హైదరాబాద్‌లో స్టేట్‌ బ్యాంక్‌కు 3.50 కోట్ల మోసం

ABN , First Publish Date - 2021-07-01T15:17:02+05:30 IST

స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా(ఎస్‌బీఐ)కి రూ. 3.50కోట్ల మోసం

హైదరాబాద్‌లో స్టేట్‌ బ్యాంక్‌కు 3.50 కోట్ల మోసం

  • నవీన్‌ ఎంటర్‌ప్రైజె‌స్‌తో పాటు నలుగురిపై సీబీఐ కేసు


హైదరాబాద్‌ : ఫోర్జరీ పత్రాలతో రుణాన్ని పొంది స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా(ఎస్‌బీఐ)కి రూ. 3.50కోట్ల మోసం చేసిన హైదరాబాద్‌కు చెందిన నవీన్‌ ఎంటర్‌ప్రైజె‌స్‌పై సీబీఐ బుధవారం కేసు నమోదు చేసింది. ఈ కేసులో ఎస్బీఐ పరిశ్రమ భవన్‌ బ్రాంచ్‌ మేనేజర్‌ అబ్దూల్‌ రవూఫ్‌ పాషాతోపాటు నవీన్‌ ఎంటర్‌ ప్రైజెస్‌ మేనేజింగ్‌ పార్టనర్లు విజయ్‌భాస్కర్‌ తాడికొండ, మోహిన్‌ మహ్మద్‌, మహ్మద్‌ ముజఫర్‌ హుస్సేన్‌లపైనా అభియోగాలు మోపింది. వస్త్ర వ్యాపారాన్ని విస్తరించేందుకు తమ సంస్థ పేరున రుణాన్ని మంజూరు చేయాలంటూ విజయ్‌భాస్కర్‌, మహ్మద్‌మెహిన్‌, మహ్మద్‌ ముజఫర్‌ హుస్సేన్‌లు హైదరాబాద్‌లోని ఎస్‌బీఐ పరిశ్రమభవన్‌ బ్రాంచ్‌లో దరఖాస్తు చేశారు.


ఆ బ్రాంచ్‌ మేనేజర్‌ అబ్దుల్‌ రవూఫ్‌ పాషా సాయంతో ఫోర్జరీ పత్రాలను సమర్పించి 2018లో రూ.3.50 కోట్ల రుణాన్ని పొందారు. ఆ నగదును వస్త్రవ్యాపారానికి వినియోగించకుండా దారి మళ్లించారు. సకాలంలో రుణం కూడా చెల్లించలేదు. అసలు విషయం తెలుసుకున్న ఎస్‌బీఐ ఉన్నతాధికారులు సీబీఐకి ఫిర్యాదు చేయడంతో ఈ మోసం వెలుగు చూసింది.

Updated Date - 2021-07-01T15:17:02+05:30 IST