట్లను పరిశీలిస్తున్న భగత్‌, విజయేందర్‌రెడ్డి

14వ మైలు సమీపంలో వేదిక

నల్లగొండ, జనవరి 20(ఆంధ్రజ్యోతి ప్రతినిధి):  నాగార్జునసాగర్‌ ఉప ఎన్నిక నేపథ్యంలో భారీ బహిరంగ సభ నిర్వహించాలని అధికార టీఆర్‌ఎస్‌ నిర్ణయించింది. సాగర్‌ నియోజకవర్గ కేంద్రమైన హాలియాలో ఈనెల 23న లేదా 25న సభ నిర్వహించాలని ముందుగా అనుకున్నారు. కానీ నాలుగు నియోజకవర్గాల నుంచి భారీగా జనసమీకరణ ఉన్నందున కొంత సమయంకావాలని జిల్లా నేతలు అధిష్ఠానాన్ని కోరగా ఈనెల 26న లేదా 27న నిర్వహించాలని ఓ నిర్ణయానికి వచ్చినట్లు తెలిసింది. లక్షన్నర మందిని సమీకరించనున్న నేపథ్యంలో భారీగా సభాస్థలి కావాల్సి ఉంది. గతంలో దేవరకొండ రోడ్డు వైపు నిర్వహించిన ప్రాంతాల్లో ప్రస్తుతం పూర్తిగా ఇళ్ల నిర్మాణం పూర్తయింది. హాలియా మునిసిపాలిటీకి ఇటు మిర్యాలగూడ, అటు దేవరకొండ రోడ్డులో భారీగా స్థలం అందుబాటులో లేకపోవడంతో 14వ మైలు సాగర్‌ కెనాల్‌కు సమీపంలో నల్లగొండ రోడ్డుకు నిర్వహించాలని ఓ నిర్ణయానికి వచ్చినట్లు సమాచారం. సభకు నాగార్జున సాగర్‌, మిర్యాలగూడ, హుజూర్‌నగర్‌, కోదాడ నియోజకవర్గాల నుంచి జనసమీకరణ చేయనున్నారు. 2003లో కోదాడ నుంచి హాలియా వరకు కేసీఆర్‌ పాదయాత్ర చేశారు. ఉమ్మడి పాలనలో నాడు చూసిన సాగు కష్టాలను స్వయం పాలనలో ఎలా దూరం చేసుకున్నాం, స్వరాష్ట్రంలో ఆ ఫలాలు ఎలా ఉన్నాయో తెలిపేందుకే కృతజ్ఞతగా ఈ సభ ప్రధాన ఉద్దేశంగా ఉండబోతోందని ఆపార్టీ నేతలు పేర్కొంటున్నారు.


సీఎం సభాస్థలి పరిశీలన

హాలియా మునిసిపాలిటీ పరిధిలోని 14వ మైలు పరిసర ప్రాంతంలో ఏర్పాటు చేయనున్న సీఎం కేసీఆర్‌ సభాస్థలిని టీఆర్‌ఎస్‌ నేతలు నోముల భగత్‌, యడవెల్లి విజయేందర్‌రెడ్డి బుధవారం పరిశీలించారు. సభకు వచ్చే ప్రజలకు ఎంత మేరకు స్థలం కావాల్సి ఉంటుందో చర్చించారు. వారివెంట జడ్పీ వైస్‌ చైర్మన్‌ ఇరిగి పెద్దులు, కూరాకుల వెంకటేశ్వర్లు, వెంపటి శంకరయ్య, సుధాకర్‌, వెంకటయ్య, శ్రీనివాస్‌, ప్రసాద్‌నాయక్‌, రాంబాబు ముత్యాలు, అన్వర్‌, రామలింగయ్య, నాయకులు, కార్యకర్తలు ఉన్నారు. 

Updated Date - 2021-01-21T06:15:33+05:30 IST