34039 బియ్యం కార్డులు రద్దు

ABN , First Publish Date - 2021-10-04T05:48:42+05:30 IST

జిల్లాలో బియ్యం కార్డులకు భారీగా కోత పడింది. అక్టోబరు నెలలో 34039 కార్డులకు శుక్రవారం నుంచి సరుకులు నిలిపేశారు. సెప్టెంబరులో 1172770 బియ్యం కార్డులకు సరుకులు ఇచ్చిన ప్రభుత్వం అక్టోబరు నెలకు గాను 1138731 కార్డులకు మాత్రమే రేషన్‌ కోటాను విడుదల చేసింది.

34039 బియ్యం కార్డులు రద్దు



ఆన్‌లైన్‌లో కార్డుల వివరాల తొలగింపు


చిత్తూరు కలెక్టరేట్‌, అక్టోబరు 3: జిల్లాలో బియ్యం కార్డులకు భారీగా కోత పడింది. అక్టోబరు నెలలో 34039 కార్డులకు శుక్రవారం నుంచి సరుకులు నిలిపేశారు. సెప్టెంబరులో 1172770 బియ్యం కార్డులకు సరుకులు ఇచ్చిన ప్రభుత్వం అక్టోబరు నెలకు గాను 1138731 కార్డులకు మాత్రమే రేషన్‌ కోటాను విడుదల చేసింది. యథావిధిగా రేషన్‌ కోసం మొబైల్‌ వాహనాల వద్దకు వెళ్లిన కొందరికి తమ కార్డులు రద్దయ్యాయని తెలిసి ఆవేదనకు గురయ్యారు. ఎందుకు తొలగించారని ప్రశ్నిస్తే తమ వద్ద వివరాలు లేవంటూ డీలర్లు సమాధానం చెబుతున్నారు. రెండు నెలల క్రితం ప్రభుత్వ ఉద్యోగుల పేరిట ఉన్న కార్డులను తొలగించగా, ఆరు అంశాలు(సిక్స్‌ స్టెఫ్స్‌ వేలిడేషన్‌) ప్రాతిపదికన మరిన్ని కార్డులు అనర్హతకు గురయ్యాయి. వరుసగా మూడు నెలల పాటు సరుకులు తీసుకోకపోవడం, ఈకేవైసీ లేదన్న సాకులతో ఇప్పుడు కార్డులకు కోత పడింది. రద్దయిన కార్డుల వివరాలు ఆన్‌లైన్‌లో కనిపించడంలేదు. కాగా, కరోనా సాయంగా కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న ఉచిత బియ్యం ఈ నెల నుంచి వీరికి అందే పరిస్థితి లేదు. బియ్యం కార్డు తొలగింపుతో తాము పింఛను, అమ్మఒడి, విద్యాదీవెన, ఆసరా వంటి పథకాలన్నింటికీ దూరమవుతామని కార్డుదారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. శని, ఆదివారాలు కార్యాలయాలకు సెలవుకావడంతో కార్డులు ఎందుకు తొలగించారన్న దానికి సమాధానం అధికారుల నుంచి లభించలేదు.

Updated Date - 2021-10-04T05:48:42+05:30 IST