277 సెల్‌ఫోన్ల స్వాధీనం

ABN , First Publish Date - 2020-12-01T06:46:08+05:30 IST

రూ.40లక్షల విలువైన 277 సెల్‌ఫోన్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

277 సెల్‌ఫోన్ల స్వాధీనం
మీడియాకు వివరాలు తెలియజేస్తున్న సెంథిల్‌కుమార్‌

టెక్నికల్‌ అనాలసిస్‌ బృందానికి ఎస్పీ అభినందన


చిత్తూరు, నవంబరు 30: సెల్‌ఫోన్లు గత ఏడాదిలో ఎక్కువగా చోరీలకు గురయ్యాయి. మరికొందరు బస్సులు, ఇతర ప్రాంతాల్లో పోగొట్టుకున్నారు. వీటిలో రూ.40లక్షల విలువైన 277 సెల్‌ఫోన్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. సోమవారం స్థానిక పోలీసు అతిథి గృహంలో ఎస్పీ సెంథిల్‌కుమార్‌ మీడియాకు వివరాలు తెలిపారు. అధిక సంఖ్యలో సెల్‌ఫోన్ల చోరీలపై ఫిర్యాదులు రావడంతో టెక్నికల్‌ అనాలసిస్‌ బృందాన్ని ఎస్పీ ఏర్పాటు చేశారు. ఇందులో ఇటీవల కొత్తగా పోలీస్‌శాఖలో చేరిన బీటెక్‌, ఎంటెక్‌ చదివిన 20 మందిని నియమించారు. ఈ బృందం ఏర్పాటైన నెల వ్యవధిలోనే 277 ఫోన్లను రికవరీ చేసింది. మన రాష్ట్రం నుంచే కాకుండా.. తమిళనాడు, కర్ణాటక, తెలంగాణ, కేరళ నుంచి కూడా రికవరీ చేశారు. స్వల్ప వ్యవధిలోనే ఇన్ని కేసులను ఛేదించిన టెక్నికల్‌ అనాలసిస్‌ బృందాన్ని, శిక్షణ ఇచ్చిన విభాగాధిపతులు ఇ.దేవరాజులురెడ్డి, కె.బాపూజీ, ఐటీ కోర్‌ కమిటీని ఎస్పీ అభినందించారు. అనంతరం బాధితులకు సెల్‌ఫోన్లను అందజేశారు. సమావేశంలో ఏఎస్పీ డీఎన్‌ మహేష్‌, నగర డీఎస్పీ సుధాకర్‌రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.



Updated Date - 2020-12-01T06:46:08+05:30 IST