రైతుల ఉద్యమంపై స్పందించాలంటూ విదేశాంగ కార్యదర్శికి యూకే ఎంపీలు లేఖ

ABN , First Publish Date - 2020-12-06T01:50:50+05:30 IST

కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన వ్యవసాయ చట్టాలను వ్యతిరేకిస్తూ రైతులు భారీ స్థాయిలో ఉద్యమాన్ని

రైతుల ఉద్యమంపై స్పందించాలంటూ విదేశాంగ కార్యదర్శికి యూకే ఎంపీలు లేఖ

న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన వ్యవసాయ చట్టాలను వ్యతిరేకిస్తూ రైతులు భారీ స్థాయిలో ఉద్యమాన్ని నడుపుతున్న విషయం తెలిసిందే. భారత్‌లోని అనేక పార్టీలు ఇప్పటికే రైతులకు మద్దతును తెలిపాయి. భారత్‌తో పాటు విదేశాల నుంచి కూడా రైతులకు మద్దతు లభిస్తోంది. ఇటీవల కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో రైతుల నిరసనకు మద్దతు తెలిపి వార్తల్లో నిలిచారు. తాజాగా యూకేకు చెందిన ఎంపీలు కూడా రైతులకు బాసటగా నిలిచారు. యూకేలోని లేబర్ పార్టీకి చెందిన 36 మంది ఎంపీలు రైతులకు మద్దతుగా బ్రిటిష్ విదేశాంగ కార్యదర్శి డామినిక్ రాబ్‌కు లేఖ రాశారు. భారత్‌లో రైతుల నిరసనపై గళం విప్పాలంటూ లేఖలో ఎంపీలు ప్రస్తావించారు. 


‘భారత ప్రభుత్వం తీసుకొచ్చిన కొత్త వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రైతులు దేశవ్యాప్తంగా నిరసన కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. యూకేలోని సిక్కులు, పంజాబ్‌కు చెందిన వారు కూడా ఈ నిరసనల పట్ల ఆందోళన చెందుతున్నారు. తమ కుటుంబాలకు చెందిన వారు ఈ నిరసనల కారణంగా నష్టపోయినట్టు అనేక మంది సిక్కులు యూకేలోని ఎంపీలను కలిసి చెబుతున్నారు. పంజాబ్‌లోని మూడు కోట్ల జనాభాలో మెజారిటీ కుటుంబాలు వ్యవసాయంపైనే ఆధారపడ్డాయి. కాబట్టి కొత్త చట్టాలు వారికి డెత్ వారెంట్‌లా మారాయని కొందరు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. భారత్‌లోని ప్రస్తుతం జరుగుతున్న రైతుల నిరసనపై స్పందించాలి’ అంటూ డామినిక్ రాబ్‌కు రాసిన లేఖలో ఎంపీలు చెప్పుకొచ్చారు. 


కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో రైతులకు మద్దతు ప్రకటించడం దుమారమైంది. తాజాగా దీనిపై ఆయన మరోసారి స్పందిస్తూ.. ప్రపంచవ్యాప్తంగా శాంతియుతంగా ఎవరు నిరసనలు తెలిపినా తాను మద్దతు తెలుపుతానని కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో స్పష్టం చేశారు. మరోపక్క కెనడా ప్రధానికి మద్దతు తెలపాలంటూ యూకేలోని సిక్ కౌన్సిల్ అక్కడి రాజకీయ నేతలను ఇప్పటికే డిమాండ్ చేసింది.

Updated Date - 2020-12-06T01:50:50+05:30 IST