వచ్చే ఏడాది నాటికి ‘ఐటీ’లో 30 లక్షల ఉద్యోగాలు ఉఫ్‌

ABN , First Publish Date - 2021-06-17T09:00:08+05:30 IST

అన్ని ఇండస్ట్రీల్లో, ముఖ్యంగా టెక్నాలజీ రంగంలో యాంత్రీకరణ శరవేగంగా జరుగుతోందని బ్యాంక్‌ ఆఫ్‌ అమెరికా (బోఫా) తాజా నివేదిక పేర్కొంది. తత్ఫలితంగా భారత సాఫ్ట్‌వేర్‌ రంగంలో ఉద్యోగుల సంఖ్య

వచ్చే ఏడాది నాటికి ‘ఐటీ’లో 30 లక్షల ఉద్యోగాలు ఉఫ్‌

ఆటోమేషనే కారణం: బోఫా 

 

ముంబై: అన్ని ఇండస్ట్రీల్లో, ముఖ్యంగా టెక్నాలజీ రంగంలో యాంత్రీకరణ శరవేగంగా జరుగుతోందని బ్యాంక్‌ ఆఫ్‌ అమెరికా (బోఫా) తాజా నివేదిక పేర్కొంది. తత్ఫలితంగా భారత సాఫ్ట్‌వేర్‌ రంగంలో ఉద్యోగుల సంఖ్య 2022 నాటికి 30 లక్షల మేర తగ్గవచ్చని నివేదిక వెల్లడించింది.  దాంతో సాఫ్ట్‌వేర్‌ కంపెనీలకు ఏటా 10,000 కోట్ల డాలర్ల మేర (సుమారు రూ.7.3 లక్షల కోట్లు) ఆదా జరగనుందని అంచనా. ఐటీ, ఐటీఈఎస్‌ కంపెనీల ప్రాతినిఽథ్య మండలి నాస్కామ్‌ ప్రకారం.. దేశీయ ఐటీ రంగంలో 1.6 కోట్ల మంది పనిచేస్తున్నారు. అందులో 90 లక్షల మంది తక్కువ నైపుణ్యంతో కూడిన సేవలందిచేవారు, బిజినెస్‌ ప్రాసెస్‌ ఔట్‌సోర్సింగ్‌ (బీపీఓ) విభాగాల్లో విధులు నిర్వహిస్తున్నవారే. ఈ 90 లక్షల మందిలో 30 శాతం మంది (30 లక్షలు) వచ్చే ఏడాది నాటికి ఉద్యోగాలు కోల్పోవచ్చని, ఇందుకు ప్రధాన కారణాల్లో రోబో ప్రాసెస్‌ ఆటోమేషన్‌ (ఆర్‌పీఏ) ఒకటి కానుందని బోఫా వెల్లడించింది. ఆర్‌పీఏ ఏకంగా 7 లక్షల మందిని భర్తీ చేయవచ్చని, సాంకేతిక ఆధునీకరణ, అప్‌స్కిల్లింగ్‌ కారణంగా మిగతా ఉద్యోగాలు మాయం కానున్నాయని రిపోర్టు పేర్కొంది. 


కరోనా 2.0లో అధికంగా ఉద్యోగాలు కోల్పోయింది వారే.. 

కరోనా రెండో దశ ఉధృతితో యువత, వయసు పైబడిన వారే అధికంగా ఉద్యోగాలు కోల్పోయినట్లు ఫైనాన్షియల్‌ టెక్నాలజీ కంపెనీ ఎఫ్‌ఐఎస్‌ తాజా సర్వే వెల్లడించింది. ఏప్రిల్‌లో జరిపిన ఈ సర్వేలో భాగంగా భారత్‌లో 2,000 మంది నుంచి వివరాలు సేకరించిందీ సంస్థ. సర్వేలో పాల్గొన్న 55 ఏళ్లకు పైబడినవారిలో 6 శాతం మంది కరోనా సంక్షోభం కారణంగా తమ ఉద్యోగాన్ని శాశ్వతంగా కోల్పోయామన్నారు. 24 ఏళ్ల లోపు వారిలో  11 శాతం మంది శాశ్వతంగా ఉద్యోగం కోల్పోయామని వెల్లడించారు. 

Updated Date - 2021-06-17T09:00:08+05:30 IST