వైద్య విద్యలో రిజర్వేషన్లపై కేంద్రం సంచలన నిర్ణయం

ABN , First Publish Date - 2021-07-29T21:54:23+05:30 IST

అండర్‌గ్రాడ్యుయేట్, పోస్ట్ గ్రాడ్యుయేట్ వైద్య విద్యకు రిజర్వేషన్లపై

వైద్య విద్యలో రిజర్వేషన్లపై కేంద్రం సంచలన నిర్ణయం

న్యూఢిల్లీ : అండర్‌గ్రాడ్యుయేట్, పోస్ట్ గ్రాడ్యుయేట్ వైద్య విద్యకు రిజర్వేషన్లపై కేంద్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. ఎంబీబీఎస్, ఎండీ, ఎంఎస్, డిప్లొమా, బీడీఎస్, ఎండీఎస్ కోర్సుల్లో ప్రవేశాలకు 2021-22 విద్యా సంవత్సరం నుంచి ఓబీసీలకు 27 శాతం, ఆర్థికంగా బలహీన వర్గాలకు చెందినవారికి 10 శాతం రిజర్వేషన్ కల్పించింది. ఈ నిర్ణయంతో దాదాపు 5,550 మంది విద్యార్థులు లబ్ధి పొందుతారు. దీనికి సంబంధించి ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ జూలై 26న ఓ సమావేశాన్ని నిర్వహించారు, చాలా కాలం నుంచి పెండింగ్‌లో ఉన్న ఈ సమస్యకు సమగ్ర పరిష్కారాన్ని కనుగొనాలని సంబందిత మంత్రిత్వ శాఖలను ఆదేశించారు.  మోదీ గురువారం ఇచ్చిన ఓ ట్వీట్‌లో ఈ వివరాలను తెలిపారు. 


కేంద్ర ప్రభుత్వ నిర్ణయంతో ప్రతి సంవత్సరం ఎంబీబీఎస్‌లో 1,500 మంది ఓబీసీలు, సుమారు 550 మంది ఈడబ్ల్యూఎస్ విద్యార్థులు లబ్ధి పొందుతారు. పోస్ట్ గ్రాడ్యుయేషన్‌లో దాదాపు 2,500 మంది ఓబీసీలు, 1,000 మంది ఈడబ్ల్యూఎస్ విద్యార్థులు లబ్ధి పొందుతారు. 


మోదీ ఇచ్చిన ట్వీట్‌లో, ‘‘ప్రస్తుత విద్యా సంవత్సరం నుంచి అండర్ గ్రాడ్యుయేట్, పోస్ట్ గ్రాడ్యుయేట్ మెడికల్/డెంటల్ కోర్సుల కోసం ఆలిండియా కోటాలో ఓబీసీలకు 27 శాతం రిజర్వేషన్, ఆర్థికపరంగా బలహీనంగా ఉన్న వర్గాలకు 10 శాతం రిజర్వేషన్ కల్పించేందుకు మా ప్రభుత్వం మైలు రాయి వంటి నిర్ణయం తీసుకుంది’’ అని తెలిపారు. 


వైద్య విద్యలో ఆలిండియా కోటా

సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ఆలిండియా కోటా స్కీమ్‌ను 1986లో ప్రవేశపెట్టారు. స్వస్థలంతో సంబంధం లేకుండా యోగ్యత ఆధారంగా విద్యార్థులు తమ రాష్ట్రంలో కాకుండా వేరొక రాష్ట్రంలో ఉన్న మంచి వైద్య కళాశాలలో చదవాలనుకుంటే, అటువంటివారికి అవకాశం కల్పించడమే ఈ కోటా లక్ష్యం. ప్రభుత్వ వైద్య కళాశాలల్లోని మొత్తం అందుబాటులో ఉండే అండర్ గ్రాడ్యుయేట్ సీట్లలో 15 శాతం, మొత్తం అందుబాటులో ఉండే పీజీ సీట్లలో 50 శాతం ఆలిండియా కోటాలో ఉంటాయి. 2007 వరకు ఈ ఆలిండియా కోటా స్కీమ్‌లో రిజర్వేషన్లు ఉండేవి కాదు. 2007లో సుప్రీంకోర్టు ఎస్సీలకు 15 శాతం, ఎస్టీలకు 7.5 శాతం రిజర్వేషన్లు కల్పించింది. 


Updated Date - 2021-07-29T21:54:23+05:30 IST