ప్రగతి భవన్‌లో 30 కేసులు

ABN , First Publish Date - 2020-07-04T08:15:52+05:30 IST

ముఖ్యమంత్రి కేసీఆర్‌ అధికారిక నివాసం ప్రగతి భవన్‌లో పలువురు సిబ్బందికి కరోనా

ప్రగతి భవన్‌లో 30 కేసులు

  • ప్రగతి భవన్‌లో 30 కేసులు
  • సీఎం భద్రతా విభాగం ఉన్నతాధికారికి సైతం
  • డ్రైవర్లు, సిబ్బందికీ పాజిటివ్‌
  • కేటరింగ్‌ సంస్థ వారితో వ్యాప్తి
  • ఎమ్మెల్యే సునీతకు కరోనా
  • 24 గంటల్లో 1,892 కేసులు
  • హైదరాబాద్‌లోనే 1,658
  • 20 వేలు దాటిన బాధితులు
  • 8 మంది మృత్యువాత
  • నెలాఖరుకు 60 వేల కేసులు!

హైదరాబాద్‌, జూలై 3 (ఆంధ్రజ్యోతి): ముఖ్యమంత్రి కేసీఆర్‌ అధికారిక నివాసం ప్రగతి భవన్‌లో పలువురు సిబ్బందికి కరోనా సోకింది. ఇక్కడ పనిచేస్తున్నవారిలో ఇప్పటివరకు 30 మందికి పాజిటివ్‌గా నిర్ధారణ అయినట్లు సమాచారం. అన్నివిధాల జాగ్రత్తలు పాటించే భవన్‌లో.. వైరస్‌ చిత్రంగా వ్యాపించింది. ఇక్కడి సిబ్బందిలో ఎవరూ నేరుగా కొవిడ్‌ బారిన పడలేదు. అయితే, సీఎం నిర్వహించే కార్యక్రమాలు, సమీక్షలకు హాజరయ్యే ప్రజా ప్రతినిధులకు స్నాక్స్‌, భోజనం పెట్టేందుకు ఓ కేటరింగ్‌ సంస్థకు కాంట్రాక్టు ఇచ్చారు.


ఆ సంస్థకు చెందిన ఏడుగురికి తొలుత మహమ్మారి సోకింది. ఆ విషయం బయటపడే సరికే వారి నుంచి ఇతరులకు వ్యాపించింది. ముఖ్యమంత్రి భద్రతా విభాగం కీలక అధికారికి కూడా కరోనా నిర్ధారణ అయింది. డ్రైవర్లు, మిగతా సిబ్బందికి కూడా పాజిటివ్‌ వచ్చింది. దీంతో ప్రగతి భవన్‌ను ఎప్పటికప్పుడు శానిటైజ్‌ చేస్తున్నారు. కాగా, వైరస్‌ బాధితుల్లో ఇప్పటికే కొందరు డిశ్చార్జ్‌ అయ్యారు. మరికొందరు చికిత్స పొందుతున్నారు. ఇంకొందరు క్వారంటైన్‌లో ఉన్నారు. ఆలేరు ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్‌ గొంగిడి సునీత కరోనా బారినపడ్డారు. దీంతో రాష్ట్రంలో వైరస్‌ బారినపడిన టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేల సంఖ్య నాలుగుకు చేరింది. సునీత భర్త, నల్లగొండ డీసీసీబీ చైర్మన్‌ మహేందర్‌రెడ్డి పరీక్ష ఫలితాలు రావాల్సి ఉంది. రంగారెడ్డి జిల్లా కలెక్టరేట్‌లో ఇప్పటికే ఏడుగురు ఉద్యోగులకు వైరస్‌ సోకగా.. శుక్రవారం మరో ఆరుగురికి పాజిటివ్‌ తేలింది.


