Abn logo
May 11 2021 @ 00:00AM

కోవిడ్‌ నుంచి రక్షణ కవచం 2 డీజీ

కొవిడ్‌ కొందరి జీవితాలను కల్లోలపరుస్తోంది.  ఊపిరితిత్తుల సమస్యలు ఏర్పడటం.. ఆక్సిజన్‌ శాతం తగ్గిపోవటం వంటి అనేక సమస్యలు ఏర్పడుతున్నాయి. వీటికి కచ్చితమైన మందులు లేకపోవటం కూడా ఒక సమస్యగా మారింది. కొవిడ్‌ రోగుల్లో ఆక్సిజన్‌ తగ్గిపోయే సమస్యను తాము రూపొందించిన 2 డియోక్సి డి గ్లూకోజ్‌ మందు పరిష్కరిస్తుందంటున్నారు రక్షణ పరిశోధన అభివృద్ధి సంస్థ (డీఆర్‌డీఓ)కి చెందిన ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ న్యూక్లియర్‌ మెడిసిన్‌ అలైడ్‌ సైన్సెస్‌ (ఇన్‌మాస్‌)కు చెందిన- డాక్టర్‌ సుధీర్‌ చాందన, డాక్టర్‌ అనంత నారాయణ భట్‌లు. ఈ వారం విడుదల కానున్న ఈ మందుకు సంబంధించిన అనేక విశేషాలను వారు ‘నవ్య’కు వివరించారు. 


‘‘గత ఏడాది హఠాత్తుగా కొవిడ్‌ అందరిపైన విరుచుకుపడింది. లక్షణాల ఆధారంగా తప్ప.. కొవిడ్‌ను ఎదుర్కొనే మందులు లేకపోవటం ఒక ప్రధానమైన సమస్యగా మారింది. ఆ సమయంలో గతంలో ఇన్‌మాస్‌కు చెందిన శాస్త్రవేత్తలు అభివృద్ధి చేసిన ‘2 డియోక్సి డి గ్లూకోజ్‌’  అనే మాలిక్యూల్‌ కొవిడ్‌కు కూడా పనిచేస్తుందనే ఆలోచనతో మేము పరిశోధనలు ప్రారంభించాం. వాస్తవానికి ఈ మాలిక్యుల్‌పై 1990లలో పరిశోధనలు ప్రారంభమయ్యాయి. 2001లో పరిశోధనలు పూర్తయ్యాయి. మెదడులో ట్యూమర్‌లు వచ్చిన వారికి రేడియేషన్‌ ఇస్తూ ఉంటారు. దీని వల్ల క్యాన్సర్‌ కణాలతో పాటుగా ఆరోగ్యవంతమైన కణాలు కూడా మరణిస్తాయి. ఈ సమస్య పరిష్కారం కోసం 2డీజీని అభివృద్ధి చేశారు. ఈ మాలిక్యుల్‌ చాలా విజయవంతంగా పనిచేయటం వల్ల 2004లో దీనిని రెడ్డి ల్యాబ్స్‌ వారికి క్లినికల్‌ ట్రైల్స్‌ కోసం అందించటం జరిగింది. క్లినికల్‌ ట్రైల్స్‌ తర్వాత 2014లో దీనికి డ్రగ్‌ కంట్రోలర్‌ ఆఫ్‌ ఇండియా నుంచి అనుమతులు కూడా లభించాయి. అంటే మందు మార్కెట్‌లోకి విడుదల కావటానికి సిద్ధంగా ఉంది. అంతే కాకుండా అన్ని రకాల భద్రతా పరీక్షలు కూడా జరిగాయి. కొవిడ్‌ మన కణాలలోకి సోకినప్పుడు.. ఏర్పడే పరిస్థితులు- క్యాన్సర్‌ ట్యూమర్లను పోలిఉండటాన్ని మేము గమనించాం. అంటే క్యాన్సర్‌ ట్యూమర్లపై పనిచేసే మందు కొవిడ్‌ కణాలపై కూడా పనిచేయవచ్చనే ప్రతిపాదన వచ్చింది. డీఆర్‌డీఓ ఛైర్మన్‌ డాక్టర్‌ సతీష్‌ రెడ్డి ఈ ప్రతిపాదనకు అన్ని రకాలుగా మద్దతు ఇచ్చారు. 


సీసీఎంబీలో..

గత ఏడాది ఏప్రిల్‌ నుంచి సీసీఎంబీ సహకారంతో పరిశోధనలు ప్రారంభించాం. కొవిడ్‌ కణాలలోకి ఈ మందును ప్రవేశపెట్టి ఏ విధంగా పనిచేస్తోందో గమనించాం. అక్కడ మాకు చాలా సంతృప్తికరమైన ఫలితాలు రావటంతో దేశంలోని కొన్ని ఆసుపత్రుల్లో ఫేజ్‌ 2, ఫేజ్‌ 2ఏ.. ఆ తర్వాత ఫేజ్‌ 3 పరిశోధనలను ప్రారంభించాం. ఈ ఏడాది మార్చికి ఆ పరిశోధనలు ముగిసాయి. కొవిడ్‌ కణాలపై ఈ మందు సమర్ధవంతంగా పనిచేస్తోందని తేలింది. అయితే ఏప్రిల్‌ నాటికి కొవిడ్‌ సెకండ్‌ వేవ్‌ ప్రారంభమయింది. క్లినికల్‌ ట్రైల్స్‌లో భాగస్వాములైన ఆసుపత్రులపై తాకిడి చాలా పెరిగిపోయింది. దీని వల్ల మాకు ఫేజ్‌ 3  సమాచారం అందడంలో ఆలస్యమయింది. సమాచారం కోసం ఎదురుచూస్తూ సమయం వృధా చేయకూడదనే ఉద్దేశంతో- డ్రగ్‌ కంట్రోలర్‌ ఆఫ్‌ ఇండియాకు మా వద్ద ఉన్న సమాచారంతో అత్యవసర అనుమతుల కోసం దరఖాస్తు చేశాం. సమాచారాన్నంతా కూలంకషంగా పరిశీలించిన తర్వాత అనుమతులన్నీ లభించాయి. 


