రూ.3.31కోట్ల గంజాయి పట్టివేత

ABN , First Publish Date - 2021-04-14T05:37:46+05:30 IST

ఎన్ని నియంత్రణల విధించినా గంజాయి అక్రమ రవాణా కొనసాగుతూనే ఉంది. భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం జిల్లాల్లో మంగళవారం పలుచోట్ల పోలీసులు భారీగా గంజాయిని సీజ్‌ చేశారు.

రూ.3.31కోట్ల గంజాయి పట్టివేత
విలేకరుల సమావేశంలో పట్టుకున్న గంజాయి వివరాలు వెల్లడిస్తున్న భద్రాద్రి జిల్లా ఎస్పీ సునిల్‌దత్‌

వివరాలు వెల్లడించిన భద్రాద్రి ఎస్పీ సునిల్‌దత్‌ 

కొత్తగూడెం/భద్రాచలం/ఏన్కూరు, ఏప్రిల్‌ 13: ఎన్ని నియంత్రణల విధించినా గంజాయి అక్రమ రవాణా కొనసాగుతూనే ఉంది. భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం జిల్లాల్లో మంగళవారం పలుచోట్ల పోలీసులు భారీగా గంజాయిని సీజ్‌ చేశారు. కొత్తగూడెం పట్టణ సమీపంలోని చుంచుపల్లి పోలీస్‌స్టేషన్‌ పరిధిలోని బృందావన్‌ గ్రామం వద్ద చుంచుపల్లి ఎస్‌ఐ మహేష్‌ తన సిబ్బందితో కలిసి వాహన తనిఖీ నిర్వహిస్తుండగా కొత్తగూడెం నుంచి ఖమ్మం వైపు వెళుతున్న ఏపీ 28 డబ్ల్యు 8974 నెంబర్‌గల ఐషర్‌ వాహనాన్ని తనిఖీ చేయగా అందులో 2,200కేజీల గంజాయి బయటపడింది. దాని విలువ సుమారు రూ.3.31కోట్లు ఉంటుందని భద్రాద్రి జిల్లా ఎస్పీ సునిల్‌దత్‌ మంగళవారం చుంచుపల్లి పోలీస్‌ స్టేషన్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వెల్లడించారు. సదరు వాహన డ్రైవర్‌ షేక్‌ మహబూబ్‌ను పోలీసులు అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రం తూర్పు గోదావరి జిల్లా చింతూరు అటవీ ప్రాంతం నుంచి ఆ గంజాయిని హైదరాబాద్‌కు తరలించినట్లు విచారణలో తేలిందన్నారు. చుంచుపల్లి పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదుచేసి షేక్‌ మహబూబ్‌ను కోర్టుకు తరలించినట్లు ఎస్పీ తెలిపారు. భారీ మొత్తంలో గంజాయిని పట్టుకున్న చుంచుపల్లి ఎస్‌ఐ మహేష్‌, పోలీస్‌ సిబ్బందిని జిల్లా ఎస్పీ అభినందించారు. సమావేశంలో చుంచుపల్లి సీఐ గురుస్వామి, ఎస్‌ఐ మహేష్‌, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు. 

భద్రాచలం, ఏన్కూరులో 60కిలోలు..

భద్రాచలంలోని అటవీశాఖ చెక్‌పోస్టు వద్ద మంగళవారం రూ.3లక్షలు విలువైన 20 కేజీల గంజాయిని భద్రాచలం పోలీసులు పట్టుకున్నారు. పట్టణ సీఐ టి.స్వామి తన సిబ్బందితో తనిఖీ చేస్తుండగా ఒక కారులో గంజాయి బయటపడింది. దాంతో అందులో ప్రయాణిస్తున్న ఉత్తరప్రదేశ్‌కు చెందిన హమీద్‌ఖాన్‌ను స్టేషన్‌కు తరలించి విచారించగా గంజాయిని ఒడిశా నుంచి ఉత్తరప్రదేశ్‌కు తీసుకెళ్తున్నట్లు అంగీకరించినట్లు సీఐ తెలిపారు. ఖమ్మం జిల్లా ఏన్కూరులోనూ మంగళవారం సాయంత్రం 40కిలోల గంజాయిని పోలీసులు పట్టుకుని ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. ఎస్‌ఐ ఎలగందుల శ్రీకాంత్‌, టాస్క్‌ఫోర్స్‌ ఎస్‌ఐ సతీష్‌ ఆధ్వర్యంలో జరిపిన వాహనాల తనిఖీల్లో  కారులో తరలిస్తున్న 40కిలోల గంజాయి పట్టుకున్నారు. దాని విలువ రూ.2లక్షలు ఉంటుందని ఎస్‌ఐ శ్రీకాంత్‌ తెలిపారు. ప్రధాన నిందితుడైన కుమార్‌ తప్పించుకోగా విశ్వాస్‌, సుదిపల్‌ అనే వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. వీరు ఒడిశాలోని కలిమెలబ్లాక్‌ ప్రాంతానికి చెందినవారుగా గుర్తించారు.  


Updated Date - 2021-04-14T05:37:46+05:30 IST