ఎక్సైజ్‌ శాఖ మంత్రి శ్రీనివా్‌సగౌడ్‌ ఎస్కార్ట్‌లోని మరో ఇద్దరికి కరోనా నిర్ధారణ అయ్యింది. ఇప్పటికే మంత్రి భద్రతా సిబ్బందిలోని గన్‌మన్‌కు పాజిటివ్‌ వచ్చింది. ఇక, రాష్ట్రంలో 24 గంటల్లో అత్యధికంగా 1,892 మంది వైరస్‌ బారినపడ్డారు. మరో 8 మంది చనిపోయారు. తాజా కేసులతో రాష్ట్రంలో బాధితుల సంఖ్య 20,462కు చేరింది. దేశంలో మహారాష్ట్ర, తమిళనాడు, గుజరాత్‌, ఢిల్లీ, ఉత్తరప్రదేశ్‌, పశ్చిమ బెంగాల్‌లలోనే కేసులు 20 వేలు దాటాయి. తెలంగాణ ఏడో రాష్ట్రంగా నిలిచింది. కొత్త కేసుల్లో గ్రేటర్‌ హైదరాబాద్‌లోనే 1,658 ఉన్నాయి. రంగారెడ్డిలో 56, మేడ్చల్‌లో 44, వరంగల్‌ రూరల్‌లో 41, సంగారెడ్డిలో 20, నల్గొండలో 13, మహబూబ్‌నగర్‌లో 12 కేసులు నమోదయ్యాయి. శుక్రవారం 1,126 మంది కోలుకున్నారు. 9,984 యాక్టివ్‌ కేసులున్నాయి. 


3,726 నమూనాల్లో 2672 పాజిటివ్‌లు

హైదరాబాద్‌లోని ప్రముఖ ల్యాబ్‌ నిర్వాకం

ప్రభుత్వం ఆగ్రహం.. పరిశీలనకు కమిటీ

కేసులు రోజురోజుకు పెరిగిపోతున్న తరుణంలో వైరస్‌ నిర్ధారణ పరీక్షల్లో కచ్చితమైన ఫలితాలు ఇవ్వని హైదరాబాద్‌ నగరంలోని ఓ ప్రైవేట్‌ ల్యాబ్‌పై ప్రభుత్వం ఆగ్రహం వ్యక్తం చేసింది. ల్యాబ్‌ను పరిశీలించాలని నిపుణుల కమిటీని ఆదేశించింది. వాకి రిపోర్టుల్లో తప్పులుంటే కఠిన చర్యలు తీసుకునేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది. పేరొందిన ఈ ప్రైవేటు ల్యాబ్‌లో 3,726 టెస్టులు చేయగా అందులో 2,672 పాజిటివ్‌లు వచ్చాయి.  పాజిటివ్‌ రేటు ఏకంగా 71.7 శాతం. ఇంత భారీ వ్యత్యాసం అసాఽధారణమని వైద్య వర్గాలు చెబుతున్నాయి. గ్రేటర్‌ హైదరాబాద్‌లో ఉన్న తమ నాలుగు కేంద్రాల్లో స్వాబ్‌ల సేకరణను నిలిపివేసినట్లు ల్యాబ్‌ యాజమాన్యం ప్రకటించింది. ఆ ల్యాబ్‌లో వచ్చిన పాజిటివ్‌ కేసుల వివరాలను శుక్రవారం విడుదల చేసిన బులెటిన్‌లో కలపలేదని వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది.


కరోనాను జయించిన ఏడాది బాలుడు 

నారాయణపేట జిల్లా కృష్ణ మండలం తంగిడిగి గ్రామానికి చెందిన ఏడాది బాలుడు కరోనాను జయించాడు. బాలుడి గొంతులోపల్లీ ఇరుక్కోవడంతో గత నెలలో కర్ణాటకలోని ప్రైవేట్‌ ఆస్పత్రికి తీసుకెళ్లారు. గత నెల 21వ తేదీన పరీక్షలు నిర్వహించగా పాజిటివ్‌ వచ్చింది. తాజా పరీక్షల్లో నెగెటివ్‌ రావడంతో బాలుడిని స్వగ్రామానికి పంపారు.

Updated Date - 2020-07-04T08:15:52+05:30 IST