ఎలా వాడాలి?

కొవిడ్‌ సోకిన వారిలో కొందరికి ఆక్సిజన్‌ సమస్య ఏర్పడుతోంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యుహెచ్‌ఓ) ప్రొటోకాల్స్‌ ప్రకారం- ఇతర మందులను వాడుతూనే 2డీజీని వాడటం వల్ల  పరిస్థితి మెరుగుపడుతుంది. దీనిని శరీర బరువు ఆధారంగా ఇస్తారు. ప్రతి కేజీ బరువుకు 45 మిల్లీగ్రాముల మందు అవసరమవుతుంది. దీనిని ఉదయం బ్రేక్‌ఫాస్ట్‌ తర్వాత.. రాత్రి భోజనం తర్వాత తీసుకోవాల్సి ఉంటుంది. దీని వల్ల రోగులు చాలా త్వరగా కోలుకోవటమే కాకుండా ఎక్కువ కాలం ఆసుపత్రిలో ఉండే అవసరముండదు. మా పరిశోధనల్లో 2 డీజీ మందును వాడిన 42 శాతం మంది ఎటువంటి ఆక్సిజన్‌ సాయం అవసరం లేకుండానే కోలుకున్నారు. ప్రస్తుతం దీనిని ఒక మాదిరి నుంచి తీవ్రంగా వైరస్‌ సోకిన రోగులకు మాత్రమే ఉపయోగిస్తున్నారు. దీనిని మరింతగా అభివృద్ధి చేసి కొవిడ్‌ను అడ్డుకొనే విధంగా రూపొందించాలని ప్రయత్నాలు మొదలుపెట్టాం. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా కొవిడ్‌ను అడ్డుకొనే మందుకు తీవ్రమైన కొరత ఉంది. ప్రస్తుతం దీనిని రెడ్డిస్‌ ల్యాబ్‌ తయారుచేసి మార్కెటింగ్‌ చేస్తున్నారు. అయితే ఈ మందుకు సంబంధించిన పేటెంట్‌లన్నీ డీఆర్‌డీఓ దగ్గరే ఉన్నాయి.’’
ఎలా పనిచేస్తుంది?

  1. ఈ మాలిక్యుల్‌ వైరస్‌ ఉన్న కణాలలోకి ప్రవేశిస్తుంది. వైరస్‌ అభివృద్ధి చెందకుండా అడ్డుపడుతుంది. వైరస్‌ ఉన్న కణాలను ఎంచుకొని వాటిలోకి ప్రవేశించటం 2డీజీ ప్రత్యేకత. ఇప్పటి దాకా జరిగిన క్లినికల్‌ ట్రైల్స్‌లో ఈ మందును వాడిన 51 శాతం మంది పేషెంట్లకు మూడు రోజుల్లో కొవిడ్‌ నయమయింది. మిగిలిన వారికి 5 నుంచి 7 రోజుల్లో తగ్గింది. 
  2. కొవిడ్‌కు ఇచ్చే మామూలు ట్రీట్‌మెంట్‌తో పాటుగానే దీనిని కూడా వాడాలి. 
  3. శరీర బరువు మేరకు డాక్టర్‌ సూచించిన మోతాదులోనే దీనిని నీళ్లలో కలుపుకొని తాగాలి. 
  4. ఈ ప్యాకెట్లను డాక్టర్‌ రెడ్డీస్‌ సంస్థ ఈ వారం విడుదల చేయనుంది.
అందరికీ అందుబాటులోకి..

‘‘2 డీజీని అందరికి అందుబాటులోకి తీసుకురావటమే మా ఉద్దేశం. దీనిలో భాగంగానే డ్రగ్‌ కంట్రోలర్‌ ఆఫ్‌ ఇండియా నుంచి అత్యవసర అనుమతిని తీసుకున్నాం. ఈ వారం పదివేల సాచెట్స్‌ విడుదలవుతాయి. వచ్చే వారం మరి కొన్ని విడుదల అవుతాయి. ఇది జనరిక్‌ మాలిక్యుల్‌ కాబట్టి - డిమాండ్‌ ఆధారంగా ఉత్పత్తిని పెంచటానికి తగిన చర్యలు తీసుకుంటాం. డీఆర్‌డీఓ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఆసుపత్రులలోను.. ప్రభుత్వ ఆసుపత్రుల్లోను వీటిని అందించటానికి అన్ని ఏర్పాటు చేయాలనుకుంటున్నాం. దీనిని ప్రస్తుతం డాక్టర్‌ రెడ్డీస్‌ సంస్థ హైదరాబాద్‌, విశాఖపట్నంలలో ఉన్న తమ ప్లాంట్స్‌లో తయారుచేస్తోంది. ఈ మందుపై డీఆర్‌డీఓ ప్రొసెస్‌ పేటెంట్‌ను తీసుకుంది. అందువల్ల ఈ మందుపై హక్కులన్నీ డీఆర్‌డీఓకే ఉంటాయి’’

- డాక్టర్‌ జి. సతీష్‌రెడ్డి, ఛైర్మన్‌, డీఆర్‌డీఓ

ప్రత్యేకం మరిన్ని...