36 గంటలు బాబు దీక్ష

ABN , First Publish Date - 2021-10-21T08:19:05+05:30 IST

తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంపై వైసీపీ దాడికి నిరసనగా 36 గంటలపాటు దీక్ష చేయాలని ఆ పార్టీ అధినేత చంద్రబాబు నిర్ణయించారు.

36 గంటలు బాబు దీక్ష

  • వేదిక కానున్న టీడీపీ కేంద్ర కార్యాలయం
  • నేటి ఉదయం 8 గంటల నుంచి శుక్రవారం సాయంత్రం 8 గంటల వరకూ...

అమరావతి, అక్టోబరు 20(ఆంధ్రజ్యోతి): తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంపై వైసీపీ  దాడికి నిరసనగా 36 గంటలపాటు దీక్ష చేయాలని ఆ పార్టీ అధినేత చంద్రబాబు నిర్ణయించారు. గురువారం ఉదయం ఎనిమిది గంటలకు ఆయన ఈ దీక్షను మంగళగిరిలోని తమ పార్టీ కేంద్ర కార్యాలయం ఆవరణలో ప్రారంభిస్తారు. శుక్రవారం రాత్రి ఎనిమిది గంటల వరకూ దీక్ష జరుగుతుంది. ‘ప్రభుత్వ ఉగ్రవాదంపై పోరు’ పేరుతో ఈ దీక్ష నిర్వహించనున్నారు. దాడి జరిగిన పార్టీ కార్యాలయం ఆవరణలోనే దీనిని నిర్వహిస్తున్నారు. 


సజీవంగా విధ్వంసం గుర్తులు...

టీడీపీ కేంద్ర కార్యాలయంలో వైసీపీ కార్యకర్తలు సృష్టించిన విధ్వంసం గుర్తులను ఆ పార్టీ నాయకత్వం అలాగే ఉంచింది. పగిలిన అద్దాలు, కిటికీలు, తలుపులు, విరిగిన ఫర్నిచర్‌, గేటు, ధ్వంసమైన వాహనా... ఎలా ఉన్నవి అలాగే ఉంచారు. ఈ విధ్వంసంపై ఆ పార్టీ కార్యాలయ ఆహ్వాన కమిటీ సభ్యుడు కుమారస్వామి బుధవారం తెల్లవారుజామున మంగళగిరి రూరల్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు.  బుధవారం సాయంత్రం వరకూ పోలీసులు వచ్చి కార్యాలయాన్ని పరిశీలించలేదు. వారి పరిశీలన పూర్తయ్యేవరకూ వాటిని అంతే ఉంచాలని నిర్ణయించారు.  చంద్రబాబు దీక్షకు పోలీసులు బుధవారం అనుమతించారు. చంద్రబాబుకు పోటీగా రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాల్లో జనాగ్రహ దీక్షల పేరుతో దీక్షలు నిర్వహించాలని వైసీపీ నాయకత్వం నిర్ణయించింది. 


నేడు గవర్నర్‌ను కలవనున్న నేతలు

రాష్ట్ర గవర్నర్‌ విశ్వ భూషణ్‌ హరి చందన్‌ను టీడీపీ నేతలు గురువారం సాయంత్రం కలవనున్నారు. సాయంత్రం ఐదు గంటలకు వారికి ఆయన సమయం ఇచ్చారు. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు, శాసన మండలి ప్రతిపక్ష నేత యనమల రామకృష్ణుడు, పీఏసీ చైర్మన్‌ పయ్యావుల కేశవ్‌ తదితరులు గవర్నర్‌ వద్దకు వెళ్తున్నారు. 

Updated Date - 2021-10-21T08:19:05+05:30 IST