కర్ణాటకలో కరోనా కల్లోలం.. ఒక్క బెంగళూరులోనే ఇవాళ ఇన్ని కరోనా మరణాలా..!

ABN , First Publish Date - 2020-07-14T02:54:50+05:30 IST

దేశంలో కరోనా రూటు మార్చింది. ఇప్పటిదాకా ఉత్తరాదిని కుదిపేసిన కరోనా..

కర్ణాటకలో కరోనా కల్లోలం.. ఒక్క బెంగళూరులోనే ఇవాళ ఇన్ని కరోనా మరణాలా..!

బెంగళూరు: దేశంలో కరోనా రూటు మార్చింది. ఇప్పటిదాకా ఉత్తరాదిని కుదిపేసిన కరోనా ఇప్పుడు దక్షిణాదిపై పంజా విసిరింది. ఇప్పటివరకూ దేశవ్యాప్తంగా అత్యధికంగా కరోనా కేసులు నమోదవుతున్న రాష్ట్రాలుగా మహారాష్ట్ర, ఢిల్లీ, తమిళనాడు, గుజరాత్ రాష్ట్రాలు ఉండగా ఇప్పుడు కర్ణాటక కూడా ఆ బాటలో పయనిస్తోంది. కర్ణాటకలో రోజురోజుకూ పెరుగుతున్న కరోనా కేసుల సంఖ్య ఆందోళన కలిగిస్తోంది. కర్ణాటకలో సోమవారం కొత్తగా 2,738 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. వీటిలో బెంగళూరు అర్బన్‌లోనే 1315 కేసులు నమోదు కావడంతో నగర ప్రజలు బెంబేలెత్తిపోతున్నారు. కర్ణాటకలో మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 41,581కి చేరింది. ఇందులో యాక్టివ్ కేసుల సంఖ్య 24,572.


కరోనా మరణాల సంఖ్య రోజురోజుకూ పెరుగుతుండటం కూడా కర్ణాటకను కలవరపాటుకు గురిచేస్తోంది. సోమవారం ఒక్కరోజే కర్ణాటకలో 73 మంది కరోనాతో మరణించినట్లు రాష్ట్ర ప్రభుత్వం పేర్కొంది. ఈ 73 కరోనా మరణాల్లో 47 మరణాలు బెంగళూరు నగరంలోనే నమోదు కావడం గమనార్హం. ఐటీ నగరిగా వెలుగొందిన బెంగళూరు నగరం ప్రస్తుతం కరోనా హాట్‌స్పాట్‌గా మారింది. కర్ణాటకలో మొత్తం కరోనా మరణాల సంఖ్య 761కి చేరింది. 


ఇదిలా ఉంటే.. గత మూడు నెలలుగా ఉత్తరాది రాష్ట్రాల్లో విశ్వరూపం చూపిన కరోనా.. ఇప్పుడు దక్షిణాది రాష్ట్రాల్లో విస్తృతంగా వ్యాపిస్తోంది. ఉత్తరాది రాష్ట్రాలతో సమానంగా తమిళనాట తొలి నుంచీ వైరస్‌ తీవ్రత బాగా ఉండి లక్షకు పైగా కేసులు నమోదైన సంగతి తెలిసిందే. ఇప్పుడు కర్ణాటక, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాల్లోనూ రోజూ భారీ సంఖ్యలో కేసులు నమోదవుతున్నాయి. దీంతో.. దేశవ్యాప్తంగా నమోదవుతున్న కేసుల్లో దక్షిణాది రాష్ట్రాల వాటా మూడో వంతు దాటింది.



Updated Date - 2020-07-14T02:54:50+05:30 IST