పేరుకే ‘ప్రజావాణి’

ABN , First Publish Date - 2022-01-19T05:26:40+05:30 IST

పేరుకు ప్రజావాణి నిర్వహిస్తున్నారని, సమస్యలు మాత్రం పరిష్కారం కావడం లేదని బాధితులు ఆరోపిస్తున్నారు.

పేరుకే ‘ప్రజావాణి’
బాధితుల సమస్యలు తెలుసుకుంటున్న కలెక్టర్‌ వల్లూరు క్రాంతి (ఫైల్‌)

- సమస్యలు పరిష్కారం కావడం లేదంటున్న బాధితులు

- తహసిల్దార్‌, కలెక్టర్‌ కార్యాలయాల వద్ద పడిగాపులు

- 2021 జనవరి నుంచి ఇప్పటివరకు 3,446 ఫిర్యాదులు

గద్వాల క్రైం, జనవరి 18 : పేరుకు ప్రజావాణి నిర్వహిస్తున్నారని, సమస్యలు మాత్రం పరిష్కారం కావడం లేదని బాధితులు ఆరోపిస్తున్నారు. కలెక్టరేట్‌ కార్యాలయంలో ప్రతీ సోమవారం నిర్వహించే ప్రజావాణికి వస్తున్న ఫిర్యాదుల్లో భూ సమస్యలే ఎక్కువగా ఉంటున్నాయి. వాటి పరిష్కారం కోసం ఇటు తహసిల్దార్‌, అటు కలెక్టర్‌ కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నామని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.  


సమస్య మళ్లీ మొదటికి..

ప్రత్యేక రాష్ట్ర ఆవిర్భావం అనంతరం జోగుళాంబ గద్వాల జిల్లా ఏర్పడిన తర్వాత కూడా సమస్యల పరిష్కారంలో విపరీతమైన జాప్యం జరుగుతోందని ప్రజలు ఆవేదన చెందుతున్నారు. గతంలో భూసమస్యలు వస్తే తహసీల్దార్‌ కార్యాలయంలో వీఆర్వోల ద్వారా పరిష్కారమయ్యేవి. అక్కడ కాకపోతే తహసీల్దార్‌ ద్వారా పరిష్కరించే అవకాశముండేది. తీవ్రమైన సమస్య అయితే ఆర్డీవో కార్యాలయంలో పరిష్కరించేవారు. ప్రస్తుతం ప్రతీ సోమవారం కలెక్టరేట్‌లో నిర్వహించే ప్రజావాణిలో భూ సమ్యలపై చేసిన ఫిర్యాదులను మళ్లీ తహసీల్దార్‌ కార్యాలయానికి పంపిస్తున్నారు. దీంతో సమస్య మళ్లీ మొదటికి వస్తోందని బాధితులు చెప్తున్నారు. 


పెండింగ్‌లో 1,022 ఫిర్యాదులు 

కలెక్టరేట్‌లో నిర్వహించే ప్రజావాణికి 2021 జనవరి ఒకటి నుంచి 2022, జనవరి 18 వరకు 3446 ఫిర్యాదులు వచ్చాయి. అందులో 2,424 ఫిర్యాదులను పరిష్కారం కోసం వివిధ కార్యాలయాలకు పంపించినట్లు అధికారులు తెలిపారు. మొత్తం ఫిర్యాదుల్లో 922 పెండింగ్‌లో ఉన్నాయని, మరో 100 ఫిర్యాదులను కూడా సంబంధిత అధికారులకు పంపించామని, మొత్తం మీద 1,022 పెండింగ్‌లో ఉన్నాయని కలెక్టరేట్‌ అధికారులు చెప్తున్నారు. 


బాధితుల ధర్నాలు, ఆందోళనలు

ప్రజావాణిలో ఫిర్యాదు చేసినా, సమస్య పరిష్కారం కాకపోవడంతో బాధితులు ధర్నాలు, ఆందోళనలు చేపట్టిన సంఘటనలున్నాయి. కొన్ని సార్లు బాధితులు ఆత్మహత్యాయత్నం చేసిన సందర్భాలు కూడా ఉన్నాయి. ప్రధానంగా భూ సమస్యల పరిష్కారం కోసం కలెక్టరేట్‌, తహసీల్దార్‌ కార్యాలయాల చుట్టూ చెప్పులరిగేలా తిరుగుతున్నా ఫలితం దక్కడం లేదని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రజావాణికి వస్తున్న సమస్యలలో 90 శాతానికి పైగా భూసమస్యలే ఉన్నాయని అధికారులు చెప్తున్నారు. కానీ అవి పరిష్కారానికి నోచుకోవడం లేదని ఫిర్యాదుదారులు చెప్తున్నారు. దీంతో సహనం నశించి ఆందోళనలు చేపట్టాల్సి వస్తోందని అంటున్నారు. ఇప్పటికైనా సమస్యలను వెంటనే పరిష్కరించేలా అధికారులు చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. 


రెండు సంవత్సరాల నుంచి తిరుగుతున్నా... 

సలీమ్‌, వేముల, ఇటిక్యాల మండలం :  మాకు ఇటిక్యాల మండలంలోని వేముల గ్రామంలో సర్వేనెంబర్‌ 27/బిలో 17.36 గుంటలు భూమి ఉంది. కానీ రికార్డుల్లో ఇనామ్‌ అని నమోదు చేసారు. పట్టాదారు పాస్‌ బుక్‌ మా పేరుపై ఉన్నా అధికారులు పట్టించుకోవడం లేదు. ఈ సమస్య పరిష్కారం కోసం రెండు సంవత్సరాలు తిరుగుతున్నా ఫలితం దక్కడం లేదు. వక్ఫ్‌బోర్డు అధికారి దగ్గరకు వెళ్తే తహసీల్దార్‌ వద్దకు వెళ్లాలని చెప్తున్నారు, అక్కడికి వెళ్తే వక్ఫ్‌బోర్డ్‌కు వెళ్లాలని అంటున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి సమస్యను పరిష్కరించాలి.


సమస్యల పరిష్కారానికి చర్యలు 

ప్రజావాణికి వచ్చిన సమస్యలను పరిష్కరించే దిశగా ముందుకెళ్తున్నాం. ఏ శాఖకు సంబంధించిన సమస్య వచ్చినా, వెంటనే సంబంధిత అధికారికి పంపించి పరిష్కారానికి చర్యలు తీసుకుంటున్నాం. చాలా సమస్యలను పరిష్కరించాం. మిగిలిన వాటిని త్వరలో పరిష్కరించేందుకు కృషి చేస్తున్నాం.

- రఘురామ్‌శర్మ, అదనపు కలెక్టర్‌ 

Updated Date - 2022-01-19T05:26:40+05:30 IST