24 గంటల్లో 28 టీఎంసీలు

ABN , First Publish Date - 2021-07-27T08:03:17+05:30 IST

శ్రీశైలం డ్యాంలోకి భారీగా వరద చేరుతోంది. ఆదివారం ఉదయం 6 గంటల నుంచి 24 గంటల వ్యవధిలో 28 టీఎంసీల నీరు వచ్చి చేరింది

24 గంటల్లో 28 టీఎంసీలు

శ్రీశైలానికి భారీ వరద..872 అడుగులకు నీటి మట్టం

జూరాలకు 3.50 లక్షల క్యూసెక్కుల వరద

538 అడుగులకు  నాగార్జునసాగర్‌  


నాగార్జునసాగర్‌, జూలై 26(ఆంధ్రజ్యోతి): శ్రీశైలం డ్యాంలోకి భారీగా వరద చేరుతోంది. ఆదివారం ఉదయం 6 గంటల నుంచి 24 గంటల వ్యవధిలో 28 టీఎంసీల నీరు వచ్చి చేరింది. ప్రాజెక్టుకు 3.74 లక్షల క్యూసెక్కుల ప్రవాహం వస్తోంది. వరద ఇలాగే కొనసాగితే మరో మూడు రోజుల్లో డ్యాం గేట్లు ఎత్తివేసే అవకాశం ఉంది. పూర్తిస్థాయి నీటి మట్టం 885 అడుగులు కాగా సోమవారం రాత్రి 872 అడుగులకు చేరింది. ప్రాజెక్టు నిల్వ సామర్థ్యం 215.80 టీఎంసీలకుగాను ప్రస్తుతం 152.8314 టీఎంసీలు ఉంది. కాగా, కర్ణాటకలోని ఆల్మటి జలాశయానికి 3.88 లక్షల క్యూసెక్కుల ఇన్‌ ఫ్లో ఉండగా.. 3 లక్షల క్యూసెక్కులను, నారాయణపూర్‌ రిజర్వాయర్‌కు 2.95 లక్షల వరద వస్తుండగా 2.86 లక్షల క్యూసెక్కులను దిగువకు వదులుతున్నారు. తుంగభద్ర రిజర్వాయర్‌కు కూడా 1.65 లక్షల వరద వస్తుండగా... 1.49 లక్షల క్యూసెక్కులను కిందకు వదిలేస్తున్నారు. దీంతో జూరాల ప్రాజెక్టుకు 3.50 లక్షల క్యూసెక్కుల ఇన్‌ ఫ్లో వస్తోంది. 35 గేట్లను ఎత్తి 3.18 లక్షల క్యూసెక్కులను కిందకు పంపుతున్నారు. ప్రాజెక్టు పూర్తి సామర్థ్యం 318.51 మీటర్లకు ప్రస్తుతం 316.44 మీటర్లలో నీరు నిల్వ ఉంది. 


నాగార్జునసాగర్‌ నీటిమట్టం సోమవారం సాయంత్రం 538.80 అడుగులుగా ఉంది. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 590 అడుగుల (312.04 టీఎంసీలు)కు గాను 538.80 అడుగులు (185.83 టీఎంసీలు)గా ఉంది. 25,427 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో వస్తోంది. ఎస్‌ఎల్‌బీసీ ద్వారా 1000 క్యూసెక్కులను విడుదల చేస్తున్నారు. పులిచింతల ప్రాజెక్టులో విద్యుదుత్పత్తి సోమవారం సైతం కొనసాగింది. జూరాలలో ఉత్పత్తి నిలిపివేశారు. శ్రీశైలం ఎడమ గట్టు విద్యుత్‌ కేంద్రంలో 25,427 కూసెక్కుల నీటిని ఉపయోగిస్తూ ఐదు యూనిట్ల ద్వారా 15.439 మిలియన్‌ యూనిట్ల విద్యుదుత్పత్తి చేశారు. నిజామాబాద్‌ జిల్లాలోని శ్రీరామసాగర్‌ ప్రాజెక్టుకు 16,590 క్యూసెక్కుల వరద వస్తోంది. స్థానికంగా, మహారాష్ట్రలో కూడా వర్షాలు తగ్గడంతో ఇన్‌ఫ్లో కూడా తగ్గింది.

Updated Date - 2021-07-27T08:03:17+05:30 IST